Royal Enfield Electric FF C6: ఇప్పటివరకు పెట్రోల్ ఇంజిన్ బైక్‌లతో దుమ్మురేపి అందర్నీ ఆకట్టుకున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ విభాగంలో కూడా సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ తయారు చేసిన మొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్ FF C6 చెన్నై వీధుల్లో కనిపించింది. టెస్టింగ్ చేస్తుండగా ప్రజల కంటపడింది. గత సంవత్సరం EICMA షోలో ఈ బైక్‌ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ బైక్‌టెస్టింగ్‌ కోసం వివిధ నగరాల్లో ప్రాంతాల్లో తిప్పుతున్నట్టు తెలుస్తోంది. ఈ బైక్‌ను అమ్మకానికి 2026 మొదటి త్రైమాసికంలో విడుదల చేయవచ్చని భావిస్తున్నారు.

ఫ్లయింగ్ ఫ్లీ లాంటి రెట్రో డిజైన్

FF C6 డిజైన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ బైక్ ఫ్లయింగ్ ఫ్లీ (1942-45) ఆధారంగా రూపొందించారు. గుండ్రని హెడ్‌లైంప్, గిర్డర్ ఫోర్క్స్, రెట్రో-స్టైల్ రియర్-వ్యూ మిర్రర్‌లు ఈ బైక్‌కు క్లాసిక్ లుక్ తీసుకొస్తాయి. ఇది చాలా సింపుల్, క్లీన్‌గా కనిపించేలా మినిమల్ బాడీ ప్యానెలింగ్‌ను కలిగి ఉంది.

బ్యాటరీ- కూలింగ్ సెటప్

బైక్‌లో అందించిన బ్యాటరీ కంపార్ట్‌మెంట్ ఫిన్-లాంటి నిర్మాణంతో వస్తుంది. ఇది చూడటానికి స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, బ్యాటరీని చల్లగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో 4 నుంచి 5 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుందని భావిస్తున్నారు, ఇది లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ఈ బ్యాటరీ ఎక్కువ సురక్షితమైనది. ఎక్కువ కాలం మన్నుతుంది. దీనితోపాటు యాక్టివ్ థర్మల్ కంట్రోల్, సెల్-లెవెల్ మానిటరింగ్ వంటి అధునాతన ఫీచర్‌లు కూడా ఉంటాయి.

రేంజ్ -పనితీరు

కంపెనీ ఇంకా అధికారిక స్పెసిఫికేషన్‌లను వెల్లడించలేదు, వివిధ మార్గాల్లో అందుతున్న సమాచారం ప్రకారం ఈ బైక్ దాదాపు 250cc నుంచి 350cc పెట్రోల్ బైక్ లాంటి పనితీరు కలిగి ఉంటుందని అంటున్నారు. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 100 నుంచి 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని అంచనా వేస్తున్నారు. ఇందులో మిడ్-మౌంటెడ్ మోటార్, బెల్ట్-డ్రైవ్ సిస్టమ్ ఉంటుంది, ఇది రైడ్‌ను సాఫీగా, శబ్దం లేకుండా చేస్తుంది.   

వీల్స్, సీటింగ్ , ఫీచర్‌లు

FF C6లో 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, క్లాసిక్ ఫెండర్‌లు ఉంటాయి. సీటింగ్ పొజిషన్ సౌకర్యవంతంగా ఉంటుంది. అవసరమైతే పిలియన్ సీటును కూడా తొలగించవచ్చు. భద్రత కోసం, ఇందులో డ్యూయల్-ఛానల్ ABS, డిస్క్ బ్రేక్‌లు స్టాండర్డ్‌గా ఉంటాయి. టెక్నాలజీ గురించి మాట్లాడితే, బైక్‌లో బ్లూటూత్-సపోర్ట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. ఇందులో కాల్స్, మెసేజ్‌లు, మ్యూజిక్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి సౌకర్యాలు ఉంటాయి. దీనితోపాటు, ఇందులో కీ-లెస్ సిస్టమ్, స్టార్ట్ బటన్‌ను ఫ్యూయల్ ట్యాంక్ లాగా కనిపించే యూనిట్‌పై ఉంచారు. ఇది మరింత ఆధునికంగా కనిపిస్తుంది.   

ఎప్పుడు విడుదలవుతుంది?

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన మొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్ FF C6 ని 2026 ఆరంభంలోనే విడుదల చేసే అవకాశం ఉంది. భారత్‌లో ఈ బైక్ మార్కెట్‌లో వచ్చిన తర్వాత  ఎలక్ట్రిక్ టూ-వీలర్ రంగంలోనే ఇదో గేమ్-ఛేంజర్‌గా మారుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే పోటీదారులంతా ఈ బైక్‌ స్పెషిఫికేషన్స్‌, రేటుపై ఫోకస్ చేశారు.