Electric Scooters In India : భారతీయ రోడ్లపై నిశ్శబ్ద విప్లవం మొదలైంది. ఒకప్పుడు ప్రయోగాత్మకంగా కనిపించిన ఎలక్ట్రిక్ వాహనాలు, ఇప్పుడు ప్రతి ఇంటి అవసరంగా మారిపోతున్నాయి. దేశీయ మార్కెట్‌లో ముఖచిత్రం మార్చే దిశగా పరుగులు పెడుతున్నాయి. పెట్రోల్ ధరల సెగ నుంచి తప్పించుకోవడానికి, సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో 50కిపైగా ప్రధాన మోడళ్లు, వేరియంట్లతో కలిపి వందకుపైగా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఉన్న ఆప్షన్స్‌ ఏంటీ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 

ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్, ఏథర్‌, టీవీఎస్, బజాజ్‌ వంటి దిగ్గజాలతో పాటు హోండా, రివర్, సింపుల్ ఎనర్జీ వంటి సుమారు 20 కంపెనీలు రంగంలో ఉన్నాయి. ప్రభుత్వం అందిస్తున్న FAME సబ్సిడీలు, వేగంగా విస్తరిస్తున్న ఛార్జింగ్ స్టేషన్ల వల్ల వినియోగదారుల్లో నమ్మకం పెరిగింది. ముఖ్యంగా కిలోమీటర్‌కు ప్రయాణ ఖర్చు కేవలం 50 పైసలు నుంచి రూపాయి లోపే ఉండటం మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఊరట. ఎక్స్ షోరూమ్‌ ధరలు 45వేల నుంచి ప్రారంభమై ప్రీమియం మోడళ్ల వరకు 1.90 లక్షల వరకు పలుకుతున్నాయి. 

వేగం, టెక్నాలజీలో మేటీ ఓలా- ఏథర్‌

యువతను, టెక్నాలజీ ప్రియులను ఆకట్టుకోవడంలో ఓలా, ఏథర్‌ సంస్థలు ముందు వరసలో ఉన్నాయి. 

ఓలా ఎస్‌1 ప్రో

ఇది పర్ఫార్మెన్స్‌కు కేరాఫ్ అడ్రస్‌. దీని దర 1.30 లక్షల నుంచి 1.55 లక్షల మధ్య ఉంది. దీని టాప్ స్పీడ్ గంటకు 141కిలోమీటర్ల వరకు ఉంటుంది. కేవలం 2 సెకన్లలోనే 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇందులో ఉన్న టీఎఫ్టీ డిస్‌ప్లే, రీజెన్ బ్రేకింగ్, హైపర్ ఛార్జర్‌ ద్వారా 15 నిమిషాల్లోనే 50 కిలోమీటర్ల ప్రయాణానికి సరిపడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. 

ఏథర్‌ 450ఎక్స్‌: 

ఏథర్‌ 450ఎక్స్ ధర 1.48 నుంచి 1.68 లక్షల వరకు ఉంటుంది. ఇది తన ప్రీమియం బిల్డ్ క్వాలిటీకి, గూగుల్ మ్యాప్స్‌ నావిగేషన్‌ వంటి స్మార్ట్ ఫీచర్లు ప్రసిద్ధి. దీని రేంజ్ సుమారు 161 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 

కుటుంబ అవసరాలకు సరిపడే ఫ్యామిలీ స్కూటర్లు

మీరు కుటుంబం మొత్తం వాడుకోవడానికి, ఎక్కువ సీటు వెడల్పు, స్టోరేజ్‌ కావాలనుకుంటే ఈ కింది ఆప్షన్స్ ట్రై చేయవచ్చు. 

ఏథర్‌ రిజ్టా: ఏథర్ నుంచి వచ్చిన మొదటి ఫ్యామిలీ స్కూటర్ ఇది. దీని ధర 76 వేల నుంచి 1.12 లక్షల వరకు ఉంది. విశాలమైన సీటు, ఎక్కువ లెగ్ స్పేస్‌ దీని ప్రత్యేకతలు. 

బజాజ్ చేతక్‌: 

పాత జ్ఞాపకాలను ఆధునిక హంగులతో తీసుకొచ్చే చేతక్‌, రెట్రో లుక్‌తో ఆకట్టుకుంటోంది. దీని ర 1.07 లక్షల నుంచి 1.40 లక్షల వరకు ఉంది. ఇది క్లాసిక్‌ లుక్ ఇష్టపడే వారికి, మెటల్ బాడీ కోరుకునే వారికి సరైంది. 

టీవీఎస్‌ ఐక్యూబ్‌: 

నమ్మకమైన సర్వీస్‌ నెట్‌ర్క్ కావాలనుకునే వారికి ఐక్యూబ్‌ బెస్ట్ ఛాయిస్‌. దీని రేంజ్ వేరియంట్లను బట్టి 123 నుంచి 212 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 

బడ్జెట్‌లో కొత్తగా ప్రయోగం చేయాలంటే...

డబ్బును ఆదా చేస్తూనే ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకునే వారికి ఉన్న ఆప్షన్లు ఒకసారి చూద్దాం. 

హీరో విడా వీఎక్స్‌ 2

దీని ధర 45వేల నుంచి ప్రారంభమవుతుంది. ముఖ్యంగా బాస్‌ ఆప్షన్ ద్వారా బ్యాటరీని అద్దెకు తీసుకొని, ప్రారంభ ధరను భారీగా తగ్గించుకోవచ్చు.

హోండా యాక్టివా ఈ: హోండాపై ఉన్న నమ్మకంతో మార్కెట్‌లోకి వచ్చిన ఈ స్కూటర్‌ 1.18 లక్షల ధరతో అందుబాటులో ఉంది.  ఇది హ్యాండ్లింగ్‌పరంగా చాలా సులభంగా ఉంటుంది. 

సింపుల్‌ వన్ జెన్‌ 2

రేంజ్ విషయంలో ఇది అందరికంటే ముందుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 265 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. 

ఎవరికి ఏది ఉత్తమం?

తక్కువ ప్రయాణాలు చేసే వారికి అంటే 50 కిలోమీటర్ల లోపు ట్రావెల్ చేసే వారికి హీరో విడా లేదా టీవీఎస్‌ ఆర్బిటర్‌ వంటివి సరిపోతాయి. ఇవి తక్కువ మెయింటెనెన్స్‌తో ఉంటాయి. ఏథర్‌ రిజ్తా లేదా బజాజ్‌ చేతక్‌ కుటుంబ అవసరాల కోసం చూసే వారికి బెస్ట్ అని చెప్పవచ్చు. సామాన్లు పెట్టుకోవడానికి ఎక్కువ స్థలం ఉంటుంది. లాంగ్ డ్రైవ్ చేసే వారికి  సింపుల్ వన్ జెన్ 2 లేదా ఓలా ఎస్‌1 ప్రో హై వేరియంట్లను పరిశీలించవచ్చు. టీవీఎస్‌, హోండా, బజాజ్‌ సంస్థలకు దేశవ్యాప్తంగా సర్వీస్ సెంటర్లు ఉండటం వల్ల భవిష్యత్‌లో ఇబ్బందులు ఉండవు.