Virtus Taigun Manual Discontinued: వోక్స్‌వ్యాగన్ అభిమానులకు, ముఖ్యంగా మాన్యువల్ డ్రైవింగ్ ఇష్టపడే ఔత్సాహికులకు భారీ షాక్‌ లాంటి అప్‌డేట్‌ బయటకు వచ్చింది. వోక్స్‌వ్యాగన్ ఇండియా... విర్టస్ సెడాన్‌ & టైగన్ మిడ్‌సైజ్ SUVల్లో అందుబాటులో ఉన్న 1.5 లీటర్ TSI మాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్లను నిశ్శబ్దంగా నిలిపివేసింది. ఇకపై ఈ పవర్‌ఫుల్ 1.5 TSI ఇంజిన్‌తో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మాత్రమే కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

Continues below advertisement

1.5 TSI మాన్యువల్ ఎందుకు ప్రత్యేకం?

విర్టస్‌, టైగన్ మోడళ్లలో ఉన్న 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 150hp పవర్‌ అందిస్తుంది. ఈ ఇంజిన్ డ్రైవింగ్ పరంగా చాలా ఫన్‌ ఇస్తుందని పేరు ఉంది. లైట్ బాడీ, శక్తిమంతమైన ఇంజిన్, మాన్యువల్ గేర్‌బాక్స్ కలయిక వల్ల ఇది డ్రైవింగ్‌ను ఇష్టపడే వారిని ఆకర్షించింది. టైగన్‌లో ఈ మాన్యువల్ వేరియంట్ మొదటి నుంచే ఉండగా, విర్టస్‌లో జూన్ 2023లో అందుబాటులోకి వచ్చింది.

Continues below advertisement

ధర పరంగా మాన్యువల్‌కు ప్లస్‌

1.5 TSI మాన్యువల్ వేరియంట్లు, అదే ఇంజిన్‌తో ఉన్న DCT ఆటోమేటిక్ వేరియంట్లతో పోలిస్తే ధర తక్కువగా ఉండేవి. చివరిగా ఉన్న ధరల ప్రకారం, విర్టస్ 1.5 TSI మాన్యువల్ ధర రూ.17.09 లక్షల నుంచి రూ.17.33 లక్షల వరకు ఉండగా, టైగన్ 1.5 TSI మాన్యువల్ ధర రూ.17.04 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర)గా ఉంది.

ఇప్పుడు ధరలు ఎలా మారాయి?

మాన్యువల్ వేరియంట్లు నిలిపివేయడంతో, 1.5 TSI ఇంజిన్‌తో ఉన్న విర్టస్‌, టైగన్‌ల ప్రారంభ ధరలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం విర్టస్ 1.5 TSI DCT ధర రూ.18.80 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, టైగన్ 1.5 TSI DCT ధర రూ.18.95 లక్షల నుంచి మొదలవుతోంది. అంటే మాన్యువల్‌తో పోలిస్తే దాదాపు రూ.1.5 లక్షల వరకు అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మాన్యువల్ కావాలంటే ఏ ఆప్షన్?

ఇకపై విర్టస్ లేదా టైగన్‌ను మాన్యువల్ గేర్‌బాక్స్‌తో కొనాలంటే, 1.0 లీటర్ మూడు సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌నే ఎంచుకోవాలి. ఇది 115hp పవర్ అందిస్తుంది. సిటీ డ్రైవింగ్‌కు ఇది సరిపోతున్నా, 1.5 TSI ఇచ్చే డ్రైవింగ్ థ్రిల్ మాత్రం ఇవ్వదు. 

స్కోడా కూడా అదే దారి

వోక్స్‌వ్యాగన్‌కు సోదర బ్రాండ్ అయిన స్కోడా కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. స్కోడా స్లావియా, కుషాక్ మోడళ్లలో ఉన్న 1.5 TSI మాన్యువల్ వేరియంట్లను సెప్టెంబర్ 2024లోనే నిలిపివేసింది. దీంతో వోక్స్‌వ్యాగన్ గ్రూప్ మొత్తం 1.5 TSI మాన్యువల్‌ను పూర్తిగా తప్పించినట్లైంది.

మార్కెట్‌లో మిగిలిన ఏకైక ఎంపిక

ప్రస్తుతం భారత మార్కెట్లో 4 సిలిండర్ టర్బో పెట్రోల్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తున్న ఏకైక మిడ్‌సైజ్ సెడాన్ హ్యుందాయ్ వెర్నా మాత్రమే. ఇది డ్రైవింగ్‌ ప్రేమికులకు ఒక ముఖ్యమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది.

మొత్తంగా చూస్తే, ఆటోమేటిక్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న ఈ కాలంలో, వోక్స్‌వ్యాగన్ తీసుకున్న ఈ నిర్ణయం వ్యాపారపరంగా అర్థవంతంగా ఉన్నప్పటికీ, మాన్యువల్ డ్రైవింగ్‌లో థ్రిల్‌ను ఇష్టపడే వారికి మాత్రం ఇది ఒక పెద్ద లోటే.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.