Volkswagen Taigun Facelift 2026: జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ తన పాపులర్ ఎస్‌యూవీ 'టైగూన్' (Taigun) ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను సిద్ధం చేస్తోంది. 2026 మధ్యలో ఇది లాంచ్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా ఎరుపు రంగులో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ (LHD) టెస్ట్ మోడల్ రోడ్లపై కనిపిస్తూ ఆటోమొబైల్ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. ఈ కొత్త వెర్షన్ ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.
సరికొత్త ఎక్స్‌టీరియర్ డిజైన్
పాత మోడల్‌లో ఉన్న రెక్టాంగులర్ హెడ్‌ల్యాంప్స్ స్థానంలో ఇప్పుడు కర్వీగా ఉండే ఐ-షేప్ (Eye-shaped) యూనిట్లు వచ్చాయి. పైన ఉండే ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు ఇప్పుడు మరింత మందంగా, స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రిల్ సెక్షన్‌లో ఫుల్-విడ్త్ ఎల్‌ఈడీ స్ట్రిప్‌తో పాటు వెలుగులీనే ఫోక్స్‌వ్యాగన్ లోగో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. బంపర్ డిజైన్‌ను కూడా మార్చారు. పాత మెష్ స్ట్రక్చర్‌కు బదులుగా హారిజాంటల్ స్లాట్లను చేర్చారు. సైడ్ ప్రొఫైల్‌లో పెద్దగా మార్పులు లేకపోయినా, కొత్తగా బ్లాక్ ఫినిషింగ్ ఉన్న అలాయ్ వీల్స్ కారుకు స్పోర్టీ లుక్ ఇస్తున్నాయి. వెనుక వైపు టెయిల్ లైట్లు ఇప్పుడు మరింత పెద్దవిగా మారి, ఒక ఎల్‌ఈడీ స్ట్రిప్‌తో అనుసంధానించబడి ఉన్నాయి. వెనుక బంపర్ కూడా ఇప్పుడు స్మూత్ ఫినిషింగ్‌తో లగ్జరీగా కనిపిస్తోంది.
హైటెక్ ఇంటీరియర్, ఫీచర్లు
లోపలి భాగంలో స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ లాంటి అప్‌డేట్స్ ఉండే అవకాశం ఉంది. వెనుక సీట్లలో మసాజర్ సౌకర్యం, పనోరమిక్ సన్‌రూఫ్, 10.25 అంగుళాల డిజిటల్ కాక్‌పిట్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి. గూగుల్ సపోర్ట్‌తో పనిచేసే ఏఐ (AI) కంపానియన్ యాప్, 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయి.
కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్
మెకానికల్ పరంగా చూస్తే, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌కు ఇప్పుడు కొత్తగా 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేస్తున్నారు. ఇది పాత 6-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్‌ను రీప్లేస్ చేయనుంది. 6-స్పీడ్ మాన్యువల్ ఆప్షన్ అలాగే కొనసాగుతుంది. ఇక పవర్‌ఫుల్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 150 PS శక్తిని, 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ డీఎస్‌జీ (DSG) గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. మార్కెట్లోకి వస్తే ఈ కారు హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
