Veloce Aperion revealed: టూస్ట్రోక్ మోటార్‌సైకిళ్లు దాదాపు చరిత్రలో కలిసిపోయాయని భావిస్తున్న సమయంలో UKకు చెందిన స్టార్టప్ సంస్థ Veloce Motorcycles ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే మోడల్‌ను ఆవిష్కరించింది. Aperion పేరుతో తీసుకొచ్చిన ఈ హైపర్ మోటార్‌సైకిల్ అత్యంత అరుదైన 1,000cc X8 టూస్ట్రోక్ ఇంజిన్‌తో రూపొందింది. లగ్జరీ కార్ల తరహాలో ఏకంగా 280hp పవర్‌ను ఉత్పత్తి చేసే ఈ బైక్ ఇంజినీరింగ్ పరంగా కొత్త ప్రమాణాలను సృష్టిస్తుందని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు.
Aperion అనే పేరు గ్రీకు పదమైన "Apeiron" నుంచి తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీనికి అపరిమితం లేదా అంతులేనిది అనే అర్థం వస్తుంది. ఈ బైక్ సామర్థ్యాన్ని ప్రతిబింబించేలా ఈ పేరును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: పవర్‌ఫుల్ 349cc ఇంజిన్‌తో కొత్త బజాజ్ డొమినార్ 400 - జంటగా దేశమంతా చుట్టి రావచ్చు!
X8 ఇంజిన్ఈ బైక్‌లో ఉపయోగించిన X8 ఇంజిన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇందులో ఎనిమిది సిలిండర్లను రెండు V4 బ్యాంకులుగా అమర్చి, మధ్యలో గేర్‌బాక్స్ ఏర్పాటు చేశారు. ఈ ఇంజిన్ 12,000 rpm వద్ద ఏకంగా 280hp పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఉపయోగించిన సిలిండర్లు Aprilia RS125 ఆధారంగా రూపొందించారు. ఇంధన సరఫరా కోసం ఎనిమిది 24mm Dellorto కార్బ్యురేటర్లను ఉపయోగించారు. ఇవన్నీ ప్రత్యేక స్పైరల్ థ్రాటిల్ కేబుల్ వ్యవస్థ ద్వారా పనిచేస్తాయి.
సాధారణ Four Stroke ఇంజిన్లతో పోలిస్తే Two Stroke ఇంజిన్లలో లూబ్రికేషన్ వ్యవస్థ భిన్నంగా ఉండటం వల్ల X8 కాన్ఫిగరేషన్‌ను అమలు చేయడం సులభమైందని Veloce తెలిపింది. ఈ డిజైన్ కారణంగా వ్యతిరేక దిశలో పనిచేసే పిస్టన్లు ఒకేసారి కదలడం వల్ల ఇంజిన్‌లో ఉత్పత్తయ్యే కంపనలు సహజంగానే తగ్గిపోతాయి. దీంతో, ఇంత పవర్‌లో కూడా ఈ బండి అత్యంత స్మూత్‌గా పని చేస్తుందని కంపెనీ పేర్కొంది.
Aperionలో మరో ప్రధాన ఆకర్షణ ప్రత్యేకంగా రూపొందించిన రెసోనెన్స్ ఎగ్జాస్ట్ సిస్టమ్. సాధారణంగా Two Stroke ఇంజిన్‌ల పనితీరులో ఎక్స్‌ప్యాన్షన్ ఛాంబర్లు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఎనిమిది ఛాంబర్లను ఒకే మోటార్‌సైకిల్‌లో అమర్చడం చాలా క్లిష్టమైన పని. దీనికి పరిష్కారంగా లేజర్ సిన్టరింగ్ టెక్నాలజీతో తయారు చేసిన ఆల్ అలాయ్ ఎగ్జాస్ట్ వ్యవస్థను కంపెనీ అభివృద్ధి చేసింది. ఈ టెక్నాలజీ ద్వారా సాధారణ పద్ధతులతో తయారు చేయలేని అత్యంత క్లిష్టమైన ఆకృతులను రూపొందించవచ్చు.
ఈ బైక్‌లో ఇంజిన్, ఛాసిస్ & ట్రాన్స్‌మిషన్‌ను ఒకే స్ట్రక్చరల్ యూనిట్‌గా రూపొందించారు. దీంతో బైక్ బరువు తగ్గడంతో పాటు నిర్మాణ దృఢత్వం కూడా గణనీయంగా పెరిగిందని కంపెనీ చెబుతోంది.
ఇది కూడా చదవండి: లీటర్‌కు 56km మైలేజ్, భారీ స్టోరేజ్ ఇస్తున్న Suzuki Burgman Street - కానీ ఈ రెండు లోపాలు నిరాశపరుస్తాయి!
కేవలం 24 యూనిట్లేVeloce Aperionను తొలిసారిగా లండన్‌లో నిర్వహించిన Bike Shed Moto Showలో ప్రదర్శించారు. ఈ హైపర్ బైక్ ఉత్పత్తిని కేవలం 24 యూనిట్లకే పరిమితం చేశారు. ఒక్కో బైక్ ధర £78,000గా నిర్ణయించారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.97.3 లక్షలకు సమానం. ఇండియాలో ఈ డబ్బుతో దాదాపు 10 మిడిల్‌క్లాస్ కార్లను లేదా ఒక మంచి విల్లాను కొనవచ్చు. 2027 నుంచి Veloce Aperion డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ప్రతి బైక్‌కు UKలో రోడ్లపై నడిపేందుకు అవసరమైన MSVA సర్టిఫికేషన్ కూడా అందించనున్నారు.
ఇదిలా ఉంటే, Veloce మరో వినూత్న మోడల్ Etherealను కూడా అభివృద్ధి చేస్తోంది. ఇందులో 500cc Four Cylinder Two Stroke ఇంజిన్ ఉండగా, ఇది 12,000 rpm వద్ద 145hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. తక్కువ బరువు, వేగవంతమైన హ్యాండ్లింగ్ & మరింత చురుకైన పనితీరుపై ఈ మోడల్‌ను కంపెనీ రూపొందిస్తోంది. ఆధునిక కాలంలో Two Stroke మోటార్‌సైకిళ్లకు మళ్లీ జీవం పోసే ప్రయత్నం చేస్తోంది Veloce Motorcycles.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
