Upcoming SUVs India 2025: భారతదేశంలో పండుగ సీజన్ ఆటోమొబైల్ పరిశ్రమకు ఎప్పుడూ ప్రత్యేకమైనది. ఈసారి, 2025లో కూడా, ఫెస్టివ్‌ సీజన్‌లో ఉత్సాహం పెంచడానికి కార్ కంపెనీలు కొత్త వాహనాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ లాంచ్‌లు, సెప్టెంబర్‌లో మారుతి కొత్త కాంపాక్ట్ SUV ఎస్కుడో (Maruti Escudo) తో ప్రారంభమవుతుంది. మారుతి సుజుకి మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ SUV - eVX (eVitara) కూడా లాంచ్‌కు రెడీగా ఉంది, ఈ బండి కోసం యావద్దేశం చాలా కాలంగా ఎదురుచూస్తోంది.

2025 ఫెస్టివ్‌ సీజన్‌లో లాంచ్‌ కానున్న SUVs

1. మారుతి ఎస్కుడో (Maruti Escudo)మారుతి సుజుకి, ఈ సంవత్సరం, కొత్త కాంపాక్ట్ SUV 'Escudo'ను విడుదల చేయనుంది. ఈ వెహికల్‌ను Arena షోరూమ్‌ల ద్వారా విక్రయిస్తారు. ఈ SUV గ్రాండ్‌ విటారా (Grand Vitara) కంటే కొంచెం చౌకగా & దాని కంటే తక్కువ కేటగిరీలో ఉంటుంది. యువ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని 'ఎస్కుడో'ను రూపొందించారు & దాని ధర కూడా అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.

2. మారుతి సుజుకి ఇ-విటారా (Maruti eVitara)మారుతి సుజుకి మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ SUV మారుతి eVitara అవుతుంది. ఈ మోడల్ చాలా కాలంగా వార్తల్లో ఉంది & ఎట్టకేలకు లాంచ్‌కు సిద్ధమైంది. ఈ కారు ద్వారా, మారుతి సుజుకీ, ఎలక్ట్రిక్ విభాగంలోకి అడుగు పెట్టబోతోంది, మార్కెట్‌ షేర్‌ సంపాదించుకోబోతోంది.

3. హ్యుందాయ్ వెన్యూ (న్యూ జెన్‌) - Hyundai Venue (New Gen)ఫెస్టివ్‌ సీజన్‌ కోసం హ్యుందాయ్ కూడా రెడీగా ఉంది. ఈ పండుగ కాలంలో, తన ప్రసిద్ధ SUV Venue లో కొత్త వెర్షన్‌ను విడుదల చేస్తుంది. ఈసారి మరిన్ని ఫీచర్లు, కొత్త ఇంటీరియర్ డిజైన్ & ఆధునిక స్టైలింగ్‌ను న్యూ-జెన్ వెన్యూలో చూడవచ్చు. దీనితో పాటు, Ioniq 5 EV ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కూడా ఉంటుందని భావిస్తున్నారు, ఇది కూడా అప్‌డేటెడ్‌ టెక్నాలజీ & మెరుగైన పనితీరును కలిగి ఉంటుంది.

4. మహీంద్రా బొలెరో (కొత్త తరం) - Mahindra Bolero (New Gen)మహీంద్రా బెస్ట్ సెల్లింగ్ SUV Bolero ఇప్పుడు కొత్త అవతారంలో వస్తోంది. కొత్త మోడల్ మరింత బాక్సీ & షార్ప్‌ డిజైన్‌తో వస్తుంది. దీనికి కొత్త ప్లాట్‌ఫామ్, మరిన్ని భద్రత లక్షణాలు & కొత్త ఇంజిన్ ఎంపికలు ఉంటాయి. బొలెరో, భారతీయ రోడ్లపై ఎప్పుడూ నమ్మదగిన వాహనం. ఇప్పుడు, మునుపటి కంటే మరింత అధునాతనంగా ఉంటుంది.

5. టాటా సియెర్రా ‍‌(Tata Sierra)ఫెస్టివ్‌ సీజన్‌ రేస్‌లో టాటా మోటార్స్ ఏమాత్రం వెనుకబడి లేదు. ఈ కంపెనీ, తన ఐకానిక్ SUV Sierra ను కొత్త & ఆధునిక జీవనశైలి SUVగా తిరిగి తీసుకువస్తోంది. ఈ SUV.. Curvv కంటే పై విభాగంలో & Harrier కు కింద విభాగంలోకి వస్తుంది. సియెర్రా రెండు వెర్షన్లలో అందుబాటులో ఉంటుంది - ఒకటి ఎలక్ట్రిక్ (EV) & మరొకటి అంతర్గత దహన యంత్రం (ICE). దీనిలో మరో ప్రత్యేకత ఏమిటంటే, సియెర్రా EV ఆల్-వీల్ డ్రైవ్ (AWD) వ్యవస్థతో వస్తోంది.

6. టాటా పంచ్‌ ఫేస్‌లిఫ్ట్‌ (Tata Punch Facelift)2021లో మార్కెట్‌లో లాంచ్‌ అయినప్పటి నుంచి Tata Punch లో ఎటువంటి పెద్ద కాస్మెటిక్ మార్పులు లేవు. ఇప్పుడు, దీని EV కౌంటర్‌పార్ట్‌కు అనుగుణంగా, కారు బయటి భాగం మారింది. క్యాబిన్‌లో చెప్పుకోదగ్గ మార్పులు చేశారు. పవర్‌ట్రెయిన్‌ మాత్రం మారలేదు, అదే 1.2L NA పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు.