Union Budget 2026 - Blended CNG: భారతదేశం గ్రీన్‌ ఇంధనాల వైపు మరో కీలక అడుగు వేసింది. Union Budget 2026లో భాగంగా కేంద్ర ప్రభుత్వం క్లీన్‌ ఫ్యూయెల్‌ రోడ్‌మ్యాప్‌ను మరింత విస్తరించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 20 శాతం ఎథనాల్‌ కలిపిన పెట్రోల్‌ (E20)ను 2025 ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో CNGలో కూడా బయోగ్యాస్‌ బ్లెండింగ్‌ను (CNG To Witness Bio-Gas Blending) దశలవారీగా అమలు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

Continues below advertisement

చాలా ప్రయోజనాలు

రవాణా అవసరాల కోసం ఉపయోగించే కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (CNG)లో కంప్రెస్డ్‌ బయో గ్యాస్‌ (CBG)ని తప్పనిసరిగా కలపాలని కేంద్రం నిర్ణయించింది. ఇది పెట్రోల్‌-ఎథనాల్‌ బ్లెండింగ్‌ విధానాన్ని తలపించే మరో పెద్ద మార్పుగా ఆటో రంగం భావిస్తోంది. ఈ చర్యతో ఫాసిల్‌ ఫ్యూయెల్‌పై (శిలాజ ఇంధనాలు) ఆధారపడటం తగ్గడంతో పాటు, కర్బన్‌ ఉద్గారాలు తగ్గే అవకాశం ఉందని భారత ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Continues below advertisement

ఆటోమొబైల్‌, ఎనర్జీ రంగాలకు మరో కీలక ప్రకటనగా CNGతో పాటు Piped Natural Gas (PNG)లో కూడా బయోగ్యాస్‌ బ్లెండింగ్‌ను అమలు చేయనున్నారు. దీని వల్ల సహజ వాయువు దిగుమతులపై ఖర్చు తగ్గడంతో పాటు, వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి బయోగ్యాస్‌ తయారీకి ఊతం లభిస్తుంది. రైతులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆటో మార్కెట్‌ పరంగా చూస్తే, E20 తర్వాత ఇది దేశంలో రెండో పెద్ద బ్లెండెడ్‌ ఫ్యూయెల్‌ మార్పుగా నిలవనుంది.

బడ్జెట్‌ 2026లో ఎలక్ట్రిక్‌ వాహనాల రంగంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలో EV ఎకోసిస్టమ్‌ను మరింత బలోపేతం చేస్తామని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. EVల తయారీతో పాటు ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు కేంద్రం మద్దతు ఇస్తుంది. ముఖ్యంగా ప్రజా రవాణాలో ఈ బస్సుల వినియోగాన్ని పెంచేందుకు ప్రత్యేక పేమెంట్‌ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేయనున్నారు. దీని ద్వారా రాష్ట్ర, నగర రవాణా సంస్థలకు ఆర్థిక భరోసా కలుగుతుంది.

దేశీయంగా బ్యాటరీల ఉత్పత్తి పెరిగే అవకాశం

బ్యాటరీ తయారీ విషయంలోనూ బడ్జెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎలక్ట్రిక్‌ వాహనాల బ్యాటరీల తయారీకి అవసరమైన 35 అదనపు క్యాపిటల్‌ గూడ్స్‌ను కస్టమ్స్‌ డ్యూటీ మినహాయింపు జాబితాలో చేర్చారు. అలాగే మొబైల్‌ ఫోన్‌ బ్యాటరీల తయారీకి అవసరమైన మరో 28 అంశాలకు కూడా డ్యూటీ మినహాయింపు ఇచ్చారు. దీని వల్ల దేశీయంగా లిథియమ్‌-అయాన్‌ బ్యాటరీల తయారీ పెరిగే అవకాశం ఉంది.

కీలక ఖనిజాల విషయంలోనూ కేంద్రం పెద్ద ఊరట ఇచ్చింది. కోబాల్ట్‌ పౌడర్‌, లిథియమ్‌-అయాన్‌ బ్యాటరీ స్క్రాప్‌, లీడ్‌, జింక్‌తో పాటు మరో 12 కీలక ఖనిజాలపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని పూర్తిగా రద్దు చేశారు. గత ఏడాది బడ్జెట్‌లో మినహాయించిన 25 ఖనిజాలకు ఇది అదనం. దీని వల్ల ముడి సరుకుల లభ్యత పెరిగి, తయారీ ఖర్చులు తగ్గే అవకాశముంది.

ఇదే బడ్జెట్‌లో రోడ్డు ప్రమాద బాధితులకు కూడా శుభవార్త చెప్పారు. మోటార్‌ యాక్సిడెంట్‌ క్లెయిమ్స్‌ ట్రిబ్యునల్‌ మంజూరు చేసే వడ్డీపై ఆదాయపన్ను పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. అలాగే ఆ వడ్డీపై TDS వర్తించదని స్పష్టం చేశారు. దీంతో బాధితులకు వచ్చే పరిహారం మొత్తం పూర్తిగా వారి చేతికి చేరుతుంది.

మొత్తంగా Union Budget 2026 గ్రీన్‌ ఫ్యూయెల్స్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలు, దేశీయ తయారీ, సంక్షేమం అన్నింటినీ కలిపిన సమగ్ర దిశను సూచిస్తోంది. ఈ నిర్ణయాలు రానున్న రోజుల్లో భారత ఆటో ఇండస్ట్రీ భవిష్యత్తును కొత్త దిశలో నడిపించే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.