Tyre Speed Rating Letters Meaning: హైవేపై వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడటం, బస్సు టైరు పేలి ప్రమాదం జరగడం లేదా లారీ టైర్ల నుంచి ఒక్కసారిగా మంటలు రావడం వంటి ఘటనల గురించి తరచూ విటుంటాం. ఇలాంటి ప్రమాదాలకు కేవలం అతివేగమే కారణం కాదని, చాలా సందర్భాల్లో వాహనానికి అమర్చిన టైర్ల స్పీడ్ రేటింగ్‌ను పట్టించుకోకపోవడమే అసలు కారణమని ఆటోమొబైల్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. టైర్‌పై కనిపించే చిన్న అక్షరాన్ని నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

ప్రతి టైర్‌పై అక్షరాలు & సంఖ్యలతో కూడిన ప్రత్యేక కోడ్ ఉంటుంది. అందులో చివరగా ఉండే ఇంగ్లీష్ అక్షరాన్ని 'టైర్ స్పీడ్ రేటింగ్' అంటారు. ఈ అక్షరం.. ఆ టైరు గరిష్ఠంగా ఎంత వేగాన్ని సురక్షితంగా తట్టుకోగలదో తెలియజేస్తుంది. చాలా మంది ఈ అక్షరాన్ని పట్టించుకోరు. మరికొందరికి దాని అర్థమే తెలియదు. కానీ వాహన భద్రతలో ఇది అత్యంత కీలకమైన అంశంగా నిపుణులు పేర్కొంటున్నారు.

ఇది కూడా చదవండి: 647km రేంజ్‌తో స్కోడా Peaq EV ఆవిష్కరణ - ఈ కారు నుంచి ఇంటికి కూడా కరెంటు వాడుకోవచ్చు

వాహన తయారీ సంస్థలు ప్రతి మోడల్‌కు తగిన స్పీడ్ రేటింగ్ ఉన్న టైర్లను మాత్రమే సూచిస్తాయి. ఆ వివరాలు డ్రైవర్ డోర్ వద్ద ఉండే స్టిక్కర్‌లో లేదా వాహన యజమాని మాన్యువల్‌లో స్పష్టంగా ఉంటాయి. సూచించిన దాని కంటే తక్కువ స్పీడ్ రేటింగ్ ఉన్న టైర్లను అమర్చితే, కారు అధిక వేగంలో ఉన్నప్పుడు ఆ టైర్లు అధిక వేడిని ఉత్పత్తి చేస్తాయి. దీంతో రబ్బరు పొరలు విడిపోవడం, స్టీల్ బెల్ట్ దెబ్బతినడం, చివరకు టైర్ ఒక్కసారిగా పేలిపోవడం వంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన రాపిడి కారణంగా మంటలు కూడా చెలరేగే ప్రమాదం ఉంది.

ప్రత్యేకించి హైవేలపై తరచుగా ప్రయాణించే వారు సరైన స్పీడ్ రేటింగ్ ఉన్న టైర్లనే ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 'H' లేదా 'V' రేటింగ్ టైర్లు అధిక వేగ ప్రయాణాలకు అనువుగా ఉంటాయి. అదే సమయంలో తక్కువ రేటింగ్ ఉన్న టైర్లతో ఎక్కువ వేగంలో ప్రయాణించడం వల్ల బ్రేకింగ్ పనితీరు కూడా ప్రభావితమవుతుంది. వాహనంపై అధిక బరువు ఉంటే ప్రమాదం మరింత పెరుగుతుంది.

బీమా క్లెయిమ్‌లపై కూడా ప్రభావం!

టైర్ల ఎంపిక బీమా క్లెయిమ్‌లపై కూడా ప్రభావం చూపుతుంది. తయారీదారు సూచించిన స్పీడ్ రేటింగ్‌కు భిన్నంగా ఉన్న టైర్లను వాహనానికి అమర్చి ప్రమాదానికి గురైతే, ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్‌ను తిరస్కరించే అవకాశం ఉంటుంది. ప్రమాదానికి కారణం సాంకేతిక నిర్లక్ష్యమేనని భావిస్తే బీమా పరిహారం పొందడం కష్టమవుతుంది. అందుకే టైర్లను కొనుగోలు చేసే సమయంలో ధర లేదా బ్రాండ్ మాత్రమే కాకుండా స్పీడ్ రేటింగ్‌ను కూడా తప్పనిసరిగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: కొత్త కారు కొనేవాళ్లకు అలెర్ట్‌! డెలివరీకి ముందు కచ్చితంగా పరిశీలించాల్సిన PDI చెక్‌లిస్ట్

టైర్లపై కనిపించే అక్షరం చిన్నదే అయినా, అది వాహన భద్రతకు అత్యంత కీలకమైన సూచిక. వాహనాన్ని ఎంత వేగంతో నడపాలి, ఏ రకమైన టైరు ఉపయోగించాలి అనే విషయంలో ఈ అక్షరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సరైన స్పీడ్ రేటింగ్ ఉన్న టైర్లను ఉపయోగించడం ద్వారా ప్రమాదాల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే మీ కుటుంబ సభ్యుల భద్రతతో పాటు బీమా రక్షణ కూడా సురక్షితంగా ఉంటుంది.

ఏ అక్షరం... ఎంత వేగం?

అక్షరంగరిష్ట వేగం ‍‌(kmph)
J 100
K 110
L 120
M 130
N 140
P 150
Q 160
R 170
S 180
T 190
H 210
V 240
W 270
Y 300

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.