Two Wheeler Service Quality: భారత్‌లో కొత్త బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేయడం చాలామందికి ఒక ప్రత్యేకమైన సందర్భం. కోరుకున్న బండి కోసం ప్రజలు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తారు. అంతేకాకుండా, తాము కొన్న వాహనం సురక్షితంగా, నమ్మకంగా, మంచి పనితీరుతో నడుస్తుందని తయారీ కంపెనీపై నమ్మకం ఉంచుతారు. వాహనం కొనుగోలుతో ఆ సంస్థతో దీర్ఘకాల సంబంధం కూడా మొదలవుతుంది. ముఖ్యంగా, ఇప్పుడు 3 ఏళ్ల వారంటీలు సాధారణమవుతున్నాయి. ఎక్స్‌టెండెడ్ వారంటీలు కూడా డిస్కౌంట్ ధరల్లో అందుబాటులో ఉన్నాయి.
అయితే.. తమకు తగిన గౌరవం, సేవలు లభించడం లేదని చాలా మంది కస్టమర్లు భావిస్తున్నారన్నది ఆటో ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్‌ల అభిప్రాయం. టూ వీలర్ కంపెనీలు తయారు చేస్తున్న బైక్‌లు, స్కూటర్ల నాణ్యత గత కొన్నేళ్లలో గణనీయంగా మెరుగుపడింది. కానీ అదే స్థాయిలో సర్వీస్ సపోర్ట్ మాత్రం అభివృద్ధి చెందలేదు. కొన్ని కంపెనీల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. అధీకృత సర్వీస్ కేంద్రాల్లో నాసిరకం పనితనం, సాంకేతిక పరిజ్ఞానం లోపించడం వంటి సమస్యలపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి.
బైక్‌లు మారుతున్నాయ్.. సర్వీసింగ్ కూడా మారాలిగా?
ప్రస్తుతం మోటార్‌సైకిళ్లు గతంతో పోలిస్తే చాలా క్లిష్టంగా మారాయి. ఎలక్ట్రానిక్స్ వినియోగం విపరీతంగా పెరిగింది. సాధారణ కమ్యూటర్ బైక్‌లలో కూడా ECUలు, ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ పంపులు & ఫ్యూయల్ ఇంజెక్టర్లు ఉంటున్నాయి. 150cc ఆపై సామర్థ్యం కలిగిన బైక్‌లలో పనితీరు, టెక్నాలజీ & అదనపు ఫీచర్లు పెరుగుతున్నాయి.
ఇలాంటి ఆధునిక బైక్‌లను సరిగ్గా నిర్వహించాలంటే మెకానిక్‌లకు మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం అవసరం. పాత పద్ధతుల్లోనే సర్వీసింగ్ చేస్తే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మన దేశంలో ఇప్పటికీ 'నడుస్తుందిలే', 'నాల్రోజులు నడిపి చూడండి సార్' అనే ధోరణి కనిపిస్తోంది. పని ఎంత బాగా చేశామన్నదానికంటే ఎంత త్వరగా పూర్తి చేశామనే దానికే కొందరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే సరైన పరికరాలను ఉపయోగించడం కంటే తాత్కాలిక పరిష్కారాలు లేదా 'జుగాడ్' పద్ధతులపై ఆధారపడుతున్నారు.
ఇది కూడా చదవండి: చిన్న గీత పడినా ఇన్సూరెన్స్ క్లెయిం చేస్తున్నారా? 'నో క్లెయిం బోనస్' కోల్పోతే భారీగా నష్టపోతారు! ఈ లెక్కలు చూడండి
దీనికి ఒక ఉదాహరణగా KTM 790 Duke సర్వీసింగ్ అనుభవాన్ని చెప్పవచ్చు. కొంతకాలం క్రితం, ఒక అధీకృత సర్వీస్ కేంద్రంలో ఈ బైక్‌కు టార్క్ రెంచ్ ఉపయోగించాలని కస్టమర్ పట్టుబట్టినప్పుడు, దానిని తీసుకురావడానికి సిబ్బంది స్టూల్ తెచ్చి పైభాగంలోని క్యాబినెట్‌ను తెరవాల్సి వచ్చింది. అక్కడ దుమ్ము పట్టిన టార్క్ రెంచ్ కనిపించింది. ఆ పరికరాన్ని దాదాపుగా ఉపయోగించడం లేదని ఈ అనుభవం సూచిస్తోంది. నిజానికి భారత్‌లో చాలామంది మెకానిక్‌లు బోల్టులను బిగించేటప్పుడు అవసరమైన టార్క్‌ను కొలిచే పరికరాలపై కాకుండా తమ చేతి బలంపైనే ఆధారపడుతున్నారు.
సిబ్బంది కొరత, తక్కువ జీతాలు
సర్వీస్ నాణ్యతను ప్రభావితం చేస్తున్న మరో ప్రధాన అంశం ఖర్చు. వర్క్‌షాప్‌లో ఎక్కువ వాహనాలకు సర్వీసింగ్ చేస్తేనే ఆదాయం పెరుగుతుంది. అందుకే కొన్నిసార్లు పనిని త్వరగా పూర్తి చేయడంపై దృష్టి పెడుతున్నారు. జూనియర్ మెకానిక్‌లకు చాలా తక్కువ జీతాలు చెల్లించడం వల్ల ఉద్యోగులు తరచూ మారుతున్నారు. దీంతో డీలర్‌షిప్‌లకు తగినంత మంది శిక్షణ పొందిన సిబ్బందిని నియమించుకోవడం కష్టమవుతోంది. ప్రతి సర్వీస్ ద్వారా వచ్చే ఆదాయంతో పోలిస్తే అవసరమైన వర్క్‌షాప్ స్థలం, సిబ్బందిని నిర్వహించడం కూడా డీలర్లకు సవాలుగా మారుతోంది.
మరోవైపు దేశంలో ఆటోమొబైల్ అమ్మకాలు తరచూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా సర్వీస్ నెట్‌వర్క్, మెకానిక్‌లు & వర్క్‌షాప్ సదుపాయాలు పెరగడం లేదు. దీంతో ఇప్పటికే ఉన్న సర్వీస్ కేంద్రాలపై ఒత్తిడి పెరుగుతోంది.
ఇది కూడా చదవండి: 278cc ఇంజిన్, బ్రేంబో బ్రేక్స్, ప్రత్యేక స్టీరింగ్ సిస్టమ్.. Italjet Dragster 300 స్కూటర్ స్పెషాలిటీలు ఇవి
సర్వీస్ నాణ్యత పెరగాలంటే ఏం చేయాలి?
పెద్ద నగరాల్లో మరిన్ని సర్వీస్ వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేయాలి. మెకానిక్‌లకు మెరుగైన శిక్షణ ఇవ్వాలి. వర్క్‌షాప్ మేనేజర్లు కూడా సరైన ఆపరేటింగ్ విధానాలు అమలవుతున్నాయో లేదో నిరంతరం పర్యవేక్షించాలి. ముఖ్యంగా నాణ్యమైన సర్వీసింగ్ అందించాలంటే మెకానిక్‌లకు సరైన శిక్షణతో పాటు తగిన జీతాలు ఇవ్వాలి.
అయితే ఈ మార్పుల వల్ల కస్టమర్లకు సర్వీసింగ్ ఖర్చు పెరుగుతుంది. ముఖ్యంగా లేబర్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. మన దేశంలో బైక్‌ల నాణ్యత, టెక్నాలజీ మెరుగుపడుతున్న కొద్దీ వాటి నిర్వహణ ఖర్చులు కూడా పెరుగుతాయి. జీవన వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో సర్వీస్ ఖర్చులు పెరగడం సహజమే.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
