TVS Orbiter Electric Scooter Price And Features: TVS మోటార్‌ కంపెనీ నుంచి వచ్చిన తాజా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ TVS Orbiter. ప్రాక్టికాలిటీ, కనెక్టివిటీ, కంఫర్ట్‌ మధ్య బ్యాలెన్స్‌గా ఈ స్కూటర్‌ను రూపొందించారు. iQubeలో ఉపయోగించిన అదే 3.1kWh బ్యాటరీ ఇక్కడ కూడా ఉంది. కానీ ఈ స్కూటర్‌లో మోటార్‌ ట్యూనింగ్‌ పూర్తిగా రేంజ్‌ మీద ఫోకస్‌ చేసి చేశారు. వేగం కన్నా రోజువారీ ప్రయాణంలో ఎక్కువ దూరం వెళ్లేలా ఈ స్కూటర్‌ డిజైన్‌ చేశారు.

కొనదగిన కారణాలు

ప్రత్యేక డిజైన్‌, ఉపయోగకరమైన ఫీచర్లు

TVS Orbiter డిజైన్‌ చూస్తే వెంటనే ప్రత్యేకంగా కనిపిస్తుంది. షార్ప్‌, బాక్సీ స్టైల్‌తో పాటు ఫ్లాట్‌ సీట్‌ ఈ స్కూటర్‌కు ప్రత్యేక గుర్తింపును ఇస్తుంది. ఫ్రంట్‌ ఏప్రన్‌ మీద ఉన్న DRL స్ట్రిప్‌, అందులోనే ఇంటిగ్రేటెడ్‌ టర్న్‌ సిగ్నల్స్‌ ఆకట్టుకుంటాయి.ప్రాక్టికాలిటీ విషయంలో ఇది మంచి స్కోర్‌ సాధించింది. 34 లీటర్ల అండర్‌సీట్‌ స్టోరేజ్‌ ఉంది. ఇందులో రెండు హాఫ్‌ ఫేస్‌ హెల్మెట్లు సులభంగా పెట్టుకోవచ్చు. ముందు భాగంలో చిన్న కబ్బీహోల్‌, డాష్‌ కింద USB పోర్ట్‌ ఉన్నాయి. రోజూ ఆఫీస్‌, షాపింగ్‌ ట్రిప్స్‌కు ఇవి బాగా ఉపయోగపడతాయి.

నిదానంగా నడిపితే మంచి రేంజ్‌

Orbiter‌ను సాఫ్ట్‌గా నడిపితే ఇది నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. సిటీ మోడ్‌లో మెల్లగా రైడ్‌ చేస్తే ఫుల్‌ చార్జ్‌తో 112 కిలోమీటర్ల రేంజ్‌ వచ్చింది. అయితే అగ్రెసివ్‌ రైడింగ్‌, ఎక్కువ బరువు మోస్తే రేంజ్‌ తగ్గుతుంది. చార్జింగ్‌ విషయానికి వస్తే, బ్యాటరీ 0 నుంచి 80 శాతం చార్జ్‌ అవ్వడానికి సుమారు 4 గంటల కంటే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అంటే రోజూ రాత్రి చార్జ్‌ పెట్టుకుంటే సరిపోతుంది.

ధరకు తగిన ఫీచర్లు

₹1.05 లక్షల (సబ్సిడీకి ముందు ఎక్స్‌-షోరూమ్‌ ధర, తెలుగు రాష్ట్రాలు) ధరకు Orbiter మంచి ఫీచర్‌ ప్యాక్‌ను ఇస్తుంది. Raider లోయర్‌ వేరియంట్స్‌లో ఉన్న LCD స్క్రీన్‌ ఇక్కడ కూడా ఉంది. SmartXonnect యాప్‌ ద్వారా బ్లూటూత్‌ కనెక్టివిటీ లభిస్తుంది. క్రూయిజ్‌ కంట్రోల్‌, పార్క్‌ అసిస్ట్‌ లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 760mm సీట్‌ హైట్‌, 112 కిలోల కర్బ్‌ వెయిట్‌ ఉండటం వల్ల కొత్త రైడర్లకు కూడా ఇది సులభంగా అనిపిస్తుంది.

కొనకుండా ఆగడానికి కారణాలు

పెద్ద నగరాల్లో వేగం తక్కువగా అనిపిస్తుంది

Orbiter వేగం విషయంలో కాస్త నిరాశ కలిగిస్తుంది. 0 నుంచి 40 కిలోమీటర్ల వేగం చేరుకోవడానికి 7 సెకన్లు పడుతుంది. ట్రాఫిక్‌లో సరిపోతుంది కానీ ఫాస్ట్‌గా మూవ్‌ కావడానికి కాదు. 30 కిలోమీటర్ల లోపు యాక్సిలరేషన్‌ చాలా స్లోగా అనిపిస్తుంది.50-55 కిలోమీటర్ల స్పీడ్‌లో క్రూయిజ్‌ చేయొచ్చు కానీ ఓవర్‌టేక్‌ చేయాలంటే ఈ స్పీడ్‌ సరిపోదు, ముందే ప్లాన్‌ చేసుకోవాలి. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న iQube లేదా Activa లాంటి స్కూటర్లతో పోలిస్తే ఇది నిదానమే.

డిస్క్‌ బ్రేక్‌ ఆప్షన్‌ లేకపోవడం

ఈ స్కూటర్‌లో ముందు, వెనుక రెండూ డ్రమ్‌ బ్రేక్స్‌ మాత్రమే ఉన్నాయి. సాధారణ వినియోగానికి సరిపోతాయి కానీ ముందు భాగంలో డిస్క్‌ బ్రేక్‌ ఆప్షన్‌ ఇచ్చి ఉంటే మరింత భద్రత ఉండేది.

హైదరాబాద్‌లో TVS Orbiter ఆన్‌రోడ్‌ ధర

ఎక్స్‌-షోరూమ్‌ ధర: ₹1,04,900

EMPS 2024 సబ్సిడీ: ₹5,000 ‍‌(తగ్గింపు)

RTO ఛార్జీలు: ₹1,500

ఇన్సూరెన్స్‌ (కంప్రెహెన్సివ్‌): ₹5,330

మొత్తం ఆన్‌రోడ్‌ ధర (హైదరాబాద్‌): ₹1,06,730

విజయవాడ సహా తెలుగు నగరాలన్నింటిలోనూ స్వల్ప మార్పులతో దాదాపుగా ఇదే ధర ఉంటుంది.

రోజువారీ ప్రయాణం, రేంజ్‌ ప్రాధాన్యతగా చూసే వారికి TVS Orbiter సరైన ఎంపిక. కానీ వేగం, పవర్‌ ఎక్కువ కావాలంటే మరో స్కూటర్‌ వైపు చూడాల్సిందే.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.