Tvs Apache New Varients Latest News:  టీవీఎస్ కంపెనీలో అపాచీ మోడ‌ల్ కు అద్బుత‌మైన ఆద‌ర‌ణ ద‌క్కింది. గ‌త ఇర‌వై ఏళ్లుగా ఈ మోడ‌ల్ ను వినియోగ‌దారులు ఆద‌రిస్తున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు మార్పులు, చేర్పులు చేసి, మ‌రింత‌గా వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించేందుకు కంపెనీ ప్ర‌య‌త్నిస్తోంది. తాజాగా కీల‌క మైలురాయిని దాట‌డంతో కంపెనీ ఈ మోడ‌ల్లో కొత్త వేరియంట్ల‌ను రంగంలోకి దించింది. టీవీఎస్ మోటార్ కంపెనీ తన ప్రీమియం మోటార్ సైకిల్ టీవీఎస్ అపాచీ 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, అపాచీ RTR 160, 180, 200, అపాచీ RR310 , RTR310 లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లను విడుదల చేసింది. దీనితో పాటు, టీవీఎస్ అపాచీ RTR 160 , RTR 200 4V  టాప్ వేరియంట్లను కూడా ఆవిష్కరించింది. ఈ కొత్త 4V టాప్ వేరియంట్లు, ఇప్పటికే ఉన్న అపాచీ RTR 160 , 200 మోడళ్లకు మించి ఉండేలా రూపొందించబడి, Class-D ప్రొజెక్టర్ హెడ్‌లాంప్స్ (LED DRLs‌తో కలిపి), స్ట‌న్నింగ్  LED లైటింగ్, 5 అంగుళాల కనెక్టెడ్ TFT క్లస్టర్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఆకర్షణీయమైన  క‌లర్స్ , డైనమిక్ గ్రాఫిక్స్ వంటి ఆధునిక ఫీచర్లతో వస్తున్నాయి.  ఈ అప్‌గ్రేడ్‌లు అపాచీ రైడర్లకు అత్యాధునిక సెక్యూరిటీ, కనెక్టివిటీ , పనితీరును అందిస్తాయని టీవీఎస్ కంపెనీ తెలిపింది.

Continues below advertisement


సూప‌ర్బ్ ఫీచ‌ర్లు..
 టీవీఎస్ అపాచీ RTR 160 4Vలో అద్భుత‌మైన ఫీచ‌ర్లు ఉన్న‌ట్లు కంపెనీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మోడ‌ల్లో  159.7 సీసీ, SI, 4-స్ట్రోక్, ఆయిల్-కూల్డ్, SOHC ఇంజిన్ ఉంటుంద‌ని, ఇది గరిష్ఠంగా 17.3 హార్స్ పవర్ , 14.73 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదని కంపెనీ పేర్కొంటోంది.  ఇది భారతదేశంలో ఎయిర్/ఆయిల్ కూల్డ్ సెగ్మెంట్‌లో అత్యధిక శక్తిని కలిగిన 160cc ఇంజిన్ అని కంపెనీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.  ఇందులో మూడు రైడ్ మోడ్‌లు, డ్యూయల్-చానల్ ABS, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లు ఉన్నాయని, వినియోగ‌దారుల‌కు ది బెస్ట్ అనుభూతిని ఇచ్చే విధంగా ఈ బైకుల‌ను రూపొందించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. 


ఆధునిక హంగులు..
ఇక టీవీఎస్ అపాచీలోని మ‌రో మోడ‌ల్ అయిన‌ RTR 200 4Vలోనూ అద్భుత‌మైన ఫీచ‌ర్లు పొందు ప‌రిచిన‌ట్లు కంపెనీ తెలిపింది. ఈ మోడ‌ల్లో  197.75 సీసీ ఇంజిన్ ఉంటుందని, ఇది గరిష్ఠంగా 20.5 హార్స్ పవర్ , 17.25 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని, దీని వ‌ల్ల శ‌క్తివంత‌మైన ప‌నితీరును ఆశించ వ‌చ్చ‌ని కంపెనీ తెలిపింది. ఈ మోడళ్లలోనూ Class-D ప్రొజెక్టర్ హెడ్‌లాంప్స్ (LED DRLs‌తో కలిపి), LED లైటింగ్, 5 అంగుళాల TFT క్లస్టర్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఆకర్షణీయమైన క‌లర్స్, సూప‌ర్బ్ గ్రాఫిక్స్ ఉన్నాయని కంపెనీ వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఏదేమైనా 20వ వార్షికోత్స‌వం ద్వారా కొత్త వేరియంట్ల‌ను రంగంలోకి దింపి బైక్ ల‌వ‌ర్స్ ను టీవీఎస్ ఊరిస్తోంద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.