Compact SUV Performance Comparison: భారత మార్కెట్లో కాంపాక్ట్‌ SUV సెగ్మెంట్‌ రోజురోజుకూ హాట్‌ అవుతోంది. ఈ విభాగంలో టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌తో మంచి పెర్ఫార్మెన్స్‌ ఇచ్చే రెండు ముఖ్యమైన మోడళ్లు ఉన్నాయి, అవి - స్కోడా కైలాక్‌ & మహీంద్రా XUV 3XO. ధర పరంగా దగ్గరగా ఉండే ఈ రెండు SUVలలో అసలు రోడ్డుపై ఏ కారు బెటర్‌ అనేది తెలుసుకోవాలంటే పెర్ఫార్మెన్స్‌ టెస్ట్‌ ఫలితాలు చూడాల్సిందే.

ఇంజిన్‌, పవర్‌ - ఏ కారుది పైచేయి?

 
స్కోడా కైలాక్‌ TP AT
మహీంద్రా XUV 3XO TP AT
ఇంజిన్
 
3 cyls, turbo-petrol
3 cyls, turbo-petrol
డిస్‌ప్లేస్‌మెంట్ (cc)
 
999
1197
పవర్ (hp)
 
116
130
టార్క్ (Nm)
 
178
230
కెర్బ్ బరువు (kg)
 
1,255
1,411
పవర్-టు-వెయిట్ (hp per tonne)
 
92.43
92.13
టార్క్-టు-వెయిట్ (Nm per tonne)
 
141.83
163
ధర పరిధి (రూ. లక్షల్లో)
 
9.25-12.99
9.71-14.55

మహీంద్రా XUV 3XO లో ఎక్కువ సామర్థ్యం గల టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంది. అందుకే ఇది స్కోడా కైలాక్‌తో పోలిస్తే 14 hp, 52 Nm ఎక్కువ అవుట్‌పుట్‌ ఇస్తుంది. అయితే కైలాక్‌ బరువు 156 కేజీలు తక్కువగా ఉండటం వలన పవర్‌ టు వెయిట్‌ రేషియో కొంచెం మెరుగ్గా ఉంటుంది.

టార్క్‌ విషయానికి వస్తే XUV 3XO దాదాపు 15 శాతం మెరుగైన టార్క్‌ టు వెయిట్‌ రేషియో ఇస్తుంది. అంటే స్టార్ట్‌ తీసుకునే సమయంలో, లో స్పీడ్‌లో ఇది కొంచెం ఎక్కువ జోష్‌ చూపిస్తుంది.

0 నుంచి 100 కి.మీ. వేగ పరీక్ష

యాక్సిలరేషన్‌ టెస్ట్‌లో మహీంద్రా XUV 3XO అన్ని స్పీడ్‌ లెవెల్స్‌లోనూ వేగంగానే ఉంది. 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని ఇది సుమారు 11.05 సెకన్లలో అందుకుంది. అదే సమయంలో స్కోడా కైలాక్‌ 11.69 సెకన్లు తీసుకుంది.లో స్పీడ్‌లో కైలాక్‌లో స్వల్పంగా టర్బో ల్యాగ్‌ కనిపించినా, ఒకసారి స్పీడ్‌ పికప్‌ అయితే మిడ్‌ రేంజ్‌లో బలంగా దూసుకుపోతుంది. ఇందులో ఉన్న ప్యాడిల్‌ షిఫ్టర్స్‌ డ్రైవింగ్‌కు మరింత ఫన్‌ జోడిస్తాయి. XUV 3XO లో ప్యాడిల్స్‌ లేకపోయినా Zip, Zap, Zoom అనే మూడు డ్రైవ్‌ మోడ్స్‌తో యాక్సిలరేషన్‌ ఫీల్‌ను మార్చుకోవచ్చు.

రిఫైన్‌మెంట్‌ విషయానికి వస్తే మహీంద్రా SUV కొంచెం సైలెంట్‌గా ఉంటుంది. కైలాక్‌లో 3 సిలిండర్‌ సౌండ్‌ వినిపించినా అంత అసహనంగా అనిపించదు.

రోలింగ్‌ యాక్సిలరేషన్‌ - రియల్‌ వరల్డ్‌లో ఎలా?

మూడో గేర్‌లో 20 కి.మీ. నుంచి 80 కి.మీ. వేగం పెంచడంలో రెండు SUVలు సమానమైన పెర్ఫార్మెన్స్‌ చేశాయి. అయితే నాలుగో గేర్‌లో 40 నుంచి 100 కి.మీ. వేగానికి వస్తే XUV 3XO సుమారు 0.61 సెకన్లు ముందే చేరుకుంది. దీని అర్ధం, ఓవర్‌టేక్‌ చేసే సమయంలో మహీంద్రా మోడల్‌ కొంచెం మెరుగైన స్పందన ఇస్తుంది.

బ్రేకింగ్‌ టెస్ట్‌ - ఇక్కడ కైలాక్‌ ఆధిపత్యం

80 నుంచి 0 కి.మీ. వేగానికి చేరుకునే బ్రేకింగ్‌ పరీక్షలో స్కోడా కైలాక్‌ కేవలం 27.11 మీటర్లలో ఆగిపోయింది. దీనికోసం మహీంద్రా XUV 3XO అయితే 31.36 మీటర్లు తీసుకుంది. అంటే కైలాక్‌ 4.25 మీటర్లు తక్కువ దూరంలోనే (ముందే) ఆగింది. సమయ పరంగా కూడా కైలాక్‌ 2.37 సెకన్లు తీసుకోగా, XUV 3XO 3 సెకన్లు తీసుకుంది. ఎమర్జెన్సీ బ్రేకింగ్‌ సమయంలో ఈ మిల్లీ సెకన్లు కూడా చాలా కీలకమైన తేడాగా మారుతుంది.

సూటిగా చెప్పాలంటే, వేగం & యాక్సిలరేషన్‌ విషయానికి వస్తే మహీంద్రా XUV 3XO కొంచెం ముందుంది. కానీ బ్రేకింగ్‌ సామర్థ్యంలో స్కోడా కైలాక్‌ స్పష్టంగా మెరుగ్గా నిలిచింది. మీరు వేగానికి ప్రాధాన్యత ఇస్తే.. XUV 3XOను, కంట్రోల్‌ & బ్రేకింగ్‌ మీకు ముఖ్యమైతే.. కైలాక్‌ను మంచి ఎంపికగా భావించవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.