ప్రముఖ లగ్జరీ బైక్ తయారీ సంస్థ 'ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ ఇండియా' తన సరికొత్త 350 సీసీ బైకులను వచ్చే ఏప్రిల్ 8న విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇటీవల రోడ్లపై టెస్టింగ్ చేస్తున్న సమయంలో ఈ బైకులు కనిపించడంతో ఆటోమొబైల్ రంగంలో ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆధిపత్యం వహిస్తున్న ఈ విభాగంలోకి ట్రయంఫ్ రావడం ఒక కీలక పరిణామం. తక్కువ ధరకు ప్రీమియం బైకులను అందించడమే లక్ష్యంగా కంపెనీ ఈ అడుగు వేసింది.
తక్కువ జీఎస్టీ.. తక్కువ ధరప్రస్తుత పన్ను నిబంధనల ప్రకారం 350 సీసీ పైబడిన బైకులను 'లగ్జరీ' కేటగిరీలో చేర్చి 40 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. దీనివల్ల బైకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అందుకే ట్రయంఫ్ తెలివైన నిర్ణయం తీసుకుంది. తమ 400 సీసీ ఇంజిన్ సైజును స్వల్పంగా తగ్గించి 350 సీసీ లోపు తీసుకురావడం ద్వారా కేవలం 18 శాతం జీఎస్టీ పరిధిలోకి వచ్చేలా ప్లాన్ చేసింది. ఈ పన్ను ప్రయోజనం వల్ల కస్టమర్లకు బైక్ ధర భారీగా తగ్గనుంది.
ఇంజిన్, పవర్ వివరాలుప్రస్తుతం స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 ఎక్స్ మోడళ్లలో ఉన్న 398.15 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌నే కంపెనీ మోడిఫై చేస్తోంది. ఇంజిన్ బోర్ పరిమాణాన్ని తగ్గించడం ద్వారా దీనిని 350 సీసీ లోపు మార్చనున్నారు. ఈ కొత్త ఇంజిన్ సుమారు 35-40 బీహెచ్‌పీ శక్తిని ఇస్తుంది. ఇండియన్ రోడ్లకు అవసరమైన లో-రేంజ్, మిడ్-రేంజ్ టార్క్ ఇచ్చేలా ఇంజనీర్లు దీనిని డిజైన్ చేశారు. బజాజ్ ఆటోకు చెందిన చాకన్ ప్లాంట్‌లో ఈ బైకులు తయారవుతాయి. ఇక్కడి నుండే ఇతర దేశాలకు ఎగుమతి కూడా చేస్తారు.
ఫీచర్లు, వేరియంట్లుఈ లైనప్‌లో స్పీడ్ 350 (Speed 350), స్క్రాంబ్లర్ 350 ఎక్స్ (Scrambler 350 X), స్పీడ్ టీ4 350 (Speed T4 350) వంటి మోడళ్లు ఉండబోతున్నాయి. వీటితో పాటు థ్రక్స్టన్ (Thruxton) లేదా బోనెవిల్లే మోడల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎల్ఈడీ లైటింగ్, డిజిటల్ కన్సోల్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ వంటి హైటెక్ ఫీచర్లు ఇందులో ఉంటాయి. బేస్ వేరియంట్ ధర రూ. 2.2 లక్షల నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, హంటర్ 350 బైకులకు ఇవి గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
