టోయోటా భారతదేశంలో తన కొత్త ఎలక్ట్రిక్ SUV అర్బన్ క్రూయిజర్ EVని విడుదల చేసింది. ఈ కారు టయోటా మొదటి మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ SUV. దీనితో కంపెనీ ఎలక్ట్రిక్ విభాగంలోకి స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, ఇన్నోవా హైక్రాస్ వంటి హైబ్రిడ్ కార్లపై ఎక్కువ దృష్టి పెట్టింది. కాని ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లాంచ్ తర్వాత మార్కెట్ మారుతున్నట్లు కనిపిస్తోంది. ఈ SUV నేరుగా హ్యూందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ (Hyundai Creta Electric), MG ZS EVతో పాటు మారుతి సుజుకీ ఈ విటారా (Maruti Suzuki e-Vitara) లకు పోటీగా నిలుస్తుంది.
డిజైన్, ఇంటీరియర్
అర్బన్ క్రూయిజర్ EV ఫ్రంట్ డిజైన్ చాలా వరకు టయోటా కామ్రీ నుంచి ప్రేరణ పొందింది. ఇందులో సన్నని LED హెడ్‌లైట్‌లు ఉన్నాయి. వీటితో సింగిల్ స్ట్రిప్ DRL వస్తుంది. ఈ SUV Maruti Suzuki e-Vitara కు చెందిన HEARTECT-e ప్లాట్‌ఫారమ్‌పై తయారు చేశారు. కారులో డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, బలమైన బాడీ క్లాడింగ్, ఫుల్-విడ్త్ LED టైల్‌లైట్‌లు ఉన్నాయి. కారు లోపలి భాగానికి వస్తే, ఇందులో పెద్ద 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. దీనితో పాటు గ్లాస్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్ కూడా ఉన్నాయి.
బ్యాటరీ, రేంజ్, పనితీరు
Toyota Urban Cruiser EV రెండు బ్యాటరీ వేరియంట్లను కలిగి ఉంది. 49 kWh బ్యాటరీ 144 హార్స్‌పవర్ అందిస్తుంది. అయితే 61 kWh బ్యాటరీ 174 హార్స్‌పవర్ ఉత్పత్తి చేస్తుంది. పెద్ద బ్యాటరీతో ఈ SUV ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 543 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు అని కంపెనీ తెలిపింది. ఇది లాంగ్ డ్రైవ్ వెళ్లేవారికి మరింత అనుకూలంగా ఉంటుంది.
సేఫ్టీ ఫీచర్లు, టెక్నాలజీ
భద్రత విషయానికి వస్తే, ఈ SUV చాలా బలంగా ఉంది. ఇది BNCAP నుంచి 5 సార్ట్ భద్రతా రేటింగ్ పొందే అవకాశం ఉంది. కారులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరాతో పాటు లెవెల్ 2 ADAS వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనితో పాటు ESC, TPMS, ABSతో EBD కూడా ఉన్నాయి.