Toyota Fortuner SUV Price Hike:టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) తన SUV టయోటా ఫార్చ్యూనర్‌ ధరలను మరోసారి పెంచింది. ఇవాళ్టి (జూన్ 9, 2025) నుంచి ఈ ధరలు అమలులోకి వచ్చాయి. ఎంపిక చేసిన వేరియెంట్స్‌లో మాత్రమే ఈ ధరలు పెంచుతున్నట్టు సంస్థ ప్రకటించింది. హై ఎండ్‌ సెక్యూరిటీ, పవర్‌ఫుల్ ఇంజిన్, సౌకర్యవంతమైన ప్రయాణం ఇష్టపడేవాళ్లంతా ఎక్కువగా మొగ్గు చూపేది ఫార్చ్యూనర్ SUVవైపే. అందుకే భారతీయ మార్కెట్‌లో ఈ కార్లకు ప్రత్యేక స్థానం ఉంది. 

ఫార్చ్యూనర్ SUV ధర ఎంత పెరిగింది?టయోటా ఫార్చ్యూనర్‌లో ఎంపిక చేసిన వేరియంట్ల ధరలను మాత్రమే టయోటా పెంచింది. ఈ మధ్యే ఆ సంస్థ నుంచి మైల్డ్-హైబ్రిడ్ వేరియంట్ విడుదలైంది. ధరలు పెరుగుదలకు ఇదే కారణమని సంస్థ చెబుతోంది. ఫార్చ్యూనర్ 4x2 పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్‌పై 68,000 రూపాయలు పెరుగింది. 4x2 డీజల్ మాన్యువల్, 4x2 డీజల్ ఆటోమేటిక్, 4x4 డీజల్ మాన్యువల్, GR-S పెర్ఫార్మెన్స్ వేరియంట్, లెజెండర్ వేరియంట్‌లు (4x4 డీజల్ మాన్యువల్ అండ్‌ 4x4 డీజల్ ఆటోమేటిక్) రూ. 40,000 చొప్పున పెంచింది. ఇప్పుడు చెప్పినవి కేవలం ఎక్స్-షోరూ ధరలు మాత్రమే. రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ ఫీజులు కలిపితే ఈ కారు కొనుగోలు ధర మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫార్చ్యూనర్ ధరలు రూ. 36.05 లక్షల నుంచి రూ. 52.34 లక్షల మధ్య ఉన్నాయి.  

ధరలు పెంచడానికి కారణం ఏంటీ?కొత్తగా అప్‌డేట్ చేసిన మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ వేరియంట్‌ కోసం ధరలు పెంచుతున్నట్టు టయోటా ప్రకటించింది. ఈ కొత్త వేరియంట్‌లో 2.8-లీటర్ టర్బో-డీజల్ ఇంజిన్‌తో 48-వోల్ట్ మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ ఉంటుంది. ఇది మైలేజ్‌ పెంచేందుకు దోహదపడుతుంది. మరిన్ని ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ సిస్టమ్ కోసం టయోటా డిజైన్, తయారీపై ఎక్కువ దృష్టి పెట్టింది. డబ్బులు కూడా ఖర్చు పెట్టింది. అందుకే ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వీటితోపాటు ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్న తీరును కూడా టయోటా వివరించింది. ఎక్కువ ధర పెడుతున్న వినియోగదారులు కచ్చితంగా అందుకు తగ్గ సౌకర్యం అందుతుందని టయోటా కంపెనీ ప్రకటించింది. వారి డబ్బులకు పూర్తి న్యాయం జరుగుతుందని అభిప్రాయపడుతోంది.  

కొత్త ధరల లిస్ట్ ఇదేకొత్తగా పెరిగిన ధరలతో కలుపుకుంటే ఫార్చ్యూనర్‌ వాహనల ధరలు ఇలా మారాయి 

4x2 పెట్రోల్ ఆటోమేటిక్ వాహనం ధర: రూ. 68,000 పెరిగి ధర రూ. 36.73 లక్షల నుంచి మొదలు కానుంది.  

4x2 డీజల్ మాన్యువల్: ఈ వాహనంపై రూ. 40,000 పెరిగింది. దీంతో ఈ వాహనం కొనాలంటే రూ. 37.13 లక్షలు ఖర్చు పెట్టాలి. 

4x2 డీజల్ ఆటోమేటిక్: దీనిపై కూడా రూ. 40,000 టయోటా పెంచింది. దీంతో ఈ వాహనం కొనాలంటే  రూ. 39.54 లక్షలు చెల్లించాలి. 

4x4 డీజల్ మాన్యువల్: దీనిపై కూడా రూ. 40,000 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ వాహనం కొనాలంటే రూ. 42.89 లక్షలు మీ చేతిలో ఉండాలి. 

GR-S పెర్ఫార్మెన్స్: ఈ బండిపై కూడా రూ. 40,000 పెంచడంతో ధర రూ. 52.34 లక్షలకు చేరింది. 

లెజెండర్ 4x4 డీజల్ మాన్యువల్: దీనిపై కూడా రూ. 40,000 పెంచారు. ఫలితంగా ఈ వాహనం కొనుగోలుకు రూ. 50.09 లక్షలు ఖర్చు చేయాలి. 

లెజెండర్ 4x4 డీజల్ ఆటోమేటిక్: దీనిపై కూడా రూ. 40,000 పెరగడంతో రూ. 51.44 లక్షలు చెల్లించాలి. 

ఇప్పుడు చెప్పిన ధరుల అన్నీ కూడా ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే. మీరు వాహనం కొనుగోలు చేస్తే రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ ఫీజులు కలుపుతారు. ఆయా రాష్ట్రాల రూల్స ప్రకారం ఇవి మారుతూ ఉంటాయి. వీటిపై పూర్తి వివరాలు కావాలంటే మీకు దగ్గరలోని టయోటా డీలర్‌ను అడిగితే పూర్తి సమాచారం మీకు అందిస్తారు.  

ఇంధన ఎఫిషియన్సీ, ఫీచర్లుకొత్త మైల్డ్-హైబ్రిడ్ వేరియంట్ డీజల్ ఇంజిన్‌తో వస్తుంది, ఇది 14.2 నుంచి 14.4 కి.మీ./లీటర్ మైలేజ్ ఇస్తుంది. ఇది పెట్రోల్ వేరియంట్‌ల కన్నా ఎక్కువ ఇంధన ఆదా కలిగిస్తుంది. పెట్రోల్ వేరియంట్ 10.3 కి.మీ. మాత్రమే మైలేజీ ఇస్తుంది. ఈ కొత్త వేరియంట్‌లో 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లు కలిగి ఉంది. ఇవి డ్రైవింగ్‌ను మరింత సౌకర్యలవంతం చేస్తాయి. సెక్యూరిటీ ఫీచర్స్‌ను పెంచారు.  అందుకే ధర పెరిగిందని కంపెనీ చెబుతోంది.