Best Cars Under Rs 8 Lakh Budget In India: సిటీ లేదా టౌన్ తిరగడానికి సొంత కారు ఉంటే ఆ సౌకర్యమే వేరుగా ఉంటుంది. ట్రాఫిక్, ఇరుకైన రోడ్లపై నడపడం & పార్కింగ్‌ను సులభం చేసేలా, మీ బడ్జెట్‌కు అనుకూలంగా రూ. 8 లక్షల లోపు అనేక మంచి కార్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ కార్లు అని చెప్పాం కదానికి వీటి ఫీచర్లలో రాజీ పడడానికి ఏమీ లేదు, అన్నీ సెగ్మెంట్ బెస్ట్ కార్లు. ఆ కార్లు మంచి మైలేజ్, అవసరమైన సేఫ్టీ ఫీచర్లు & సౌకర్యవంతమైన ఇంటీరియర్‌లను అందిస్తున్నాయి.
సిటీ/టౌన్ డ్రైవింగ్ కోసం టాప్-5 స్మార్ట్ కార్లు
1. మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift)సిటీ డ్రైవింగ్‌కు అత్యంత అనుకూలమైన & సరైన హ్యాచ్‌బ్యాక్ ఇది. దీని కొత్త అవతార్.. స్టైల్‌తో పాటు వైర్‌లెస్ ఛార్జర్ & ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లను కూడా అందిస్తుంది. భద్రత కోసం, ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగులు, ABS, EBD & ట్రాక్షన్ కంట్రోల్ వంటి టెక్నాలజీలు అమర్చారు. దీనికి 1.2 లీటర్, 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. మారుతి సుజుకి స్విఫ్ట్ ఆన్-రోడ్ ధర తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.75 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
2. టాటా పంచ్ (Tata Punch)తక్కువ బడ్జెట్‌లో SUV లాంటి ఎత్తు & బలాన్ని కోరుకునే వారికి టాటా పంచ్ ఒక గొప్ప ఎంపిక. పంచ్ ప్రత్యేకత దాని 5-స్టార్ సేఫ్టీ రేటింగ్. సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్ & సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పవర్ తీసుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆన్-రోడ్ ధర రూ. 7.45 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
3. సిట్రోయెన్ C3 (Citroen C3)ఫ్రెంచ్ డిజైన్ & శక్తివంతమైన టర్బో పెర్పార్మెన్స్ కోసం చూస్తుంటే, సిట్రోయెన్ C3 ఒక స్టైలిష్ & స్పేసియస్ ఆప్షన్ అవుతుంది. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ & డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనికి కొన్ని బేసిక్ ఫీచర్లు లేకపోయినా & సర్వీస్ నెట్‌వర్క్ పరిమితం అయినప్పటికీ, దీని టర్బో వేరియంట్ ఆకట్టుకుంటోంది. ఇది 1.2L NA & 1.2L టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆన్-రోడ్ ధర రూ. 7.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
4. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios)హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ ఒక ప్రీమియం-ఫీలింగ్ హ్యాచ్‌బ్యాక్, ఇది బడ్జెట్‌లో గొప్ప ఫీచర్లను అందిస్తుంది. వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ & క్రూయిజ్ కంట్రోల్ కూడా ఉన్నాయి. దీని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ సిటీ ట్రాఫిక్‌లో మృదువైన & నిశ్శబ్దమైన పనితీరును అందిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో దీని ఆన్-రోడ్ ధర రూ. 7.24 లక్షల నుంచి ప్రారంభమవుతుంది, ఈ జాబితాలో ఇది చవకైన కారు.
5. మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno)ఎక్కువ స్థలం, మెరుగైన భద్రత & ప్రీమియం ఫీచర్లు ఉన్న హ్యాచ్‌బ్యాక్ కోరుకుంటే, మారుతి సుజుకి బాలెనో మీకు సూటవుతుంది. ఇందులో హెడ్-అప్ డిస్‌ప్లే, 360 డిగ్రీల కెమెరా & ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇండియా NCAP నుంచి పొందిన 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ దీనిని సురక్షితమైన కార్ల లిస్ట్‌లో ఉంచింది. ఈ బండికి 1.2L పెట్రోల్ ఇంజిన్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మారుతి సుజుకి బాలెనో ఆన్-రోడ్ ధర రూ. 8.01 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే, వీటిలో ఏ కారు కొనాలన్నా బ్యాంక్ మీకు లోన్ ఇస్తుంది. మీరు చాలా తక్కువ డౌన్‌పేమెంట్ చేసి, మిగిలిన డబ్బును ఈజీగా EMIల్లో తీర్చేయవచ్చు.