Automobile News: చైనాకు చెందిన ఎంజీమోటార్స్‌(MG Motors) నుంచి మరో సరికొత్త ఎలక్ట్రిక్ సీయూవీ(CUV) కారు రాబోతోంది. రాబోయే వినాయకచవితి, దసరా, దీపావళి పండుగ సీజన్‌లో ఈ కొత్తకారు తీసుకొచ్చేందుకు  యాజమాన్యం సన్నహాలు చేస్తోంది.


ఎంజీ సీయూవీ కారు
చైనాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ (MG Motors)భారత్‌లో తొలిసారిగా ఎలక్ర్టిక్‌  సీయూవీ(CUV) కారును భారత్‌లో లాంచ్‌ చేయబోతోంది. రాబోయే పండుగ సీజన్‌లో ఈ వాహనం భారత్ రోడ్లపై పరుగులుపెట్టనుంది. ఇప్పటికే ఎంజీ కార్లు భారత్‌లో మంచి మార్కెట్‌ సంపాదించుకున్నాయి. ప్రీమియం మోడళ్లు అయిన హెక్టార్‌(Hector)తో దుమ్మురేపుతోంది. అదే కోవలో ఇటీవల కొత్తగా ఓ హైబ్రిడ్ ఎస్‌యూవీని సైతం లాంఛ్‌ చేసింది. భారత్ మార్కెట్‌పై పట్టుబిగించేందుకు మరిన్ని మోడల్స్‌ను తీసుకొస్తోంది. భవిష్యత్ మొత్తం ఎలక్ట్రిక్‌ (EV)కార్లదే  హవా కానుండటంతో అందుకు తగ్గట్లుగా ఇప్పటి నుంచే అడుగులు వేస్తోంది. ఈ పండుగ సీజన్‌కు ఈవీ (EV)మోడల్‌లో ఓ కొత్త సీయూవీ లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే  ఈవీ శ్రేణిలో ఎంజీ కామెట్ బుజ్జికారు  విక్రయాలు జోరుగా సాగుతుండగా.. ఎంజీ జెడ్‌ఎస్‌ సైతం దూసుకుపోతోంది. ఇప్పుడు వాటికన్నా కొంచెం పెద్దగా సీయూవీ మోడల్‌ను  ఎంజీ(MG) రంగంలోకి దించుతోంది. అంటే ఇది సెడాన్, ఎస్‌యూవీ కలయికతో వచ్చిన కొత్త వేరియంట్. అటు సెడాన్‌ కన్నా కొంచెం పెద్దదిగా, ఇటు ఎస్‌యూవీ కన్నా కాస్త చిన్నదిగా  ఉంటుంది.


ఆకట్టుకునేలా హంగులు
 విశాలమైన క్యాబిన్‌తోపాటు ఆకర్షణీమైన ఇంటీరియర్‌తో దీన్ని తీర్చిదిద్దామని కంపెనీ చెబుతోంది. భారతీయ రోడ్లు, ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా కొంత మార్పులు, చేర్పులు చేశామని చెప్పారు. ప్లష్‌డోర్లు, ఎల్‌ఈడీ లైటింగ్‌ అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి. కారులో వెనక కూర్చుకున్న వారికి కూడా ఏసీ సమానంగా వచ్చేలా ఏసీ వెంట్‌లు ఉన్నాయి. లోపల ఉన్న బటన్లు మొత్తం టచ్‌స్క్రీన్ ఆధారితంగా  ఏర్పాటు చేశారు. భారత్‌ రోడ్ల కోసం 360 డిగ్రీలు కవర్‌ అయ్యేలా కెమెరా, ఏడీఏఎస్‌, యాంబియంట్‌ లైటింగ్‌తోపాటు  లోపల అన్నీ రిక్లయినింగ్‌ సీట్లు ఏర్పాటు చేయడం విశేషం. పండుగుల సీజన్ నాటికి ఈ కారును లాంఛ్‌ చేయనున్నారు. 


ఒక్కసారి ఛార్జింగ్‌తో 400 కిలోమీటర్లు ప్రయాణం
కొత్తగా లాంఛ్‌ చేయబోతున్న ఈ కారుకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే సుమారు 460 కిలోమీటర్లు ప్రయాణించనుంది. కారుకు సంబంధించి  మరిన్ని ఫీచర్లను లాంఛింగ్‌కు ముందు వెల్లడించనున్నట్లు  ఎంజీ యాజమాన్యం తెలిపింది. దీని ధర 20 లక్షల లోపు ఉండొచ్చని  కంపెనీ ప్రతినిధులు తెలిపారు.


భారత్ మార్కెట్‌పై కన్ను
కొన్నేళ్లుగా భారత్‌ మార్కెట్‌పై కన్నేసిన చైనా కార్ల తయారీ సంస్థలు...కొత్త కొత్త మోడళ్లతో ఆకట్టుకుంటున్నాయి. ఇదే కోవలో భారత్‌లో అడుగుపెట్టిన ఎంజీ మోటార్స్‌...హెక్టార్‌తో ఎస్‌యూవీ రేంజ్‌లో అదరగొట్టింది. ఇంటర్‌నెట్ ఇన్‌ది కారు పేరిట కార్ల ప్రియులను ఆకట్టుకుంది. ఆ తర్వాత మధ్యశ్రేణిస్థాయిలో తీసుకొచ్చిన ఎంజీ ఆస్టర్‌ సైతం అమ్మకాల్లో జోరు కనబరిచింది. అలాగే ఎంజీ గ్లోస్టర్‌ సైతం నిలకడగా అమ్మకాలు సాగుతున్నాయి. ఈవీ విభాగంలోనూ ఎంజీ తన మార్కు చూపించింది. బుజ్జికారు ఎంజీ కామెట్‌ ఎంతో ఆకట్టుకుంది. ఎంజీ జెడ్‌ఎస్‌ సైతం భారతీయుల మనసు దోచుకుంది.