Tesla India: టెస్లా భారత్‌కు వచ్చేసింది. ముంబైలో తొలి షోరూం ప్రారంభించింది. రెండో షో రూమ్‌ను ఢిల్లీలో ప్రారంభించబోతోంది. దీనికి కూడా ఏర్పాట్లు చురుగ్గానే సాగుతున్నాయి. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని మేకర్ మాక్సిటీలో తొలి టెస్లా షోరూమ్ ప్రారంభమైంది. ఇక్కడ మోడల్ Yని లాంగ్-రేంజ్ RWD, AWD వేరియంట్లలో విడుదల చేశారు. ఈ కారు డెలవరీలను ఆగస్టులో ఇచ్చే అవకాశం ఉంది. అంటే భారత్‌లో టెస్లా కార్ల పరుగు వచ్చే నెల నుంచి ప్రారంభంకానుంది.
ఇక్కడ అసెంబుల్ సౌకర్యం లేనందున కంప్లీట్లీ బిల్ట్ యూనిట్స్ మాత్రమే దిగుమతి చేసుకుంటున్నారు. అందుకే వీటి ధర చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం విడుదలైన మోడల్ వై ధరలు రూ. 59.9 లక్షల నుంచి రూ. 67.9 లక్షల వరకు ఉన్నాయి. ఇది అమెరికాలో చాలా తక్కువ ధరకే అమ్ముడు అవుతున్నప్పటికీ దిగుమతి సుంకం ఎక్కువగా ఉంది. అందుకే ధర అమాంతం పెరిగిపోయింది.
భారత్‌లో టెస్లా కార్ల తయారీ యూనిట్ పెట్టే ఆలోచన ఎలాన్ మస్క్‌కు లేదు. అయినా సరే గతంలో ఓసారి ఇక్కడి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ మాత్రం జారీ చేశారు. అంతే కాకుండా ఢిల్లీ, ముంబై, బెంగళూరులలో సూపర్‌చార్జర్ నెట్‌వర్క్‌లు మ్యాప్ చేస్తోంది.
ఇప్పుడు ముంబైలో ప్రారంభించిన షోరూమ్‌లో లాంచే చేసిన మోడల్ వై ధరను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మోడల్ ప్రైస్ తెలిసిన తర్వాత నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ప్రీమియం క్లాస్‌కు మాత్రమే ధరలు అందుబాటులో ఉన్నాయని అంటున్నారు. భారత్‌లో ఆటో ప్రోడెక్ట్ విజయవంతం కావాలంటే కచ్చితంగా మధ్య తరగతి మార్కెట్‌ను టార్గెట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా ప్రీమియం కార్ల కంపెనీలు కూడా మధ్య తరగతి అందుబాటులో ఉండేలా ధరలను అడ్జెస్ట్ చేస్తున్నారు. వారి టార్గెట్‌గానే మార్కెటింగ్ స్ట్రాటజీని బిల్డ్ చేస్తున్నారు. ఆ సూత్రాన్ని టెస్లా మర్చిపోయిందని అంటున్నారు.
ధరలతోపాటు భారత్‌లోని రోడ్ల పరిస్థితులను కూడా గుర్తు చేస్తున్నారు. అక్కడ ఉండే గతుకుల రోడ్లకు, వానాకాలంలో నీటితో నిండి ఉండే రోడ్లను టెస్లా ఎంత వరకు తట్టుకుంటుందో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీటిని ఫన్నీ వేలో ట్రోల్ చేస్తున్నారు.
60 లక్షల ఖరీదు పెట్టి 500 కిలోమీటర్లు ఎందుకని మహీంద్ర, టాటా, హ్యూందాయ్ లాంటి కంపెనీ కార్లు ఇంతకంటే తక్కువకు వస్తున్నాయని అంటున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ గురించి ఆలోచించవద్దని.. ఇక్కడ మనిషి డ్రైవింగ్ చేస్తేనే గమ్యానికి చేరుతామో లేదో తెలియని అలాంటిది మెషిన్ డ్రైవింగ్ చేస్తే పరిస్థితి ఏంటో ఊహించుకోవాలని అంటున్నారు. చిన్న వర్షం పడినా చాలు ఇండియాలో రోడ్లు నీటితో నిండిపోతాయని అలాంటి చోట టెస్లా ఎంత వరకు పని చేస్తుందోనని సెటైర్లు వేస్తున్నారు. ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని గుర్తు చేస్తున్నారు.