Telangana Latest News: తెలంగాణ రాష్ట్రంలో రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. కొత్తగా వ్యక్తిగత వాహనాలను కొనుగోలు చేసే సామాన్యులకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కోసం వాహనదారులు ప్రాంతీయ రవాణా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. వాహనం కొనుగోలు చేసిన షోరూమ్‌లోనే అంటే డీలర్‌ వద్దనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేలా నూతన సంస్కరణలను అమల్లోకి తెచ్చారు. 

Continues below advertisement

మధ్యవర్తుల బెడద లేకుండా 

గత కొంతకాలంగా ఆర్టీఏ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంటేనే అవినీతికి నిలయమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వ్యక్తిగత వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాలకు వెళ్లినప్పుడు, అక్కడ ఉండే మధ్యవర్తులు లేదా అధికారులకు ముడుపులు ఇస్తేనే పనులు జరుగుతున్నాయన్న ఫిర్యాదులు పెరిగాయి. . ఈ పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గతేడాది డిసెంబర్‌ 19న రవాణా శాఖాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా, డీలర్ల వద్దనే నేరుగా రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని తీసుకురావాలని ఆయన సూచించారు. 

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రవాణాశాఖ కమీషన్ ఇలంబర్తి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నూతన విధానాన్ని సంబంధించి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను కేవలం 15 రోజుల్లోగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈ సేవలను వేగవంతం చేసేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు. వాస్తవానికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో వాహన్‌, సారథి పోర్టల్‌ ద్వారా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ విధానం ఇప్పటికే అమలవుతోంది. అయితే తెలంగాణలో ఈ పోర్టల్‌లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి మరో ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉండటంతో, ప్రజలకు తక్షణ సౌకర్యం కోసం ప్రభుత్వం ఈ తాత్కాలిక సాఫ్ట్‌వేర్ ఏర్పాటు చేస్తోంది. 

Continues below advertisement

పాత పద్ధతికి స్వస్తి- కొత్త విధానం ఎలా

ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం, ఎవరైనా కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తే డీలర్‌ వద్ద కేవలం తాత్కాలిక రిజిస్ట్రేషన్ మాత్రమే జరిగేది. శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం తప్పనిసరిగా వాహనాన్ని ఆర్టీఏ కార్యాలయానికి తీసుకెళ్లాల్సి వచ్చేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం, అధీకృత డీలర్‌ వద్దనే శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 

వాహనదారులు డీలర్‌ వద్ద సమర్పించాల్సిన పత్రాలు

  • వాహన్ ఇన్వాయిస్
  • ఫారం-21( విక్రయ ధ్రువీకరణ పత్రం)
  • ఫారం-22(రోడ్డు అనుకూలత ధ్రువీకరణ)
  • బీమా
  • కొనుగోలుదారుల చిరునామా ధ్రువీకరణ పత్రం 
  • సదరు వ్యక్తి పేరు మీద మరో వాహనం లేదని తెలిపే డిక్లరేషన్ 
  • కొనుగోలుదారుల ఫొటో, సంతకం స్కాన్ కాపీ 
  • వాహనం ఇంజిన్, ఛాసిస్‌  నంబర్లు ఫొటోలు 
  • రవాణా శాఖ నిర్దేశించే ఇతర అవసరమైన పత్రాలు 

ఈ పత్రాలన్నింటినీ డీలర్‌ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఆ తర్వాత రిజిస్టరింగ్ అథారిటీ లేదా అదనపు రిజిస్టరింగ్ అథారిటీ ఆ పత్రాలను నిశితంగా పరిశీలిస్తారు. అన్ని నిబంధనల ప్రకారం ఉంటే దరఖాస్తును ఆమోదిస్తారు. లేని పక్షంలో తిరస్కరించే అధికారం ఉంటుంది. 

ఆర్సీ కారు నేరుగా ఇంటికే

దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత, వాహనదారులకు రిజిస్ట్రేషన్ పత్రం కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. నమోదు ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఆర్సీ కార్డు నేరుగా స్పీడ్ పోస్టు ద్వారా కొనుగోలుదారుల చిరునామాకు పంపిస్తారు. దీని వల్ల వాహనదారులకు సమయం ఆదా అవుతుంది. కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ తప్పుతుంది. 

పారదర్శకతకు పెద్ద పీట 

ఈ సడలింపుల వల్ల ఎటువంటి అక్రమాలు జరగకుండా ప్రభుత్వం కఠిన నిబంధనలను కూడా పెట్టింది. డీలర్ల వద్ద ఉన్న వాహనాల నిల్వలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను అధికారులు ఎప్పుడైనా తనిఖీ చేయవచ్చు. వెహికల్‌ ఇన్‌స్పెక్టర్, ఆర్టీవో, డీటీసీ, జేటీసీ, రవాణా కమిషనర్‌ కూడా అధీకృత డీలర్ల వద్ద తనిఖీలు చేయవచ్చు. తద్వారా నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.