Tata Xpres Petrol and CNG Price, Features: ఫ్లీట్‌ ఆపరేటర్లు, క్యాబ్‌ సర్వీసులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన టాటా మోటార్స్‌, ఇప్పుడు మరో కీలక అడుగు వేసింది. ఇప్పటికే ఎలక్ట్రిక్‌ వాహనంగా అందుబాటులో ఉన్న Xpres-T EV కి కొనసాగింపుగా, ICE వెర్షన్‌గా టాటా ఎక్స్‌ప్రెస్‌ పెట్రోల్‌, CNG వేరియంట్లను ఫ్లీట్‌ వినియోగదారుల కోసం మాత్రమే లాంచ్‌ చేసింది. ఈ కారు సాధారణ కస్టమర్లకు కాకుండా, పూర్తిగా ఫ్లీట్‌ మార్కెట్‌ను ‍‌(క్యాబ్‌ బిజినెస్‌) లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చింది.

ధరలు & బుకింగ్స్‌ వివరాలు

టాటా ఎక్స్‌ప్రెస్‌ పెట్రోల్‌ వేరియంట్‌ను రూ.5.59 లక్షలు, CNG వేరియంట్‌ను రూ.6.59 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర) వద్ద అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెండు వేరియంట్లకు బుకింగ్స్‌ను టాటా మోటార్స్‌ ఇప్పటికే ప్రారంభించింది. ఫ్లీట్‌ ఆపరేటర్లకు సరిపోయేలా ఫ్లెక్సిబుల్‌ ఫైనాన్స్‌ ఆప్షన్లను కూడా కంపెనీ అందిస్తోంది.

ఇంజిన్‌, పనితీరు వివరాలు

టాటా ఎక్స్‌ప్రెస్‌ పెట్రోల్‌ వేరియంట్‌లో 1.2 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 86hp పవర్‌, 113Nm టార్క్‌ ఇస్తుంది. ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ను జత చేశారు.

CNG వేరియంట్‌లో సేమ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌కు CNG కిట్‌ను అమర్చారు. అయితే, CNG వేరియంట్‌కు సంబంధించిన పవర్‌ నంబర్స్‌ను టాటా మోటార్స్‌ ఇంకా వెల్లడించలేదు.

బూట్‌ స్పేస్‌, వీల్స్‌

పెట్రోల్‌ వేరియంట్‌లో 419 లీటర్ల బూట్‌ స్పేస్‌ లభిస్తుంది. CNG వేరియంట్‌లో ట్విన్‌ సిలిండర్‌ సెటప్‌ను ఉపయోగించారు. వీటి సామర్థ్యం 70 లీటర్లు (వాటర్‌ కెపాసిటీ). ఇది ఒకే పెద్ద సిలిండర్‌తో పోలిస్తే తక్కువ బూట్‌ స్థలాన్ని ఆక్రమిస్తుంది.ఈ కారు 14 ఇంచుల స్టీల్‌ వీల్స్‌పై నడుస్తుంది. ఇవి బ్లాక్‌ వీల్‌ కవర్స్‌తో వస్తాయి.

ఇంటీరియర్‌, ఫీచర్లు

ఎలక్ట్రిక్‌ Xpres-T EVతో పోలిస్తే, ఈ ICE Xpresలో డ్యుయల్‌ టోన్‌ క్యాబిన్‌ అందించారు. అయితే, ఆడియో సిస్టమ్‌, ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా లేవు. అలాగే, రియర్‌ ఏసీ వెంట్స్‌, టైప్‌-C ఛార్జింగ్‌ పోర్ట్స్‌ వంటి కంఫర్ట్‌ ఫీచర్లను కూడా ఇందులో ఇవ్వలేదు. వెహికల్‌ లొకేషన్‌ ట్రాకింగ్‌, పానిక్‌ బటన్‌ వంటి సదుపాయాలు కూడా లేవు. అయితే, అవసరమైతే వీటిని తర్వాత ఫిట్‌ చేసుకునే అవకాశం ఉంది.

వారంటీ & ఫ్లీట్‌ ఫోకస్‌

టాటా మోటార్స్‌ ఈ కారుకు 3 సంవత్సరాలు లేదా 1,00,000 కి.మీ. స్టాండర్డ్‌ వారంటీ ఇస్తోంది. దీన్ని 5 సంవత్సరాలు లేదా 1,80,000 కి.మీ. వరకు పొడిగించుకునే అవకాశం కూడా కల్పించింది. ఫ్లీట్‌ వినియోగదారుల కోసం ఎంపిక చేసిన నగరాల్లో ప్రత్యేక డీలర్‌షిప్‌లు, సర్వీస్‌ సపోర్ట్‌ను టాటా ఏర్పాటు చేసింది.

మొత్తంగా చూస్తే, తక్కువ ధర, ఈజీ మెయింటెనెన్స్‌, టాటా నమ్మకం... ఇవన్నీ కలిపి ఎక్స్‌ప్రెస్‌ పెట్రోల్‌, CNG వేరియంట్లు ఫ్లీట్‌ మార్కెట్‌లో గట్టిగానే పోటీ ఇచ్చే అవకాశముంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.