Tata Sierra EV Features: భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి మరింత ఊపునిచ్చేలా, టాటా మోటార్స్ తన అత్యంత ప్రతిష్టాత్మక మోడల్ టాటా సియెరా EVకి తొలి టీజర్‌ను విడుదల చేసింది. కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ కొత్త ఎలక్ట్రిక్ SUV జూన్ 30న అధికారికంగా ప్రపంచానికి పరిచయం కానుంది. ప్రస్తుతం టాటా ఈవీ పోర్ట్‌ఫోలియోలో ఏడో ఎలక్ట్రిక్ మోడల్‌గా సియెరా EV చేరనుంది.
1990లలో భారతీయ రోడ్లపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సియెరా పేరును ఆధునిక రూపంలో మళ్లీ తీసుకువస్తున్న టాటా, ఈసారి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో జనం ముందుకు రానుంది. ఇప్పటికే ఆటో ఎక్స్‌పోల్లో ప్రదర్శించిన కాన్సెప్ట్ మోడల్‌కు మంచి స్పందన రావడంతో, ఇప్పుడు ప్రొడక్షన్ వెర్షన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
డిజైన్‌లో సియెరా ప్రత్యేకత
కొత్త సియెరా EVలో పాత సియెరా DNAని కొనసాగిస్తూ ఆధునిక డిజైన్ అంశాలను జోడించారు. ఫ్రంట్‌లో కనెక్టెడ్ LED హెడ్‌ల్యాంప్స్, క్లోజ్డ్ గ్రిల్, ఆకర్షణీయమైన బంపర్ డిజైన్ కనిపించనున్నాయి. సైడ్ ప్రొఫైల్‌లో బ్లాక్‌డ్-అవుట్ A & C పిల్లర్స్, సియెరాకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన వంపుతో కూడిన రియర్ గ్లాస్ డిజైన్ కొనసాగనుంది. టాప్ వేరియంట్లలో 19 అంగుళాల అల్లాయ్ వీల్స్ కూడా అందించే అవకాశం ఉంది. మొత్తం మీద సియెరా EV ప్రీమియం SUV లుక్‌తో మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ట్రిపుల్ స్క్రీన్ సెటప్‌తో హైటెక్ క్యాబిన్
సియెరా EV ఇంటీరియర్ కూడా అత్యాధునిక టెక్నాలజీతో నిండివుండనుంది. టాప్ వేరియంట్లలో 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 అంగుళాల ప్యాసింజర్ డిస్‌ప్లేతో కూడిన ట్రిపుల్ స్క్రీన్ సెటప్ అందించనున్నారు. అదనంగా ప్యానోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ సీట్లు, హెడ్-అప్ డిస్‌ప్లే (HUD), ప్రీమియం ఆడియో సిస్టమ్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్‌లు వంటి ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది.
హారియర్ EV టెక్నాలజీతో పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్
సియెరా EVని, టాటా కొత్త acti.ev+ ప్లాట్‌ఫామ్ ఆధారంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇదే ప్లాట్‌ఫామ్‌పై హారియర్ EVని కూడా రూపొందించారు. దీంతో, సియెరా EVలో కూడా 65kWh & 75kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు లభించే అవకాశం ఉంది.
కంపెనీ సమాచారం ప్రకారం ఈ ఎలక్ట్రిక్ SUV రియర్ వీల్ డ్రైవ్ (RWD) & ఆల్ వీల్ డ్రైవ్ (AWD) వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా 75kWh బ్యాటరీతో AWD వెర్షన్ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
హారియర్ EVతో పోలిస్తే సియెరా పరిమాణంలో కొద్దిగా చిన్నదిగా ఉండటంతో, అదే బ్యాటరీతో మరింత మెరుగైన డ్రైవింగ్ రేంజ్ అందించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ధర ఎంత ఉండొచ్చు?
టాటా సియెరా EV ధర రూ.18 లక్షల నుంచి రూ.25 లక్షల (ఎక్స్‌షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉంది. మార్కెట్లో ఇది Mahindra BE 6, Hyundai Creta Electric, MG ZS EV, Maruti e Vitara వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
