Tata Punch vs Nexon Comparison: భారత్‌లో రూ.10 లక్షల లోపు SUV కొనాలనుకునే వారికి ఇప్పుడు టాటా నుంచి ఆసక్తికరమైన అయోమయం ఎదురవుతోంది. తాజాగా ఫేస్‌లిఫ్ట్‌తో వచ్చిన Tata Punchలో నెక్సాన్‌లో ఉపయోగించే 1.2 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్, మరిన్ని ఫీచర్లు జోడించడంతో, పంచ్ టాప్ వేరియంట్ ధరలు నెక్సాన్ మిడ్ వేరియంట్‌కు దగ్గరయ్యాయి. దీంతో Tata Punch టాప్ వేరియంట్ అయిన Accomplished+ S & Tata Nexon మిడ్ స్పెక్ వేరియంట్ అయిన Creative లో ఏది బెస్ట్ వాల్యూ ఇస్తుందన్న ప్రశ్న కొనుగోలుదారుల్లో తలెత్తుతోంది.
సైజ్, డైమెన్షన్స్ పోలిక
డైమెన్షన్స్ విషయానికి వస్తే, Tata Nexon అన్ని అంశాల్లోనూ పెద్ద SUV. పంచ్‌తో పోలిస్తే నెక్సాన్ 119mm ఎత్తు, 62mm వెడల్పు, 53mm వీల్‌బేస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే నెక్సాన్‌కు 15mm ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంది. బూట్ స్పేస్ విషయంలో కూడా నెక్సాన్‌కు స్వల్ప ఆధిక్యం ఉంది. అయితే, పంచ్ బరువు తక్కువగా ఉండటం ఒక కీలకమైన ప్లస్ పాయింట్‌గా మారుతుంది.
ఇంజిన్, పనితీరు
రెండు SUVల్లోనూ ఒకే 1.2 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 120hp శక్తి, 170Nm టార్క్ ఇస్తుంది. అయితే పంచ్ బరువు సుమారు 1,143 కిలోలు మాత్రమే ఉండగా, నెక్సాన్ బరువు దాదాపు 1,350 కిలోలు ఉంటుంది. దీంతో పంచ్‌కు పవర్-టు-వెయిట్, టార్క్-టు-వెయిట్ నిష్పత్తి మెరుగ్గా ఉంటుంది. నిజ జీవిత డ్రైవింగ్‌లో పంచ్ మరింత చురుకుగా అనిపించే అవకాశం ఉంది.
ఎక్స్‌టీరియర్ ఫీచర్లు
బయట నుంచి చూస్తే, పంచ్ Accomplished+ Sలో కొన్ని అదనపు ఫీచర్లు కనిపిస్తాయి. ఇందులో ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, వెనుక భాగంలో LED లైట్ బార్ ఉంటాయి. ఇవి నెక్సాన్ Creative వేరియంట్‌లో లేవు. మరో తేడా ఏమిటంటే, పంచ్‌కు బ్లాక్ రూఫ్ రైల్స్ వస్తే, నెక్సాన్‌లో సిల్వర్ రూఫ్ రైల్స్ ఉంటాయి.
ఇంటీరియర్, ఫీచర్లు
ఇక్కడే పంచ్ స్పష్టంగా ముందంజ వేస్తుంది. నెక్సాన్ Creative వేరియంట్‌లో లేని సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, రియర్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్ వంటి ఫీచర్లు పంచ్‌లో లభిస్తాయి. రెండు కార్లలోనూ 10.25 ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉన్నప్పటికీ, పంచ్‌లో పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. అలాగే పంచ్‌లో 8 స్పీకర్లు, నెక్సాన్‌లో మాత్రం 4 స్పీకర్లు మాత్రమే ఉన్నాయి.
డ్రైవింగ్ టెక్నాలజీ
డ్రైవ్ మోడ్‌లు, క్రూయిజ్ కంట్రోల్ రెండింటిలోనూ ఉన్నాయి. అయితే నెక్సాన్‌లో అదనంగా స్పోర్ట్ మోడ్ ఉంటుంది. ఈ ఒక్క అంశంలోనే నెక్సాన్‌కు స్వల్ప ఆధిక్యం.
భద్రత
భద్రత విషయంలో రెండూ బలంగానే ఉన్నాయి. 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సర్లు, ESC వంటి ఫీచర్లు రెండింటిలోనూ ఉన్నాయి. అయితే పంచ్‌లో అదనంగా ఆటో డిమ్మింగ్ IRVM, TPMS, హిల్ స్టార్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్ లభిస్తాయి. రెండు SUVలకూ ADAS లేదు.
ధర, తుది నిర్ణయం
Punch Accomplished+ S ధర రూ. 9.80 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, Nexon Creative ధర రూ. 10 లక్షలు (ఎక్స్-షోరూమ్). అంటే, Punch Accomplished+ S టర్బో మాన్యువల్ వేరియంట్, Nexon Creative కంటే సుమారు రూ.20,000 తక్కువ. తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లు, మెరుగైన పనితీరు అందించడం వల్ల టాప్ ఎండ్ Tata Punch ఈ పోలికలో స్పష్టంగా బెటర్ వాల్యూ ఫర్ మనీ SUVగా నిలుస్తోంది. ఎక్కువ స్పేస్ కావాలంటే నెక్సాన్ సరిపోతుంది. కానీ ఫీచర్లు, ధర, డ్రైవింగ్ ఫన్ అన్నింటినీ కలిపి చూస్తే, రూ.10 లక్షల బడ్జెట్‌లో Tata Punch Accomplished+ S సరైన ఎంపిక అని చెప్పవచ్చు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.