Tata Punch EV Price, Down Payment, Car Loan and EMI: కొత్త ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో టాటా మోటార్స్ చాలా చురుగ్గా మంచి పని చేస్తోంది, మార్కెట్ మూడ్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లు లాంచ్ చేస్తోంది. బిల్డ్ క్వాలిటీలో భేష్ అనిపించుకున్న టాటా బ్రాండ్ నుంచి వచ్చిన బెస్ట్ ఎలక్ట్రిక్ కారు "టాటా పంచ్ EV". ఈ కారు మోడ్రన్ ఫీచర్లను అందించడమే కాదు, ధర పరంగానూ కస్టమర్‌ను ఇబ్బంది పెట్టదు.
టాటా పంచ్ EV కొత్త లుక్ చాలా స్టైలిష్‌గా, మోడర్న్‌గా ఆకర్షిస్తోంది. ముందు భాగంలో ఇచ్చిన LED హెడ్‌ల్యాంప్స్ & క్లోజ్డ్ గ్రిల్ డిజైన్ ఈ ఎలక్ట్రిక్ కారుకు ఫ్యూచరిస్టిక్ ఫీల్‌ను ఇస్తుంది. సైడ్ ప్రొఫైల్‌లో ఉన్న షార్ప్ లైన్స్ SUV తరహా స్టాన్స్‌ను కలిగిస్తున్నాయి. వెనుక భాగంలో స్లీక్ టెయిల్‌ల్యాంప్స్ & స్పోర్టీ బంపర్ డిజైన్ పంచ్ EV కి అదనపు ఆకర్షణ తీసుకొస్తున్నాయి.
టాటా పంచ్ ఈవీ ఆన్-రోడ్ ప్రైస్
తెలుగు రాష్ట్రాల్లో, టాటా పంచ్ ఈవీ ఎక్స్-షోరూమ్ ధర రూ . 9.99 లక్షలు (Tata Punch ex-showroom price, Hyderabad Vijayawada) మాత్రమే. హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్ కోసం దాదాపు రూ. 2,000 (ఎలక్ట్రిక్ కారు కాబట్టి నామమాత్రపు రుసుము), బీమా కోసం దాదాపు రూ. 48,000, ఇతర అవసరమైన ఖర్చులు కలుపుకుంటే, ఈ కారును దాదాపు రూ. 10.50 లక్షల ఆన్-రోడ్ ధరకు (Tata Punch on-road price, Hyderabad) కొనుగోలు చేయవచ్చు. విజయవాడ (Tata Punch on-road price, Vijayawada) సహా ఇతర తెలుగు నగరాల్లోనూ దాదాపు ఇదే ధర ఉంటుంది.
హైదరాబాద్‌లో టాటా పంచ్ ఈవీ కొనడానికి మీరు రూ. 4 లక్షల డౌన్ పేమెంట్ చేస్తే, రూ. 6.50 లక్షలను బ్యాంకు నుంచి కారు లోన్‌గా తీసుకోవాలి. మీరు ఈ మొత్తాన్ని 9 శాతం వార్షిక వడ్డీ రేటుతో పొందారని అనుకుందాం.
నెలకు రూ. 10,124 EMI చొప్పున చెల్లిస్తే, మీ మొత్తం కారు లోన్ 7 సంవత్సరాల్లో తీరిపోతుంది.
నెలకు రూ. 11,389 EMI చొప్పున కడితే, మీ మొత్తం కారు లోన్ 6 సంవత్సరాల్లో క్లోజ్ అవుతుంది.
నెలకు రూ. 13,171 EMI చొప్పున డిపాజిట్ చేస్తే, మీ మొత్తం కారు లోన్ 5 సంవత్సరాల్లో మాఫీ అవుతుంది.
నెలకు రూ. 15,858 EMI చొప్పున చెల్లిస్తే, మీ మొత్తం కారు లోన్‌ను 4 సంవత్సరాల్లో తీర్చేయవచ్చు.
టాటా పంచ్ ఈవీ ఫీచర్లు & ఇంజిన్
టాటా మోటార్స్, పంచ్ EV పవర్ కోసం 25 kWh సామర్థ్యం గల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఇచ్చింది. ఈ బ్యాటరీ ప్యాక్‌ను AC ఛార్జర్‌తో 3.6 గంటల్లో 10 నుంచి 100 శాతం వరకు & DC ఫాస్ట్ ఛార్జర్‌తో 56 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది .
పూర్తిగా ఛార్జ్ చేస్తే, పంచ్ EV 315 కి.మీ. డ్రైవింగ్ రేంజ్‌ను అందించగలదని టాటా మోటార్స్ వెల్లడించింది. అలాగే, ఇది గరిష్టంగా గంటకు 140 కి.మీ. వేగంతో బాణంలా దూసుకెళ్తుంది. కంపెనీ ప్రకారం, పంచ్ EV 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని చేరుకోవడానికి 9.5 సెకన్లు పడుతుంది.