Physical controls in Tata cars: భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్‌, తన కార్ల ఇంటీరియర్ డిజైన్‌లో కీలక మార్పులకు సిద్ధమవుతోంది. గత కొన్నేళ్లుగా టచ్‌స్క్రీన్‌లు, హ్యాప్టిక్ కంట్రోల్స్‌పై ఎక్కువగా దృష్టి పెట్టిన సంస్థ, ఇప్పుడు కస్టమర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మళ్లీ ఫిజికల్ బటన్లు, స్విచ్‌లను తీసుకురావాలని నిర్ణయించింది.

Continues below advertisement

"మా కొన్ని ఉత్పత్తుల్లో పూర్తిగా బటన్లు లేకుండా టచ్ ఆధారిత వ్యవస్థలను ప్రవేశపెట్టాం. అయితే వినియోగదారులు ఇంకా కొన్ని కీలక నియంత్రణల కోసం ఫిజికల్ ఇంటర్‌ఫేస్‌ను కోరుకుంటున్నారు. అందుకే ఇప్పుడు వాటిని తిరిగి ప్రవేశపెట్టే ప్రక్రియలో ఉన్నాం" - టాటా మోటార్స్ చీఫ్ డిజైన్ ఆఫీసర్ మార్టిన్ ఉహ్లారిక్

కస్టమర్లు ఏం చెప్పారు?

Continues below advertisement

ప్రస్తుతం టాటా టియాగో, టిగోర్ మినహా పంచ్‌, నెక్సాన్‌, కర్వ్‌, హారియర్‌, సఫారి, త్వరలో రానున్న సియెర్రా వంటి మోడళ్లలో టచ్‌స్క్రీన్ ఆధారిత HVAC కంట్రోల్స్, హ్యాప్టిక్ స్టీరింగ్ వీల్ బటన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆధునికంగా కనిపించినప్పటికీ, డ్రైవింగ్ సమయంలో ఉపయోగించడంలో కొంత అసౌకర్యంగా ఉంటున్నాయని చాలామంది కార్‌ ఓనర్లు & డ్రైవర్లు అభిప్రాయపడ్డారు.

టాటా మోటార్స్‌ తన కస్టమర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంది. అయితే, పూర్తిగా పాత తరహా బటన్లకు తిరిగి వెళ్లడం లేదు. కంపెనీ "హైబ్రిడ్ అప్రోచ్"ను అనుసరించనుంది. అంటే టచ్‌స్క్రీన్‌లు కొనసాగుతూనే, ఎక్కువగా ఉపయోగించే కీలక ఫంక్షన్లకు ఫిజికల్ కంట్రోల్స్‌ను అందించనుంది.

మార్టిన్ ఉహ్లారిక్ మాటల్లో చెప్పాలంటే, "స్క్రీన్‌లు పూర్తిగా మాయం కావు. భవిష్యత్ కార్లలో డిజిటల్ ఇంటర్‌ఫేస్‌లు ఉంటాయి. కానీ కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో ఫిజికల్ కంట్రోల్స్‌ను కూడా అందిస్తాం" అన్నారు.

సేఫ్టీ కూడా ముఖ్యమే కదా..

వినియోగదారుల అభిప్రాయం ప్రకారం, ఫిజికల్ బటన్లు కేవలం సౌలభ్యం కోసం మాత్రమే కాదు, వాహనంతో మరింత అనుబంధాన్ని కలిగిస్తాయి. డ్రైవింగ్ సమయంలో స్క్రీన్‌పై చూడకుండా బటన్‌ను తాకి ఉపయోగించగలగడం భద్రతపరంగా కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇక టాటా ప్రత్యేకంగా నాణ్యమైన స్విచ్‌లు, బటన్లపై దృష్టి పెట్టనుంది. "అన్ని బటన్లను తిరిగి తీసుకురావాలనుకోవడం లేదు. కానీ తీసుకొచ్చే బటన్లు అత్యుత్తమ నాణ్యతతో ఉండాలి" అని ఉహ్లారిక్ తెలిపారు. దీంతో భవిష్యత్ టాటా కార్లలో ప్రీమియం అనుభూతి మరింత పెరగనుంది.

టాటా మోటార్స్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ పరిశ్రమలో కనిపిస్తున్న కొత్త ట్రెండ్‌కు అనుగుణంగా ఉంది. ఇప్పటికే వోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్, మెర్సిడెస్-బెంజ్ వంటి ప్రముఖ కంపెనీలు కూడా టచ్‌స్క్రీన్‌లతో పాటు ఫిజికల్ కంట్రోల్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రకటించాయి.

దీంతో రాబోయే రోజుల్లో టాటా నెక్సాన్‌, హారియర్‌, సఫారి, కర్వ్‌, సియెర్రా వంటి మోడళ్లలో మరింత వినియోగదారులకు అనుకూలమైన ఇంటీరియర్ డిజైన్‌లు కనిపించే అవకాశం ఉంది. ఇది టాటా కస్టమర్లకు ఖచ్చితంగా శుభవార్తే.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.