Tata Harrier EV Launching, Price, Range And Features: స్ట్రాంగెస్ట్ కార్లకు చిరునామా అయిన టాటా మోటార్స్, ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్న కొత్త ఎలక్ట్రిక్ SUV "టాటా హారియర్ EV"ని లాంచ్ చేసింది. ఇది కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రికల్ వెహికల్ (EV) మాత్రమే కాదు, మార్కెట్‌లోని ఇతర ఎలక్ట్రిక్ వాహనాలకు పూర్తి భిన్నంగా ఉండే 6 పవర్‌ఫుల్ ఫీచర్లు దీని సొంతం.
టాటా హారియర్ EV ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర (Tata Harrier EV ex-showroom price) రూ. 21.49 లక్షలు.
6 పవర్‌ఫుల్ ఫీచర్లు
1. బిగ్ బ్యాటరీ, లాంగ్ రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్
టాటా మోటార్స్ రెండు బ్యాటరీ ఆప్షన్స్‌తో లాంచ్ అయింది, అవి - 65kWh & 75kWh. హైరేంజ్ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ ఎలక్ట్రిక్ SUV 627 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని MIDC సర్టిఫై చేసింది. అంటే, సిటీ/టౌన్‌లో తిరగడంతో పాటు ఎలాంటి భయం లేకుండా దూర ప్రయాణాలు కూడా చేయవచ్చు. బ్యాటరీకి ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా ఉంది, కేవలం 15 నిమిషాల్లో 250 km ప్రయాణానికి సరిపోయేలా బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. అంటే, ఎక్కడైనా ఆగి టీ తాగేంత టైమ్‌లో మరో 250 km వెళ్లేలా బండిని ఛార్జ్ చేయవచ్చు.
2. డ్యూయల్ మోటార్ & AWD వ్యవస్థ
టాటా హారియర్ EV అతి పెద్ద ఫీచర్ దాని డ్యూయల్ మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్. ఫ్రంట్ మోటార్ 158 PS (116 kW) & రియర్ మోటార్ 238 PS (175 kW) జనరేట్ చేస్తుంది. మొత్తం టార్క్ 504Nm. బూస్ట్ మోడ్‌లో, ఈ SUV కేవలం 6.3 సెకన్లలో 0 నుంచి 100 km వేగాన్ని అందుకోగలదు, ఇది ఈ సెగ్మెంట్‌లో ఈ కారును హై పెర్ఫార్మెన్స్ గల ఎలక్ట్రిక్ SUVగా నిలిచింది.
3. 14.53-అంగుళాల నియో QLED స్క్రీన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్
ఈ SUVలో హర్మాన్ & శామ్‌సంగ్ తయారు చేసిన పెద్ద 36.9 సెం.మీ (14.53 అంగుళాల) నియో QLED సినిమా-స్టైల్ డిస్‌ప్లే ఉంది. టాటా ప్రకారం, ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటోమోటివ్ నియో QLED డిస్‌ప్లే ఇది. డాల్బీ అట్మాస్ & JBL 10-స్పీకర్ ఆడియో సిస్టమ్ కలయిక వల్ల "మొబైల్ మూవీ థియేటర్" లాంటి అనుభవాన్ని ఈ కార్ ఇస్తుంది.
4. 540 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా
హారియర్ EV కారులో అధునాతన 540-డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా సిస్టమ్ ఉంది. దీనిలో 360-డిగ్రీల కెమెరా ట్రాన్స్‌పరెంట్ అండర్ బాడీ వ్యూతో ఉంటుంది. దీనివల్ల కారు కింద ఉన్న రోడ్డును కూడా స్క్రీన్ మీద చూడవచ్చు. ఈ ఫీచర్ ఆఫ్-రోడింగ్ & ఇరుకైన పార్కింగ్ స్థలాలకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.
5. ఆటో పార్క్ అసిస్ట్ & సమన్ మోడ్
ఈ SUVలో ఉన్న ఆటో పార్క్ అసిస్ట్ ఫీచర్ కారును సమాంతరంగా లేదా లంబంగా ఉండే ప్రదేశాలలోనూ సులభంగా పార్క్ చేయవచ్చు. సమన్ మోడ్ ద్వారా కారును రిమోట్‌గా ముందుకు లేదా వెనుకకు నడపవచ్చు.
6. డిజిటల్ రియర్ వ్యూ మిర్రర్ & డాష్‌క్యామ్
టాటా హారియర్ EVలో సాంప్రదాయ అద్దానికి డిజిటల్ రియర్ వ్యూ మిర్రర్ ఉంది, ఇది ఇన్‌బిల్ట్ డాష్‌క్యామ్‌తో రియల్-టైమ్ ఫుటేజ్‌ను అందిస్తుంది. ఈ ఫీచర్ రాత్రిపూట లేదా వర్షాల వంటి ఇబ్బందికర వాతావరణంలోనూ మెరుగైన విజన్ అందిస్తుంది. భద్రత పరంగా ఇది ఒక ప్రధాన అప్‌గ్రేడ్‌గా పరిగణించబడుతుంది.
టాటా హారియర్ EV నాలుగు రంగుల్లో లాంచ్ అయింది - ఎంపవర్డ్ ఆక్సైడ్, నైనిటాల్ నక్టర్న్, ప్రిస్టైన్ వైట్, ప్యూర్ గ్రే. ఫుల్ బ్లాక్ కలర్‌లో స్టెల్త్ ఎడిషన్ కూడా అందుబాటులో ఉంది.