Tata Aeris Price, Mileage And Features Telugu: టాటా మోటార్స్ నుంచి మరో కొత్త కారు మార్కెట్లోకి రాబోతోంది. Tata Tigor స్థానాన్ని భర్తీ చేస్తూ టాటా ఏరిస్ సెప్టెంబర్ 25న అధికారికంగా విడుదల కానుంది. పెట్రోల్ వెర్షన్‌తో పాటు పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వెర్షన్‌లోనూ ఈ కారు అందుబాటులోకి రానుంది. దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్న టిగోర్‌కు ఇది భారీ అప్‌డేట్‌గా నిలవనుంది.

Continues below advertisement

డిజైన్ 

టిగోర్‌తో పోలిస్తే టాటా ఏరిస్‌లో చాలా మార్పులు కనిపించనున్నాయి. ముందుభాగం మరింత స్లీక్‌గా ఉంటుంది. సన్నని ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, పలుచని ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు ఆకర్షణగా నిలవనున్నాయి. ముందు బంపర్‌లో ఎల్‌ఈడీ ఫాగ్ ల్యాంప్స్‌తో పాటు సీ ఆకారపు డిజైన్ ఎలిమెంట్స్ ఉండనున్నాయి.

Continues below advertisement

టాటా దాఖలు చేసిన డిజైన్ పేటెంట్ చిత్రాలను బట్టి వెనుక భాగంలోనూ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్‌ను మరింత షార్ప్‌ డిజైన్‌తో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటి టిగోర్‌లో బూట్‌పై ఉన్న నంబర్ ప్లేట్‌ను బంపర్‌కు మార్చినట్లు తెలుస్తోంది. కొత్త షోల్డర్ లైన్, కొత్త అల్లాయ్ వీల్స్‌తో పాటు పర్పుల్ కలర్ కూడా ఏరిస్‌కు ప్రత్యేక ఆకర్షణగా ఉండొచ్చు. టిగోర్‌లో కనిపించే నాచ్‌బ్యాక్ ఆకృతి మాత్రం కొనసాగనుంది.

కారు లోపల కూడా కీలక మార్పులు ఉండనున్నాయి. కొత్త టియాగో తరహాలోనే ఏరిస్ క్యాబిన్‌ను ఆధునికంగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. డ్యూయల్ టోన్ ఇంటీరియర్, పియానో బ్లాక్ ఫినిష్, లేయర్డ్ డ్యాష్‌బోర్డ్ ఇందులో కనిపించవచ్చు. రెండు ఫ్రీ స్టాండింగ్ డిజిటల్ స్క్రీన్‌లతో పాటు టాటా కొత్త రెండు స్పోక్ స్టీరింగ్ వీల్‌ను అందించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Mahindra XUV 3XO ఫైనాన్స్‌ ఆఫర్‌: మీకు భారం కాని రేంజ్‌లోనే డౌన్‌పేమెంట్‌, EMI పేమెంట్‌!

ఫీచర్లు 

వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక ఏసీ వెంట్స్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటి సదుపాయాలు ఉండొచ్చు. వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు కూడా ఎంపిక చేసిన వేరియంట్లలో రావచ్చు. ఆరు ఎయిర్‌బ్యాగ్స్ & ఈఎస్‌సీ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

పవర్‌ట్రెయిన్‌

పెట్రోల్ ఏరిస్‌లో టిగోర్‌లో ఉన్న 1.2 లీటర్ మూడు సిలిండర్ల సహజ ఇంజిన్‌ను కొనసాగించే అవకాశం ఉంది. పెట్రోల్‌తో ఇది 86 హెచ్‌పీ శక్తి, 113 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. సిఎన్‌జీతో 76 హెచ్‌పీ, 97 ఎన్ఎమ్ అందిస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ & 5 స్పీడ్ ఏఎమ్‌టీ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉండొచ్చు.

ఏరిస్ ఈవీపై కూడా ఆసక్తి నెలకొంది. ఇందులో, టియాగో ఈవీలో ఇప్పటికే వాడుతున్న 19.2 కిలోవాట్ అవర్, 24 కిలోవాట్ అవర్ బ్యాటరీలను ఉపయోగించే అవకాశం ఉంది. 26 కిలోవాట్ అవర్ బ్యాటరీని కూడా టాటా ఉపయోగించవచ్చని తెలుస్తోంది. మోటార్ సామర్థ్యం గరిష్ఠంగా 75 హెచ్‌పీ వరకు ఉండొచ్చు.

ఇది కూడా చదవండి: ఇథనాల్ ఇంధనంపై కేంద్రం కీలక నిర్ణయం.. 100 శాతం ఇథనాల్‌తో దూసుకెళ్లనున్న కార్లు

ధర 

ప్రస్తుత టిగోర్ ధర రూ.5.70 లక్షల నుంచి రూ.9.10 లక్షల వరకు ఉంది. టిగోర్ ఈవీ ధర రూ.12.49 లక్షల నుంచి రూ.13.75 లక్షల వరకు ఉంది. కొత్త ఫీచర్లు, డిజైన్ మార్పుల కారణంగా ఏరిస్ ధర కొంత పెరిగే అవకాశం ఉంది. ఈవీ వెర్షన్‌లో బ్యాటరీ అద్దె విధానాన్ని (BaaS) అందించే అవకాశం కూడా ఉంది. మార్కెట్లో ఏరిస్‌కు హోండా అమేజ్, మారుతి డిజైర్ & హ్యుందాయ్ ఆరా ప్రధాన ప్రత్యర్థులుగా ఉండనున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.