Tata New Trucks India 2026: భారత కమర్షియల్ వాహనాల మార్కెట్‌లో టాటా మోటార్స్‌ మరోసారి తన శక్తిని చాటింది. ఒకేసారి 17 న్యూ జనరేషన్‌ ట్రక్కులను లాంచ్‌ చేస్తూ, టాటా తన కమర్షియల్ వాహనాల పోర్ట్‌ఫోలియోను పూర్తిగా అప్‌గ్రేడ్‌ చేసింది. 7 టన్నుల నుంచి 55 టన్నుల గ్రాస్‌ వెహికల్‌ వెయిట్స్‌ పరిధిలో ఈ ట్రక్కులు అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్మీడియట్‌, లైట్‌, మీడియం‌, హెవీ కమర్షియల్ సెగ్మెంట్లన్నింటినీ కవర్‌ చేసేలా ఈ లైనప్‌ను టాటా రూపొందించింది.

ఈ లాంచ్‌లో ముఖ్యమైన హైలైట్‌ ఏంటంటే, ILMCV సెగ్మెంట్‌ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన కొత్త ‘Azura’ సిరీస్‌. ఇదే కాకుండా, టాటా ఇప్పటికే ప్రారంభించిన Trucks.ev బ్రాండ్‌ను మరింత విస్తరించింది. Prima, Signa, Ultra ప్లాట్‌ఫామ్‌లను పూర్తిగా అప్‌గ్రేడ్‌ చేయడం కూడా ఇందులో భాగమే.

Azura సిరీస్‌ ప్రత్యేకతలు

కొత్త Azura ట్రక్కులు 7 టన్నుల నుంచి 19 టన్నుల వరకూ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటాయి. ఇవి ముఖ్యంగా ఇ-కామర్స్‌, FMCG సరుకుల రవాణా, వైట్‌ గూడ్స్‌, నిర్మాణ సామగ్రి, వ్యవసాయ ఉత్పత్తులు, ప్రాంతీయ లాజిస్టిక్స్‌ అవసరాలకు అనువుగా రూపొందించారు. ఈ సిరీస్‌కు శక్తినిచ్చేది కొత్త 3.6 లీటర్ల డీజిల్‌ ఇంజిన్‌. ఇది ఎక్కువ అప్‌టైమ్‌, మెరుగైన ఫ్యూయల్‌ ఎఫిషియెన్సీ, క్లాస్‌లోనే శక్తిమంతమైన పనితీరు ఇస్తుందని టాటా చెబుతోంది.

భద్రతలో పెద్ద అప్‌గ్రేడ్‌

Azura, Prima, Signa, Ultra - ఈ నాలుగు ప్లాట్‌ఫామ్‌లలోని ట్రక్కులన్నీ ఇప్పుడు ECE R29.03 క్రాష్‌ సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్‌ చేశారు. ఈ యూరోపియన్‌ నిబంధనలు ఫ్రంట్‌, సైడ్‌, రోలోవర్‌ ప్రమాదాల్లో మెరుగైన రక్షణను తప్పనిసరి చేస్తాయి. ఇదే కాకుండా, టాటా ట్రక్కుల్లో 23 వరకు ఇండియా స్పెసిఫిక్‌ యాక్టివ్‌ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో అడాప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌, లేన్‌ డిపార్చర్‌ వార్నింగ్‌, కొలిషన్‌ మిటిగేషన్‌ సిస్టమ్స్‌ కీలకం.

పనితీరు, ఆదాయం పెంచే మార్పులు

Fleet Edge కనెక్టెడ్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా డ్రైవర్‌ ప్రవర్తనను రియల్‌టైమ్‌లో మానిటర్‌ చేస్తారు. కొన్ని మోడళ్లలో 1.8 టన్నుల వరకూ అదనపు పేచ్‌లోడ్‌ పెరిగింది. దీని వల్ల ఒక్కో ట్రిప్‌నకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. 6.7 లీటర్ల Cummins డీజిల్‌ ఇంజిన్‌తో 7 శాతం వరకు ఫ్యూయల్‌ ఎఫిషియెన్సీ మెరుగుదల ఉందని టాటా వెల్లడించింది.

ఎలక్ట్రిక్‌ ట్రక్కుల్లో టాటా ఆధిపత్యం

Tata Trucks.ev బ్రాండ్‌ కింద భారత్‌లోనే అతి పెద్ద ఎలక్ట్రిక్‌ ట్రక్ పోర్ట్‌ఫోలియోను టాటా అందిస్తోంది. కొత్త J MOEV ప్లాట్‌ఫామ్‌పై ఈ ట్రక్కులు రూపొందాయి.

7 టన్నుల నుంచి 55 టన్నుల వరకూ ఎలక్ట్రిక్‌ ట్రక్కులు ఉన్నాయి. Ultra EV (7, 9, 12 టన్నులు), Prima E.28K ఎలక్ట్రిక్‌ టిప్పర్‌, Prima E.55S ఎలక్ట్రిక్‌ ప్రైమ్‌ మూవర్‌ ఈ లైనప్‌లో ఉన్నాయి.

Prima E.55Sలో 470 kW (630 hp) శక్తి, 453 kWh బ్యాటరీ ఉండటం దీన్ని దీర్ఘదూర, భారీ పనులకు అనువుగా మారుస్తోంది.

ఈ మొత్తం పోర్ట్‌ఫోలియోకు Sampoorna Seva 2.0 సర్వీస్‌ ఎకోసిస్టమ్‌ మద్దతుగా ఉంటుంది. 24 గంటల సర్వీస్‌, స్పేర్‌ పార్ట్స్‌ హామీ, AMC ప్యాకేజీలు, డ్రైవర్‌ ట్రైనింగ్‌, ప్రత్యేక ఫైనాన్స్‌ ఆప్షన్లు ఇందులో భాగం.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.