Suzuki e-Access Price, Range And Features Telugu: ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో బలమైన స్థానంలో ఉన్న టీవీఎస్, బజాజ్, హీరో, ఏథర్ వంటి కంపెనీలకు పోటీగా.. సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ e-యాక్సెస్‌ను ఇటీవల తీసుకొచ్చింది. వాస్తవానికి, సుజుకి ఈ స్కూటర్‌ను తొలిసారి 2025 జనవరిలో ప్రదర్శించింది. అయితే మార్కెట్లోకి మాత్రం 2026 జనవరిలో తీసుకొచ్చింది. ఆలస్యంగా వచ్చినప్పటికీ.. సుజుకి బ్రాండ్ పేరుతో కస్టమర్లను ఆకట్టుకోవాలని ప్రయత్నించింది. ఆటో ఎక్స్‌పర్ట్‌లు ఈ బండిని నిజమైన పరిస్థితుల్లో నడిపి చూసినప్పుడు కొన్ని మంచి అంశాలు కనిపించినప్పటికీ, కొన్ని మైనస్‌లను కూడా గుర్తించారు.
డిజైన్ విషయంలో e-యాక్సెస్ పూర్తిగా కొత్త ఉత్పత్తి. ఇప్పటికే ఉన్న పెట్రోల్ యాక్సెస్‌తో దీనికి పెద్దగా పోలిక ఉండదు. e-యాక్సెస్ ముందు భాగంలో డబుల్ డక్‌బిల్ ఆకారంలోని డిజైన్ కనిపిస్తుంది. వెనుక భాగం బాక్సీగా ఉంటుంది. ఈ రెండు డిజైన్ అంశాలు కలిసిన తీరు అందరికీ నచ్చకపోవచ్చు.
నిర్మాణ నాణ్యత మాత్రం బాగుంది. సుజుకి స్కూటర్లలో కనిపించే దృఢత్వం ఇందులోనూ ఉంది. 4.2 అంగుళాల TFT డిస్‌ప్లే అందించారు. ఈ ఎలక్ట్రిక్ టూవీలర్‌లో ఎకో, రైడ్ B & రైడ్ A అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అయితే ప్రయాణంలో ఎకో నుంచి రైడ్ మోడ్‌కు మాత్రమే మారవచ్చు. రైడ్ A & రైడ్ B మధ్య మారాలంటే స్కూటర్‌ను పూర్తిగా ఆపాలి. ఈ విధానం కొంత అసౌకర్యంగా అనిపిస్తుంది.
రైడ్ Aలో రీజెనరేటివ్ బ్రేకింగ్ బలంగా ఉంటుంది. రైడ్ Bలో అది సున్నితంగా పనిచేస్తుంది. కీ లెస్ ఇగ్నిషన్, ముందు భాగంలో USB-A ఛార్జర్‌తో ఓపెన్ స్టోరేజ్ స్థలం కూడా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: ఫాసినో 125 కొనబోతున్నారా? రూ.78,000-రూ.99,000 రేంజ్‌లో మారే ఫీచర్లు ఏంటో తెలుసా?
అయితే, అండర్‌సీట్ స్టోరేజ్ విషయంలో e-యాక్సెస్ నిరాశపరుస్తుంది. ఇందులో కేవలం 17 లీటర్ల స్థలం మాత్రమే ఉంది. ప్రస్తుతం ఉన్న చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు 30 నుంచి 35 లీటర్ల వరకు స్టోరేజ్ ఇస్తున్నాయి. వాటితో పోలిస్తే ఈ 17 లీటర్ల స్థలం చాలా తక్కువ.
సుజుకి 600W ఛార్జర్‌ను అందిస్తోంది. పూర్తిగా ఖాళీ అయిన బ్యాటరీని 100 శాతం ఛార్జ్ చేయడానికి సుమారు 6 గంటలు పట్టింది. ఛార్జర్‌ను పెట్టుకునేందుకు ప్రత్యేక బ్యాగ్ కూడా ఇచ్చారు. అయితే ఛార్జర్ కేబుళ్లను సరిగ్గా మడవకపోతే సీట్ కింద ఉన్న స్టోరేజ్ క్లోజ్ కాదు.
సుజుకి e-యాక్సెస్‌లో 3.072kWh LFP బ్యాటరీ ప్యాక్ ఉంది. కంపెనీ వెల్లడించిన ప్రకారం IDC రేంజ్ 95km. ఆటో ఎక్స్‌పర్ట్‌ల పరీక్షలో రైడ్ A మోడ్‌లో ఫుల్ ఛార్జ్‌తో 88km కంటే కాస్త ఎక్కువ దూరం ప్రయాణించింది. ఈ ఫలితం అంత బ్యాడ్‌గా లేకపోయినప్పటికీ... ఇదే సామర్థ్యం ఉన్న కొన్ని ప్రత్యర్థి స్కూటర్లు 100kmకు పైగా రేంజ్ ఇస్తున్నాయి.
ఎకో మోడ్‌లో రేంజ్ మరింత పెరుగుతుంది. పెర్ఫార్మెన్స్ మాత్రం కొంత తగ్గుతుంది. నగర ట్రాఫిక్‌లో వేగంగా దూసుకెళ్లడానికి & ఫ్లైఓవర్లు ఎక్కడానికి ఇది సరిపోతుంది.
పనితీరు విషయంలో e-యాక్సెస్ అంతగా ఆకట్టుకోలేదు. 0-60kmph వేగాన్ని అందుకోవడానికి ఎక్స్‌పర్ట్‌ల పరీక్షలో దాదాపు 12 సెకన్లు పట్టింది. మార్కెట్‌లో ఉన్న ఇతర ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల కంటే నెమ్మదిగా ఉంది. అంతేకాదు, పెట్రోల్ యాక్సెస్ 125 కూడా ఇదే పరీక్షను 7.68 సెకన్లలో పూర్తి చేసింది. ఎలక్ట్రిక్ స్కూటర్ పవర్‌ట్రెయిన్ శబ్దం కూడా కొంత ఎక్కువగానే ఉంది.
ఇది కూడా చదవండి: చూపులకే పాతది.. నడిపితే కచ్చితంగా ఆశ్చర్యపోతారు! రేంజ్ రోవర్ స్పోర్ట్ EV ప్రత్యేకతలు ఇవే
రైడింగ్ కంఫర్ట్ మాత్రం బాగుంది. తక్కువ ఎత్తు ఉన్నవాళ్లకు ఈ స్కూటర్‌లోని 765mm సీట్ ఎత్తు సౌకర్యంగా ఉంటుంది. పొడవుగా ఉన్న రైడర్లకు మాత్రం ఇది కొంచెం తక్కువగా అనిపించవచ్చు. ఫ్లాట్ సీట్, విశాలమైన ఫ్లోర్‌బోర్డ్ & మంచి సస్పెన్షన్ కారణంగా రైడ్ సౌకర్యంగా ఉంటుంది.
122kg బరువుతో e-యాక్సెస్ తేలికగానే ఉంటుంది. ట్రాఫిక్‌లో సులభంగా దూసుకెళ్లవచ్చు. అయితే, మలుపుల్లో స్కూటర్ త్వరగా ఒకవైపు వాలే స్వభావం కనిపించింది. బ్యాటరీని సీట్ కింద నిలువుగా అమర్చడం వల్ల గురుత్వ కేంద్రం కొంత ఎత్తులో ఉండటమే దీనికి కారణం.
బ్రేకింగ్ పవర్ బాగున్నప్పటికీ బ్రేక్ బైట్ కొంత షార్ప్‌గా ఉంది. రూ.1.92 లక్షల ధర ఉన్న స్కూటర్‌లో ABS లేకపోవడం పెద్ద లోటుగా చెప్పాలి.
ఒక్కమాటలో చెప్పాలంటే... ధరే e-యాక్సెస్‌కు ప్రధాన సమస్య. మంచి నిర్మాణ నాణ్యత, సుజుకి బ్రాండ్‌పై నమ్మకం, మంచి కంఫర్ట్ వంటి అంశాలు ఉన్నప్పటికీ రూ.1.92 లక్షల ధరను సమర్థించడం కష్టం. ఇదే ప్రైస్ రేంజ్‌లో టీవీఎస్, బజాజ్, విడా & ఏథర్ వంటి కంపెనీలు మెరుగైన రేంజ్, ఎక్కువ స్టోరేజ్ & వేగవంతమైన ఛార్జింగ్‌తో స్కూటర్లను అందిస్తున్నాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
