Suzuki Access ABS Feature: భారత మార్కెట్లో అత్యంత నమ్మకమైన 125cc స్కూటర్లలో ఒకటిగా పేరున్న Suzuki Access ఇప్పుడు మరింత సేఫ్‌గా మారింది. రోజువారీ ప్రయాణాల్లో బ్రేకింగ్‌ భద్రతను పెంచే లక్ష్యంతో, సుజుకి మోటార్‌సైకిల్‌ ఇండియా, ఈ స్కూటర్‌కు "సింగిల్‌-చానల్‌ ABS" (యాంటీ-లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌)ను పరిచయం చేసింది. ఈ కొత్త అప్‌డేట్‌తో Suzuki Access ABS వేరియంట్‌ రూ. 92,328 ఎక్స్‌-షోరూమ్‌ ధర నుంచి అందుబాటులోకి వచ్చింది.

ABS‌ అప్‌డేట్‌ ఎందుకు కీలకం?

నగర రోడ్లు, అకస్మాత్తుగా బ్రేక్‌ వేయాల్సిన పరిస్థితులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ABS ఉండటం వల్ల చక్రాలు లాక్‌ కావు, స్కూటర్‌ కూడా రైడర్‌ నియంత్రణలోనే ఉంటుంది. దీని వల్ల, జారిపడే ప్రమాదం తగ్గుతుంది. ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సుజుకి Access‌కు ఈ సేఫ్టీ అప్‌డేట్‌ తీసుకొచ్చింది.

ఇంజిన్‌ విషయంలో మార్పులేవీ లేవు

ABS వచ్చినా, Access స్కూటర్‌లోని ప్రాథమిక అంశాలను సుజుకి అలాగే కొనసాగించింది. ఇందులో ఇప్పటికే కొనసాగుతున్న 124 సీసీ, సింగిల్‌-సిలిండర్‌, ఎయిర్‌-కూల్డ్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఈ ఇంజిన్‌ 6,500 rpm వద్ద 8.43 bhp (6.2 కిలోవాట్లు) శక్తి, 5,000 rpm వద్ద 10.2 Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజిన్‌కు CVT గేర్‌బాక్స్‌ జత చేశారు. స్మూత్‌ రైడింగ్‌, మంచి మైలేజ్‌, తక్కువ మెయింటెనెన్స్‌ కారణంగా ఇది పట్టణాలు, నగర వినియోగానికి సరైన ఎంపికగా నిలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ స్కూటర్‌కు విపరీతమైన గిరాకీ ఉంది.

ఫీచర్లు, కొలతలు ఎలా ఉన్నాయి?

Suzuki Access ABS స్కూటర్‌లో... 1,260 మిల్లీమీటర్ల వీల్‌బేస్‌, 160 మిల్లీమీటర్ల గ్రౌండ్‌ క్లియరెన్స్‌, వేరియంట్‌ను బట్టి 105 నుంచి 106 కిలోల కర్బ్‌ వెయిట్‌ ఉన్నాయి.

ఇందులో 5.3 లీటర్ల ఫ్యూయల్‌ ట్యాంక్‌ ఇచ్చారు. అలాయ్‌ లేదా కాస్ట్‌ వీల్స్‌ ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంటుంది. రోజువారీ ప్రయాణాలకు అవసరమైన ప్రాక్టికాలిటీని ఇది బాగా అందిస్తుంది.

TFT స్క్రీన్‌తో టాప్‌ వేరియంట్‌

ABS‌తో పాటు TFT స్క్రీన్‌ ఉన్న వేరియంట్‌ కూడా సుజుకి అందిస్తోంది. ఈ వేరియంట్‌ ధర రూ. 98,378 ఎక్స్‌-షోరూమ్‌. డిజిటల్‌ డిస్‌ప్లే ద్వారా స్పీడ్‌, ఫ్యూయల్‌, ఇతర సమాచారం స్పష్టంగా కనిపిస్తుంది.

కలర్‌ ఆప్షన్లు

TFT లేని వేరియంట్‌కు

మెటాలిక్‌ మ్యాట్‌ బ్లాక్‌ నం.2

మెటాలిక్‌ మ్యాట్‌ స్టెల్లర్‌ బ్లూ

పెర్ల్‌ గ్రేస్‌ వైట్‌

సాలిడ్‌ ఐస్‌ గ్రీన్‌

పెర్ల్‌ షైనీ బీజ్‌

TFT ఉన్న వేరియంట్‌కు

మ్యాట్‌ స్టెల్లర్‌ బ్లూ

పెర్ల్‌ గ్రేస్‌ వైట్‌

సాలిడ్‌ ఐస్‌ గ్రీన్‌

పెర్ల్‌ మ్యాట్‌ ఆక్వా సిల్వర్‌

వంటి కలర్‌ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

ఫైనాన్స్‌ ఆఫర్లు కూడా ఆకర్షణీయం

యాజమాన్య అనుభవాన్ని మెరుగుపరిచేలా సుజుకి ఫైనాన్స్‌ స్కీమ్స్‌ను కూడా ప్రకటించింది. 6.99 శాతం నుంచి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్‌ ఫీజు లేకుండా లోన్లు అందిస్తున్నారు. అదనంగా ప్రతి రాష్ట్రం నుంచి 10 మందికి రూ. 5,000 విలువైన ఓచర్లు గెలుచుకునే అవకాశం కూడా కల్పించారు.

మొత్తంగా చూస్తే, ABS‌తో Suzuki Access ఇప్పుడు భద్రతను ప్రాధాన్యం ఇచ్చే 125 సీసీ స్కూటర్‌ కొనాలనుకునే వారికి మరింత ఆకర్షణీయమైన ఎంపికగా మారింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.