Normal Petrol vs Speed Petrol: మనలో చాలా మందికి పెట్రోల్‌ బంక్‌ వద్ద స్పీడ్‌ పెట్రోల్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. కానీ దాని ధర కొంచం ఎక్కువ, కాబట్టి చాలా మంది స్పీడ్‌ పెట్రోల్‌ వైపు వెళ్లరు. అసలు.. సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే స్పీడ్‌ పెట్రోల్‌ గొప్పేంటి, ఏం అదనంగా ఇస్తుంది, దీనివల్ల వాహనానికి నిజంగానే ప్రయోజనమా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు తెలుసుకుందాం. దీనికంటే ముందుగా, స్పీడ్‌ పెట్రోల్‌ అంటే ఏమిటో అర్ధం చేసుకుందాం.

Continues below advertisement

స్పీడ్‌ పెట్రోల్‌ అంటే ఏమిటి?స్పీడ్‌ పెట్రోల్‌ను కొన్ని కంపెనీలు ప్రీమియం పెట్రోల్‌గా మార్కెట్‌ చేస్తున్నాయి. ఇందులో ప్రత్యేకమైన ఫ్యూయల్‌ యాడిటివ్స్‌ & డిటర్జెంట్లు ఉంటాయి. ఇవి ఇంజిన్‌లో ఏర్పడే కార్బన్‌ డిపాజిట్లను తగ్గించి, ఇంజిన్‌ క్లీన్‌గా ఉండేలా సహాయపడతాయి. అంటే, వాహన ఇంజిన్‌ లోపల జరిగే దహన ప్రక్రియ మరింత శుభ్రంగా, సవ్యంగా కొనసాగేందుకు స్పీడ్‌ పెట్రోల్‌ ఉపయోగపడుతుంది.

సాధారణ పెట్రోల్‌ vs స్పీడ్‌ పెట్రోల్‌ - ప్రధాన తేడాలుసాధారణ పెట్రోల్‌ అంటే మనం ప్రతిరోజూ వాడే రెగ్యులర్‌ పెట్రోల్‌. ఇందులో యాడిటివ్స్‌ చాలా తక్కువగా ఉంటాయి. స్పీడ్‌ పెట్రోల్‌లో మాత్రం అదనపు క్లీనింగ్‌ యాడిటివ్స్‌, ఆక్టేన్‌ స్థాయి కొంత ఎక్కువగా ఉండవచ్చు. దీని వల్ల దహన సామర్థ్యం కొంచెం మెరుగుపడుతుంది. సాధారణ పెట్రోల్‌ పనితీరు రోజువారీ వాహన వినియోగానికి పూర్తిగా సరిపోతుంది. అయితే, స్పీడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను శుభ్రం చేయడంలో, స్మూత్‌గా నడపడంలో కొంత పైచేయి కలిగి ఉంటుంది.

Continues below advertisement

స్పీడ్‌ పెట్రోల్‌ వల్ల వాహనానికి ఉపయోగమేమిటి?

ఇంజిన్‌ క్లీన్‌గా ఉండటం: ఇందులో ఉన్న యాడిటివ్స్‌ కారణంగా ఇంజిన్‌ లోపలి భాగాల్లో కార్బన్‌ పేరుకుపోవడం తగ్గుతుంది. దీని వల్ల ఇంజిన్‌ శబ్దం తగ్గి స్మూత్‌గా నడుస్తుంది.

ఆక్సిలరేషన్‌ మెరుగుపడే అవకాశం: ఇంజిన్‌ శుభ్రంగా ఉన్నప్పుడు ఆక్సిలరేషన్‌ కొంచెం మెరుగుపడుతుంది. ప్రత్యేకంగా ఎక్కువగా సిటీ రైడింగ్‌ చేసే వారికి ఇది ఉపయోగకరం.

ఫ్యూయల్‌ ఎకానమీ కొంతవరకు మెరుగుపడవచ్చు: స్పీడ్‌ పెట్రోల్‌ వాడడం వల్ల ఇంజిన్‌ లోపలి రాపిడి కొంచెం తగ్గి మైలేజ్‌ కొంచం మెరుగుపడే అవకాశం ఉంటుంది. అయితే ఇది వాహనం, రైడింగ్‌ స్టైల్‌, రోడ్డు పరిస్థితులు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

ఇంజిన్‌ నెమ్మదిగా డిప్రిసియేట్‌ అవ్వడం: ఇంజిన్‌ శుభ్రంగా ఉన్నప్పుడు దాని జీవితకాలం కొంత పెరగవచ్చు. దీర్ఘకాలం ఒకే వాహనం వాడే వాళ్లకు ఈ ఫ్యూయల్‌ మంచి ఆప్షన్‌.

స్పీడ్‌ పెట్రోల్‌ అందరికీ అవసరమా?అందరూ తప్పనిసరిగా స్పీడ్‌ పెట్రోల్‌ వాడాలా? అంటే, అవసరం లేదు. మీ వాహనం పూర్తిగా కండిషన్‌లో ఉండి, రెగ్యులర్‌గా సర్వీస్‌ చేయిస్తే సాధారణ పెట్రోల్‌ సరిపోతుంది. కానీ, మీ ఇంజిన్‌ పనితీరు కొంచెం మెరుగుపడాలని అనుకుంటే లేదా మీ వాహనం పాతది అయితే స్పీడ్‌ పెట్రోల్‌ను అప్పుడప్పుడు వాడటం మంచిదే.

స్పీడ్‌ పెట్రోల్‌ వాడితే ఇంజిన్‌ శుభ్రంగా, స్మూత్‌గా పని చేసే అవకాశాలు ఎక్కువ. అయితే ఇది వాహనాన్ని మంత్రం వేసినట్లు మార్చేయదు. సాధారణ పెట్రోల్‌ కూడా చాలా బండ్లకు సరిపోతుంది. అయితే, ప్రీమియం ఫీలింగ్‌ కోసం లేదా ఇంజిన్‌ ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి కొన్నిసార్లు స్పీడ్‌ పెట్రోల్‌ వాడడం ప్రయోజనకరం.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.