Skoda Octavia RS India Booking Open: స్కోడా లవర్స్‌కు సంతోషకరమైన వార్త. ఐదేళ్లకు పైగా విరామం తర్వాత స్కోడా ఓక్టేవియా RS భారతీయ మార్కెట్‌లోకి మళ్లీ అడుగు పెడుతోంది. ఈ హై-పర్ఫార్మెన్స్ సెడాన్ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మీకు ఈ ప్రీమియం కారు కావాలంటే, స్కోడా ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ₹2.50 లక్షల టోకెన్ అమౌంట్‌తో బుక్ చేసుకోవచ్చు. అయితే, ఈసారి పూర్తిగా తయారైన కారును (CBU) దిగుమతి చేసుకుని మీకు అందిస్తారు. అందుకే, మన దేశానికి కేవలం 100 యూనిట్లను మాత్రమే కేటాయించారు.
ఇంజిన్ & పనితీరుకొత్త స్కోడా ఓక్టేవియా RSలో ఉన్న 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 265 hp పవర్, 370 Nm టార్క్ అందిస్తుంది. ఇది ఇప్పటి వరకు వచ్చిన అన్ని RS మోడళ్లలో అత్యంత శక్తిమంతమైన వెర్షన్ ఇది. ఈ ఇంజిన్ స్కోడా కొడియాక్ RS & వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ GTIల్లో వాడే తరహా TSI యూనిట్. ట్రాన్స్‌మిషన్ కోసం స్కోడా 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇచ్చింది. ఇది ముందరి చక్రాలకు శక్తిని పంపుతుంది, అంటే ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ (FWD) సెడాన్.
2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇచ్చే పవర్‌తో స్కోడా ఓక్టేవియా RS కారు 0 నుంచి 100 km/h వేగాన్ని కేవలం 6.4 సెకన్లలో అందుకుంటుంది. టాప్ స్పీడ్‌ను ఎలక్ట్రానిక్‌గా 250 km/h వరకు పరిమితం చేశారు. స్పోర్టీ సౌండ్ కోసం ప్రత్యేక స్పోర్ట్ ఎగ్జాస్ట్ సిస్టమ్ కూడా ఉంది.
లుక్స్ & ఫీచర్లుకొత్త ఓక్టేవియా RS, యూరప్ వెర్షన్‌లో లభించే అగ్రెసివ్ లుక్‌తో వస్తోంది. ఐదు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్స్ - మాంబా గ్రీన్, రేస్ బ్లూ, కాండీ వైట్, మ్యాజిక్ బ్లాక్, వెల్వెట్ రెడ్ - ఉన్నాయి. 19-అంగుళాల స్పోర్ట్ అలాయ్ వీల్స్ దీని ప్రెజెన్స్‌ను మరింత స్టైలిష్‌గా మార్చేస్తాయి.
ఇంటీరియర్ విషయానికి వస్తే, ఆల్-బ్లాక్ థీమ్‌లో స్పోర్ట్ సీట్స్, సువేడ్ & లెదరెట్ ఫినిష్‌తో అద్భుతమైన కంఫర్ట్ ఇస్తుంది. 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 12.9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 11-స్పీకర్ కాంటన్ సౌండ్ సిస్టమ్, హెడ్-అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ చార్జర్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటో, 360 డిగ్రీల కెమెరా, 3-జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ & హీటెడ్ ఫ్రంట్ సీట్స్ విత్ మసాజ్ ఫంక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
అడ్వాన్స్‌డ్ ఫీచర్లలోనే కాదు సేఫ్టీలో కూడా రాజీ పడలేదు - 10 ఎయిర్‌బ్యాగ్స్, ADAS సిస్టమ్, ESP, & డ్రైవింగ్ అసిస్టెంట్ టెక్నాలజీలు కొత్త ఓక్టేవియా RS లో భాగమయ్యాయి.
ధర & లభ్యతస్కోడా ఓక్టేవియా RS ధరను అధికారికంగా మరికొన్ని రోజుల్లోనే, అక్టోబర్ 17న ప్రకటించబోతున్నారు. మార్కెట్ అంచనాల ప్రకారం, దీని ఎక్స్-షోరూమ్ ధర ₹50 లక్షల నుంచి ₹55 లక్షల మధ్యలో ఉండొచ్చు. డెలివరీలు నవంబర్ 2025 నుంచి ప్రారంభం కానున్నాయి.
భారత మార్కెట్‌లో స్కోడా ఓక్టేవియా RS కు ప్రత్యక్ష పోటీదారు లేదు. ఈ సెగ్మెంట్‌లో ప్రీమియం పనితీరు కోరుకునే యువ కస్టమర్లకు ఓక్టేవియా RS ఒక అద్భుతమైన ఆప్షన్. పవర్, స్టైల్, & లగ్జరీ మూడు మిళితమై ఉన్న స్కోడా ఓక్టేవియా RS కోసం బుకింగ్స్ వేగంగా ఫిల్ అవుతున్నాయి. కేవలం 100 యూనిట్లు మాత్రమే ఉన్నందున, ఆలస్యం చేస్తే అవకాశం చేజారిపోవచ్చు!.