Skoda Kylaq Launched: ప్రముఖ కార్ల బ్రాండ్ స్కోడా మనదేశంలో తన కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. అదే స్కోడా కైలాక్. ఈ కారు ధర రూ.7.89 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఇది ఎక్స్ షోరూం ధర. 2024 డిసెంబర్ 2వ తేదీ నుంచి దీనికి సంబంధించిన బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ సబ్ 4 మీటర్ ఎస్‌యూవీకి చెందిన డెలివరీ మాత్రం 2025 జనవరి 27వ తేదీ నుంచి మొదలవునుంది. దీనికి ముందు 2025 జనవరి 17వ తేదీన ఈ కారును భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో డిస్‌ప్లే చేయనున్నారు.
అదరగొట్టిన ఎక్స్‌టీరియర్...
ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కంపెనీ కొత్త డిజైన్ లాంగ్వేజ్‌ని అందించింది. ఈ ఎస్‌యూవీ బాడీ మీద క్లీన్ లైన్స్‌ను చూడవచ్చు. దీంతోపాటు ఈ ఎస్‌యూవీ ఫేస్ కూడా చాలా కొత్తగా ఉంది. ఇప్పటికే మనదేశంలో అందుబాటులో ఉన్న కుషాక్ తరహాలో దీని డిజైన్ ఉంది. స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌తో దీన్ని చూడవచ్చు. స్కోడా కుషాక్ మీదున్న గ్రిల్ కంటే స్కోడా కైలాక్ మీద ఉన్న గ్రిల్ కాస్త సన్నగా ఉంటుంది. ఇది కారుకు మరింత మంచి లుక్‌ను ఇస్తుంది. టూ టోన్ బంపర్లతో పాటు అల్యూమినియం స్పాయిలర్ కూడా ఈ కారులో చూడవచ్చు.
స్కోడా కైలాక్ పొడవు 3995 మిల్లీమీటర్లు కాగా, వీల్ బేస్ 2566 మిల్లీమీటర్లుగా ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 189 మిల్లీమీటర్లుగా ఉంది. స్కోడా కైలాక్ బూట్ స్పేస్ 446 లీటర్లు కావడం విశేషం. సీట్ డౌన్ చేస్తే ఇది 1265 లీటర్లకు పెరగనుంది. 17 అంగుళాల వీల్స్‌తో ఈ ఎస్‌యూవీ మార్కెట్లోకి వచ్చింది.
Also Read: ఆకాశాన్నంటే ధర - అయినా అవుట్ ఆఫ్ స్టాక్ - మార్కెట్లో ఈ కియా కారుకు సూపర్ డిమాండ్!
స్కోడా కైలాక్ ఇంటీరియర్ ఇలా...
ఇక కారు లోపల చూసుకుంటే కుషాక్ ఇంటీరియర్ తరహాలోనే ఉంది. సైడ్ వెంట్లు, క్లైమెట్ కంట్రోల్ ప్యానెల్, టూ స్పోక్ స్టీరింగ్ వీల్, 8 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఇందులో అందించారు. దీంతోపాటు 10.9 అంగుళాల టచ్ స్క్రీన్ సిస్టమ్‌ను కూడా చూడవచ్చు. కీలెస్ ఎంట్రీ, సింగిల్ పేన్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, కార్ ప్లే సౌకర్యాలు అందించారు. ఇక సేఫ్టీ విషయానికి వస్తే... ఏబీఎస్ విత్ ఈబీడీ, ఆరు ఎయిర్ బ్యాగ్స్, ట్రాక్షన్ కంట్రోల్, త్రీ పాయింట్ సీట్‌బెల్ట్స్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
స్కోడా కైలాక్ ఇంజిన్ ఎలా ఉంది?
స్కోడా కైలాక్‌లో 1.0 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ అందించారు. ఇది కారుకు 114 బీహెచ్‌పీ పవర్, 178 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుంది. ఈ యూనిట్ 6 స్పీడ్ ఎంటీ, 6 స్పీడ్ ఏటీ వేరియంట్లలో మార్కెట్లోకి వచ్చింది. హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో, కియా సోనెట్, మారుతి సుజుకి బ్రెజా వంటి కార్లతో స్కోడా కైలాక్ పోటీ పడనుంది.
Also Read: వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉన్న బెస్ట్ కార్లు - అసలు లేకపోయినా ఆశ్చర్యం అక్కర్లేదు!