Simple One Gen 2 Review: భారత ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మార్కెట్‌లో పోటీని పెంచుతూ Simple Energy తాజాగా తీసుకొచ్చిన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ - Simple One Gen 2. పేపర్‌పై దీని స్పెసిఫికేషన్లను చూసినప్పుడు, ఈ బండి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పెద్ద బ్యాటరీ, లాంగ్‌ రేంజ్‌ క్లెయిమ్స్‌, అధిక టెక్‌ ఫీచర్లు... ఇవన్నీ చదివాక ఈ స్కూటర్‌ ఒక గేమ్‌ చేంజర్‌ అవుతుంది అనిపిస్తుంది. అయితే, ఇది నిజంగానే గేమ్‌ చేంజరా? లేక ఈ లక్షణాలన్నీ పేపర్‌కే పరిమితమా అనే ప్రశ్నకు సమాధానంగా... ఆటో ఎక్స్‌పర్ట్‌లు దీనిని రియల్‌ వరల్డ్‌లో రోడ్డుపై నడిపి టెస్ట్‌ చేశారు.

Continues below advertisement

డిజైన్‌: తెలిసిన లుక్‌, కానీ మరింత షార్ప్‌గా

Simple One Gen 2 బయటి లుక్‌ ఫస్ట్‌ జెన్‌ మోడల్‌ను గుర్తు చేస్తుంది. సిల్యుయెట్‌, స్పోర్టీ బాడీ లైన్స్‌ పెద్దగా మారలేదు. కానీ చిన్నపాటి మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా, ముందు భాగంలో ఇచ్చిన కొత్త వెంట్స్‌ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇవి లుక్‌ కోసం మాత్రమే కాకుండా, 7 ఇంచుల TFT స్క్రీన్‌ వేడెక్కకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి. ఇది ప్రాక్టికల్‌ డిజైన్‌ నిర్ణయమే.

Continues below advertisement

బిల్డ్‌ క్వాలిటీ మొత్తం మీద మెరుగ్గా అనిపించింది. అయితే ఎడమ వైపు స్విచ్‌గియర్‌, ముఖ్యంగా ఇండికేటర్‌ స్విచ్‌ ఇంకా కొంచెం లూజ్‌గా అనిపిస్తుంది. కుడి వైపు మాత్రం రైడింగ్‌ మోడ్స్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌, రివర్స్‌ అసిస్ట్‌ బటన్‌లు బాగా ఫినిష్‌ అయ్యాయి. 20 నుంచి 80 కి.మీ. వేగాల మధ్య పని చేసే క్రూయిజ్‌ కంట్రోల్‌... లాంగ్‌ రైడ్స్‌లో చేతికి ఉపశమనం ఇస్తుంది.

కంఫర్ట్‌, ఎర్గోనామిక్స్‌: స్పష్టమైన మెరుగుదల

ఫస్ట్ జెన్‌ Simple Oneపై వచ్చిన ప్రధాన విమర్శ సీట్‌ కంఫర్ట్‌. Gen 2లో ఈ అంశంపై కంపెనీ స్పష్టంగా పని చేసింది. కొత్త కాంటూర్డ్‌ సీట్‌, బ్రేకింగ్‌ సమయంలో రైడర్‌ జారిపోకుండా పట్టి ఉంచుతుంది. ఫోమ్‌ కొంచెం గట్టిగా ఉన్నా, దీర్ఘ రైడ్‌లో సపోర్ట్‌ బాగానే ఇచ్చింది.

సీట్‌ హైట్‌ను 780 mmకి తగ్గించారు. దీంతో తక్కువ ఎత్తు ఉన్న రైడర్లకు కూడా ఇది సులభంగా మారింది. న్యూట్రల్‌ రైడింగ్‌ పొజిషన్‌, విశాలమైన ఫ్లోర్‌బోర్డ్‌తో నగర ట్రాఫిక్‌లో నడిపేటప్పుడు ఎర్గోనామిక్స్‌ బాగా సెట్‌ అయ్యాయనిపిస్తుంది.

రైడ్‌, హ్యాండ్లింగ్‌: మిశ్రమ అనుభవం

కొత్త సింగిల్‌ పీస్‌ బ్యాటరీ ప్యాక్‌ లేఅవుట్‌ వల్ల చాసిస్‌ వెయిట్‌ డిస్ట్రిబ్యూషన్‌ మెరుగైంది. సెంటర్‌ ఆఫ్‌ గ్రావిటీ తగ్గడంతో స్కూటర్‌ మలుపుల్లో చురుకుగా తిరుగుతుంది. ట్రాఫిక్‌లో హ్యాండ్లింగ్‌ షార్ప్‌గా అనిపిస్తుంది.

కానీ రైడ్‌ క్వాలిటీలో మాత్రం మిశ్రమ అనుభవం ఉంది. వెనుక సస్పెన్షన్‌ సాఫ్ట్‌గా ఉండి నగర గుంతలను బాగా తట్టుకుంటుంది. ముందు ఫోర్క్‌ మాత్రం కొంచెం గట్టిగా ఉండటంతో బ్యాడ్‌ రోడ్లపై హ్యాండిల్‌కు జెర్క్‌లు తెలుస్తాయి. దీర్ఘ ప్రయాణాల్లో ఇది కొంచెం అలసట కలిగించవచ్చు.

బ్యాటరీ, పెర్ఫార్మెన్స్‌

Gen 2లో ప్రధాన ఆకర్షణ 5 kWh బ్యాటరీ. ఇది ఫ్లోర్‌బోర్డ్‌లో అమర్చారు. గతంతో పోలిస్తే దాదాపు 8 కిలోలు తక్కువ బరువుతో వస్తుంది. కంపెనీ 265 కి.మీ. రేంజ్‌ను క్లెయిమ్‌ చేస్తోంది. 4.5 kWh, 3.7 kWh వేరియంట్లు కూడా ఉన్నాయి. కానీ పెర్ఫార్మెన్స్‌, రేంజ్‌ పరంగా 5 kWh వేరియంట్‌ బెస్ట్‌గా అనిపిస్తుంది.

Eco, Air, Sonic, Sonic X అనే నాలుగు రైడింగ్‌ మోడ్స్‌ ఉన్నాయి. Sonic Xలో థ్రాటిల్‌ రెస్పాన్స్‌ వేగంగా ఉంటుంది. 30-40 కి.మీ. వేగంతో రోలింగ్‌లో ఉన్నప్పుడు ఈ మోడ్‌ బాగా ఎంజాయ్‌ చేయవచ్చు. అయితే హై రీజనరేషన్‌ లెవెల్స్‌లో స్కూటర్‌ కొంచెం అతిగా బ్రేక్‌ అవుతున్న ఫీలింగ్‌ ఇస్తుంది. దీనికి ఇంకా ఫైన్‌ ట్యూనింగ్‌ అవసరం.

బ్రేకింగ్‌, ఫీచర్లు

ముందు, వెనుక డిస్క్‌ బ్రేకులు ఉన్నాయి. వెనుక బ్రేక్‌ బైట్‌ బలంగా ఉంటుంది. ముందు బ్రేక్‌ ప్రోగ్రెసివ్‌గా ఉన్నా, ప్రారంభంలో కొంచెం సాఫ్ట్‌గా అనిపిస్తుంది. అత్యవసర బ్రేకింగ్‌లో స్కూటర్‌ స్టేబుల్‌గా ఉంటుంది.

7 ఇంచుల TFT టచ్‌స్క్రీన్‌ ద్వారా నావిగేషన్‌, ట్రాక్షన్‌ కంట్రోల్‌, కనెక్టెడ్‌ ఫీచర్లు లభిస్తాయి. జియోఫెన్సింగ్‌, థెఫ్ట్‌ అలెర్ట్స్‌, OTA అప్‌డేట్స్‌ కూడా ఉన్నాయి. బేస్‌ వేరియంట్‌లో మాత్రం ఈ స్క్రీన్‌ ఉండదు.

తుది మాట

రూ. 1.40 లక్షలు నుంచి రూ. 1.78 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌) మధ్య ధరలో వచ్చే Simple One Gen 2, గతంతో పోలిస్తే చాలా మెచ్యూర్‌ ప్రొడక్ట్‌లా అనిపిస్తుంది. పెర్ఫార్మెన్స్‌, ఎర్గోనామిక్స్‌, బ్యాటరీ ప్లేస్‌మెంట్‌ వంటివి సిటీ రైడర్లకు ప్లస్‌ పాయింట్లు. షోరూమ్‌, సర్వీస్‌ నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఉన్నవారికి ఇది నిజంగా మంచి విలువ ఇస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.