Tata Nexon Self Driving Technology Test: సెల్ఫ్‌-డ్రైవ్‌ కార్‌ల టెస్టింగ్‌ ఇండియాలోనూ ప్రారంభమైంది. విమానాల్లో ఆటో-పైలెట్‌ తరహాలో కార్‌లో సెల్ఫ్‌-డ్రైవ్‌ టెక్నాలజీ పని చేస్తుంది. అంటే.. కార్‌ డ్రైవర్‌తో సంబంధం లేకుండా కార్‌ తనంతట తానే ముందుకు కదులుతుంది, మలుపులు తిరుగుతుంది, ఎవరైనా అడ్డు వచ్చినప్పుడు వేగం తగ్గించుకోవడం, బ్రేక్‌లు వేయడం చేస్తుంది. ఏ దశలోనూ కార్‌ డ్రైవర్‌తో పని ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే విఠలాచార్య సినిమాల్లోని మాయాజాలం మన కళ్లముందు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ 'మైనస్ జీరో' (Minus Zero), తాను అభివృద్ధి చేసిన సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్‌ను బిజీ రోడ్లపై పరీక్షించింది. ఇటీవలే జరిగిన ఈ టెస్టింగ్‌ కోసం టాటా నెక్సాన్‌ను ఈ కంపెనీ ఎంచుకుంది. టాటా నెక్సాన్‌లో సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్‌ ఏర్పాటు చేసి, ఆ కార్‌ను రోడ్డుపై నడిపింది, ఆ వీడియోను విడుదల చేసింది. ఒక అటానమస్‌ కార్‌, భారతీయ రోడ్ల మీద సంక్లిష్ట పరిస్థితులకు అనుగుణంగా ఎలా నడిచిందో ఆ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. 

'మైనస్ జీరో' సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ మైనస్ జీరో అనేది కృత్రిమ మేధస్సు & స్వయంప్రతిపత్త వాహన సాంకేతికతపై పని చేస్తున్న ఒక భారతీయ స్టార్టప్. ఈ కంపెనీ, ఇటీవల, టాటా నెక్సాన్ సబ్-కాంపాక్ట్ SUVలో సిటీ ఆటోపైలట్ సిస్టమ్‌ అమర్చి రోడ్డుపై పరీక్షించింది. సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్‌లో భాగంగా.. కార్‌ ముందు భాగంలో కొన్ని సెన్సార్లు & పైకప్పుపై ప్రత్యేక రిగ్ లాంటి క్యారియర్‌ ఏర్పాటు చేశారు. ఒక భవనం వెలుపల నిలిపిన నెక్సాన్ SUVతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. బెంగళూరులోని రద్దీగా ఉండే రోడ్డుపై కారు కదలడం ప్రారంభించింది. డ్రైవర్ సీట్‌లో ఓ వ్యక్తి కూర్చున్నప్పటికీ అతను స్టీరింగ్‌ పట్టుకోలేదు, అసలు ఏం చేయలేదు. జరిగేది చూస్తూ ఊరికే కూర్చున్నాడు. స్టీరింగ్‌పై మాన్యువల్‌ కంట్రోల్‌ లేనప్పటికీ, ఆటోమేటిక్‌ సిస్టమ్‌తో కారు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లింది.

సెల్ఫ్‌-డ్రైవ్‌ సిస్టమ్‌ ఎలా పని చేస్తుంది?ఆటోపైలట్ వ్యవస్థ, కార్‌ చుట్టూ ఉన్న వాతావరణాన్ని క్షణక్షణం స్కాన్ చేస్తుంది. రోడ్డుపై ట్రాఫిక్‌, సిగ్నల్స్‌ లేని రహదారి, పార్క్ చేసిన వాహనాలు, ఫుట్‌పాత్‌, రోడ్డుపై గుంతలు, స్పీడ్‌ బ్రేకర్లు, అడ్డుగా వచ్చే వాహనాలు, మనుషులను గమనిస్తూ తదనుగుణంగా డ్రైవింగ్‌ స్పీడ్‌లో ఆటోమేటిక్‌గా మార్పులు చేసుకుంటుంది. హఠాత్తుగా కార్‌ ముందుకు వచ్చి షార్ప్‌ టర్న్‌లు తీసుకున్న కొన్ని బైక్‌లు కూడా ఈ వీడియోలో మనకు కనిపిస్తాయి. సెల్ఫ్‌-డ్రైవ్‌ సిస్టమ్ ప్రతి పరిస్థితిని విశ్లేషించి నిజ సమయంలో నిర్ణయాలు తీసుకుంది. ఒకచోట, ఒక ఆవు అకస్మాత్తుగా ఎదురుగా వచ్చినప్పుడు, కారు వేగాన్ని క్రమంగా తగ్గించి, దానిని ఢీకొట్టకుండా ఆగిపోయింది. మన దేశంలో ట్రాఫిక్‌ ఉల్లంఘనలు, హఠాత్తుగా అడ్డరావడం వంటికి సర్వసాధారణంగా కనిపిస్తుంటాయి. మైనస్ జీరో కంపెనీ, భారతదేశంలోని అనూహ్యమైన రహదారి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ టెక్నాలజీని రూపొందించింది.

భారతదేశంలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల భవిష్యత్తుభారతదేశంలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు ఇంకా పరీక్ష & అభివృద్ధి దశలోనే ఉన్నప్పటికీ, ఇలాంటి సాంకేతికతలకు ఉజ్వల భవిష్యత్తు ఉండవచ్చు. మైనస్ జీరో అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీని ఆటో ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చు, గేమ్‌ ఛేంజర్‌ కావచ్చు. ఈ టెక్నాలజీని టెక్‌ ఇండస్ట్రీకి కూడా ఒక శుభవార్తగా చూడాలి.