RE Guerrilla 450 vs Triumph Tracker 400 Performance: ప్రీమియం బైక్ కొనాలనుకునేవారికి రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450, ట్రయంఫ్ ట్రాకర్ 400 రెండూ ఆసక్తికరమైన ఎంపికలు. ఈ రెండు బైక్లలోనూ సుమారు 40 హెచ్పీ శక్తి ఉంది. బరువులు కూడా దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి. ధరల మధ్య వ్యత్యాసం సుమారు రూ.10,000 మాత్రమే. అయితే రోడ్డుపై వీటి పనితీరులో మాత్రం స్పష్టమైన తేడాలు కనిపించాయి. వేగం అందుకోవడం, నడుస్తున్నప్పుడు పికప్, బ్రేకింగ్ వంటి అంశాల్లో నిర్వహించిన పరీక్షల్లో గెరిల్లా 450 ముందంజలో నిలిచింది. ఈ రెండు బైక్ల పనితీరును వివరంగా తెలుసుకుందాం.
వేగం అందుకోవడంలో గెరిల్లా 450దే పైచేయి
గెరిల్లా 450 బరువు 185 కిలోలు. ట్రయంఫ్ ట్రాకర్ 400 బరువు 181 కిలోలు. అంటే గెరిల్లా 450 నాలుగు కిలోలు ఎక్కువ బరువు ఉంటుంది. అయినప్పటికీ వేగం అందుకోవడంలో మెరుగ్గా దూసుకెళ్లింది.
గంటకు 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి గెరిల్లా 450కు 2.85 సెకన్లు పట్టింది. ట్రాకర్ 400కు 3.05 సెకన్లు అవసరమయ్యాయి. గంటకు 80 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడంలో గెరిల్లా 450కు 4.36 సెకన్లు పట్టగా, ట్రాకర్ 400కు 4.86 సెకన్లు పట్టింది.
ఇక గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడంలో ఈ రెండు బైక్ల మధ్య వ్యత్యాసం మరింత పెరిగింది. గెరిల్లా 450 కేవలం 6.24 సెకన్లలోనే ఈ వేగాన్ని చేరుకుంది. ట్రాకర్ 400కు 7.55 సెకన్లు పట్టాయి. అంటే ఈ పరీక్షలో గెరిల్లా 450 ఏకంగా 1.31 సెకన్లు ముందుంది.
దీనికి ప్రధాన కారణం ఇంజిన్ సామర్థ్యం, టార్క్ అందించే విధానం. గెరిల్లాలో ఎక్కువ సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉండటంతో పాటు తక్కువ, మధ్యస్థ ఇంజిన్ వేగాల్లోనూ మెరుగైన పవర్ లభిస్తుంది. ట్రాకర్ 400లోని 349 సీసీ ఇంజిన్ మాత్రం 6,000 ఆర్పీఎం దాటిన తర్వాత మరింత చురుగ్గా స్పందిస్తుంది.
ఇది కూడా చదవండి: రూ.23 వేలు డౌన్ పేమెంట్ కడితే VLF Strada ఎలక్ట్రిక్ స్కూటర్ నెలవారీ EMI ఎంత
ఓవర్టేకింగ్లోనూ గెరిల్లా దూకుడు
బైక్ పనితీరును అంచనా వేయడానికి.. ఆగి ఉన్న స్థితి నుంచి వేగం అందుకోవడమే కాకుండా, ఇప్పటికే ప్రయాణిస్తున్నప్పుడు వేగాన్ని పెంచుకునే సామర్థ్యాన్ని కూడా పరిశీలించాలి. దీనినే రోల్ ఆన్ యాక్సిలరేషన్ అంటారు. రోడ్డుపై మరో వాహనాన్ని అధిగమించేటప్పుడు ఈ సామర్థ్యం ఉపయోగపడుతుంది.
రెండో గేర్లో గంటకు 20 నుంచి 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి గెరిల్లా 450కు 1.98 సెకన్లు పట్టాయి. ట్రాకర్ 400కు 2.44 సెకన్లు అవసరమయ్యాయి.
మూడో గేర్లో గంటకు 30 నుంచి 70 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి గెరిల్లా 450కు 2.78 సెకన్లు పట్టగా, ట్రాకర్ 400కు 4.15 సెకన్లు పట్టాయి. నాలుగో గేర్లో గంటకు 50 నుంచి 80 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడంలోనూ గెరిల్లా 450 ముందుంది. దీనికి 3.38 సెకన్లు పట్టగా, ట్రాకర్ 400కు 4.32 సెకన్లు పట్టాయి.
గెరిల్లా 450లో 40 ఎన్ఎం టార్క్ ఉండగా, ట్రాకర్ 400లో 32 ఎన్ఎం టార్క్ ఉంది. తక్కువ వేగాల వద్దే ఎక్కువ టార్క్ అందుబాటులో ఉండటం గెరిల్లాకు ప్రయోజనంగా మారింది.
ఇది కూడా చదవండి: పెద్ద చక్రాలు, కొత్త ఇంజిన్.. Aprilia SXR GT 125లో ఇంకా ఏం ఉన్నాయో కొనే ముందే తెలుసుకోండి
బ్రేకింగ్లోనూ గెరిల్లా 450దే విజయం
వేగం ఎంత ముఖ్యమో, అవసరమైనప్పుడు బైక్ను సురక్షితంగా ఆపగలగడం కూడా అంతే ముఖ్యం. గంటకు 60 కిలోమీటర్ల వేగం నుంచి పూర్తిగా ఆగే వరకు తీసుకున్న దూరాన్ని పరిశీలించిన పరీక్షలో గెరిల్లా 450 మెరుగైన ఫలితాన్ని నమోదు చేసింది.
గెరిల్లా 450, గంటకు 60 కిలోమీటర్ల వేగం నుంచి పూర్తిగా ఆగడానికి 15.73 మీటర్ల దూరం తీసుకుంది. ట్రాకర్ 400కు 16.75 మీటర్లు అవసరమయ్యాయి. అంటే గెరిల్లా 450 సుమారు 1.02 మీటర్ల తక్కువ దూరంలోనే ఆగిపోయింది.
గెరిల్లాలో 310 మి.మీ. ముందు బ్రేక్ డిస్క్ ఉండగా, ట్రాకర్ 400లో 300 మి.మీ. డిస్క్ ఉంది. గెరిల్లాలో రహదారి వినియోగానికి అనుకూలమైన టైర్లు ఉండటం కూడా ఈ ఫలితానికి తోడ్పడింది. అయితే ట్రాకర్ 400లోని నాలుగు పిస్టన్ల బ్రేక్ కాలిపర్ బ్రేకింగ్ సమయంలో మెరుగైన స్పందనను అందించినట్లు పరీక్షలో గుర్తించారు.
మొత్తంగా ఏది మెరుగైన బైక్?
వేగం అందుకోవడం, గేర్లు మార్చకుండా వేగాన్ని పెంచుకోవడం, బ్రేకింగ్ దూరం.. ఈ మూడు పరీక్షల్లోనూ రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450 ముందంజలో నిలిచింది. ముఖ్యంగా ఎక్కువ టార్క్, మెరుగైన యాక్సిలరేషన్ కోరుకునేవారికి ఇది ఆకర్షణీయమైన ఎంపికగా కనిపిస్తోంది. అలాగని ట్రయంఫ్ ట్రాకర్ 400ను తక్కువగా అంచనా వేయకూడదు, ఈ పరీక్షల్లో గెరిల్లా 450ను అధిగమించలేకపోయింది అంతే.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్ని ఫాలో అవ్వండి.
