Renault Kiger Facelift 2025 Price, Features In Telugu: భారత కాంపాక్ట్‌ SUV మార్కెట్‌లో సరికొత్త సంచలనం నమోదైంది. మారుతి సుజుకీకి పోటీగా, కామన్‌ మ్యాన్‌కు బడ్జెట్‌ కార్లను అందించే రెనాల్ట్‌, జనానికి ప్రియమైన మోడల్‌ 'కిగర్‌'లో ‍‌(New Renault Kiger) ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ లాంచ్‌ విడుదల చేసింది. కేవలం రూ. 6.29 లక్షల ఎక్స్‌-షోరూమ్‌ ధర నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త వెర్షన్‌.. రూపంలోనూ, ఫీచర్లలోనూ బోలెడన్ని మార్పులు తెచ్చింది. ఎంట్రీ లెవల్‌ SUV కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లకు, ముఖ్యంగా ఈ పండుగ సీజన్‌లో బడ్జెట్‌ కారు కొనాలనుకునే వాళ్లకు ఇది మంచి ఆప్షన్‌గా కనిపిస్తోంది.

డిజైన్‌లో కొత్త లుక్‌కొత్త కిగర్‌ ఫేస్‌లిఫ్ట్‌ మొదటి చూపులోనే ఆకర్షిస్తుంది. ముందు బంపర్‌, క్రోమ్‌ టచ్‌తో గ్రీల్‌, షార్ప్‌ LED ప్రాజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌, స్పోర్టీ డే-టైమ్ రన్నింగ్ లైట్స్‌ వాహనానికి స్టైలిష్‌ అప్‌గ్రేడ్‌ ఇస్తున్నాయి. కొత్తగా డిజైన్‌ చేసిన 16 అంగుళాల అలాయ్‌ వీల్స్‌, ఈ కాంపాక్ట్‌ సైజ్‌ SUVకి మరింత డైనమిక్‌ లుక్స్‌ ఆపాదించాయి. వెనుక వైపు LED టెయిల్‌ల్యాంప్స్‌, బంపర్‌లో చేసిన చిన్న మార్పులు కూడా ఈ కారును మరింత ఆధునికంగా నిలబెట్టాయి.

ఇంటీరియర్‌లో కొత్త మెరుగులుఅంతర్గతంగా కూడా కిగర్‌ మరింత ఆకర్షణీయంగా మారింది. డ్యుయల్‌ టోన్‌ డాష్‌బోర్డ్‌, 8 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ వంటి టెక్‌ ఫ్రెండ్లీ ఫీచర్లు ఉన్నాయి. కొత్తగా చేర్చిన వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు, ఆంబియంట్‌ లైటింగ్‌, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ వంటి సౌకర్యాలు డ్రైవర్‌కు, ఇతర ప్రయాణికులకు ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి.

రక్షణ మరింత బలోపేతంభారత మార్కెట్లో ఇప్పుడు కార్లు భద్రత ప్రమాణాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. రెనాల్ట్‌ కిగర్‌ కూడా ఈ అంశాన్ని బాగా దృష్టిలో పెట్టుకుంది. అన్ని వేరియంట్‌లలో 6 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ ప్రోగ్రామ్‌, హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్‌, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో డ్రైవింగ్‌ సమయంలో సేఫ్టీపై ఎలాంటి సందేహం లేకుండా నమ్మకంగా ముందుకు సాగవచ్చు.

ఇంజిన్‌ ఎంపికలు మారలేదుఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ కాబట్టి, కొత్త కిగర్‌ వెర్షన్‌లో మెకానికల్‌గా పెద్ద మార్పులు చేయలేదు. గత మోడల్‌ లాగే 1.0 లీటర్‌ నేచురల్‌ పెట్రోల్‌, 1.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ ఆప్షన్లు లభిస్తున్నాయి. ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్‌లలో 5 స్పీడ్‌ మాన్యువల్‌, AMT, CVT లభ్యమవుతాయి. వీటిలో కస్టమర్‌ తన అవసరాల ప్రకారం సరైనదానిని ఎంపిక చేసుకోవచ్చు.

ధరలు & వేరియంట్‌లుకిగర్‌ ఫేస్‌లిఫ్ట్‌ బేస్‌ వేరియంట్‌ రూ. 6.29 లక్షల ఎక్స్‌-షోరూమ్‌ ధర నుంచి మొదలవుతుంది. మిడ్‌ లెవల్‌ వేరియంట్‌లు సుమారు రూ. 7.5 లక్షల నుంచి 8.5 లక్షల వరకు ఉండగా, టాప్‌ వేరియంట్‌ ధర రూ. 11.29 లక్షల వరకు ఉంటుంది. ఈ ధరలతో కిగర్‌ కొత్త మోడల్‌ Hyundai Venue, Kia Sonet, Tata Nexon, Nissan Magnite వంటి బలమైన పోటీదారులతో సేల్స్‌ రేస్‌ కొనసాగిస్తుంది.

తెలుగు రాష్ట్రాల కస్టమర్లకు ప్రత్యేకంరెనాల్ట్‌ కిగర్‌, ఫేస్‌లిఫ్ట్‌ రూపంలో మరింత ఫ్రెష్‌గా, సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్కెట్‌లోకి వచ్చింది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖ వంటి నగరాల్లో ఎంట్రీ లెవల్‌ SUV కొనాలనుకునే వినియోగదారులకు కిగర్‌ ఫేస్‌లిఫ్ట్‌ మంచి ఆప్షన్‌. SUV లుక్‌, ఫ్యూయల్‌ ఎఫిషియెన్సీ, సేఫ్టీ, చౌకైన ధర - అన్నీ బెస్ట్‌ క్వాలిటీస్‌తో రెనాల్ట్‌ మరోసారి యువతను ఆకర్షించేందుకు ముందుకు వచ్చింది. యూత్‌కు మాత్రమే కాకుండా ఎంట్రీ లెవల్‌ SUV కోసం ఎదురుచూస్తున్న ఫ్యామిలీలు కూడా దీనిని ఖచ్చితంగా పరిశీలించవచ్చు.