Renault Duster India Launch: భారత SUV మార్కెట్‌లో ఒకప్పుడు ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రెనాల్ట్‌ డస్టర్‌ తిరిగి వస్తోంది. 2022 ప్రారంభంలోనే నిలిపేసిన ఈ మోడల్‌ను సరికొత్త అవతారంలో రిపబ్లిక్‌ డే 2026, అంటే జనవరి 26న భారత మార్కెట్‌కు పరిచయం చేయబోతోంది రెనాల్ట్‌ ఇండియా. ఇది మూడో తరం డస్టర్‌ కావడం విశేషం. ఈ కారుతో నేరుగా మారుతి గ్రాండ్‌ విటారా, టాటా సియెర్రా, హ్యుందాయ్‌ క్రెటా వంటి బలమైన మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వాలని కంపెనీ భావిస్తోంది.

Continues below advertisement

రెనాల్ట్‌ వ్యూహంలో డస్టర్‌ కీలక పాత్ర

రెనాల్ట్‌ తెలిపిన వివరాల ప్రకారం, ఈ కొత్త డస్టర్‌ International Game Plan 2027లో భాగంగా భారత్‌కు వచ్చే తొలి మోడల్‌. అలాగే ‘renault. rethink’ వ్యూహంలో ఇది కీలక పాత్ర పోషించనుంది. గతేడాది ట్రైబర్‌ (Triber), కైగర్‌ (Kiger) ఫేస్‌లిఫ్ట్‌లతో ఈ వ్యూహాన్ని ప్రారంభించిన రెనాల్ట్‌, ఇప్పుడు డస్టర్‌తో పూర్తి స్థాయిలో దూసుకెళ్లాలని చూస్తోంది.

Continues below advertisement

కొత్త డిజైన్‌ - మరింత రగ్డ్‌ లుక్‌

అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల్లో ఉన్న మూడో తరం డస్టర్‌ను ఆధారంగా తీసుకుని రూపొందించిన ఈ SUVకి పూర్తిగా కొత్త రగ్డ్‌ డిజైన్‌ ఉంది. స్క్వేర్‌డ్‌ ప్రొపోర్షన్స్‌, మస్కులర్‌ ఫెండర్స్‌, బోల్డ్‌ బాడీ క్లాడింగ్‌ ఈ కారుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ప్రస్తుతం విదేశీ మార్కెట్లలో ఉన్న మోడల్‌ సైజ్‌లు - పొడవు 4.3 మీటర్లు, వెడల్పు 1.8 మీటర్లు, ఎత్తు 1.6 మీటర్లు, వీల్‌బేస్‌ 2.6 మీటర్లు.

ఫ్రంట్‌లో షార్ప్‌ LED హెడ్‌ల్యాంప్స్‌, గ్రిల్‌పై పెద్దగా కనిపించే Renault లెటరింగ్‌, చంకీ బంపర్‌ ఉన్నాయి. సైడ్‌ ప్రొఫైల్‌లో పాత డస్టర్‌ స్టైల్‌ విండో లైన్‌ను కొనసాగించారు. వెనుక భాగంలో C-షేప్‌ LED టెయిల్‌ల్యాంప్స్‌, డ్యూయల్‌ టోన్‌ క్లాడింగ్‌, రూఫ్‌ రైల్స్‌, రూఫ్‌ మౌంటెడ్‌ స్పాయిలర్‌ ఉన్నాయి.

అయితే, భారత మార్కెట్‌కు వచ్చే డస్టర్‌ డిజైన్‌లో కొన్ని ప్రత్యేక మార్పులు ఉండనున్నాయి. టీజర్ల ప్రకారం ఐబ్రో స్టైల్‌ LED DRLs, కనెక్టెడ్‌ LED టెయిల్‌లైట్‌ బార్‌, ప్రత్యేకమైన ఫ్రంట్‌, రియర్‌ బంపర్లు ఇవ్వనున్నారు.

ఇంటీరియర్‌, ఫీచర్లు

కొత్త డస్టర్‌ క్యాబిన్‌ పూర్తిగా ఆధునికంగా రూపొందించారు. లేయర్డ్‌ డ్యాష్‌బోర్డ్‌, షార్ప్‌ యాంగ్యులర్‌ లైన్స్‌, డ్రైవర్‌వైపు కొంచెం తిరిగిన సెంటర్‌ కన్సోల్‌ ఇందులో కనిపిస్తాయి. హెక్సాగనల్‌ ఆకారంలో AC వెంట్స్‌ ప్రత్యేక ఆకర్షణ.

ఫీచర్ల విషయానికి వస్తే....

10 ఇంచ్‌ టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌

వైర్‌లెస్‌ Android Auto, Apple CarPlay

7 ఇంచ్‌ డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే

వైర్‌లెస్‌ చార్జింగ్‌

360 డిగ్రీ కెమెరా

అంతేకాదు, తొలిసారిగా రెనాల్ట్‌ ఇండియాలో ADAS సేఫ్టీ ఫీచర్లు అందించే అవకాశం ఉంది. ఇది నిజమైతే, డస్టర్‌ బ్రాండ్‌కు కీలకమైన అడుగుగా మారుతుంది.

ఇంజిన్‌, ప్లాట్‌ఫామ్‌ వివరాలు

ప్రస్తుతానికి, కొత్త డస్టర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తోనే వస్తుంది. 1.3 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ (156 హెచ్‌పీ) మాన్యువల్‌, CVT గేర్‌బాక్స్‌లతో అందించే అవకాశం ఉంది. ఎంట్రీ వేరియంట్లకు కైగర్‌లో ఉన్న 1.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ కూడా ఇవ్వొచ్చు.

డీజిల్‌ ఇంజిన్‌ను ప్రస్తుతం తీసుకురావడం లేదు. అయితే లోకలైజ్డ్‌ హైబ్రిడ్‌ పవర్‌ట్రెయిన్‌పై రెనాల్ట్‌ పరిశీలన చేస్తోంది.

ఈ SUVని కొత్త CMF-B ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. ఇదే ప్లాట్‌ఫామ్‌పై, నిస్సాన్‌ తన మిడ్‌ సైజ్ SUV ‘టెక్టాన్‌’ను కూడా ఈ ఏడాదే విడుదల చేయనుంది.

ధర, పోటీ

కొత్త రెనాల్ట్‌ డస్టర్‌ ధర రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌ ధర) మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ సెగ్మెంట్‌లో హ్యుందాయ్‌ క్రెటా, కియా సెల్టోస్‌, మారుతి గ్రాండ్‌ విటారా, టయోటా హైరైడర్‌, టాటా సియెర్రా, టాటా కర్వ్‌ వంటి మోడళ్లతో నేరుగా పోటీ పడనుంది.

మొత్తానికి, భారత SUV మార్కెట్‌లో మరోసారి డస్టర్‌ హవా చూపించేందుకు రెనాల్ట్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. జనవరి 26న జరిగే ఆవిష్కరణతో ఈ ఐకానిక్‌ పేరు మళ్లీ వార్తల్లో నిలవనుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.