Electric Scooter Battery Life Tips: భారతీయ రహదారులపై నేడు ఎలక్ట్రిక్ స్కూటర్ల సందడి పెరిగింది. ఓలా, ఏథర్‌, టీవీఎస్‌, హీరో విదా వంటి బ్రాండ్లు మార్కెట్‌లో పోటీపడుతున్నాయి. అయితే ఈ వాహనాల్లో ఉండే లిథియం- అయాన్‌ బ్యాటరీలు అత్యంత ఖరీదైనవి, సున్నితమైనవి. వీటిని సరిగా నిర్వహించకపోతే 3-5 ఏళ్లలో రావాల్సిన బ్యాటరీ సామర్థ్యం అంతకంటే ముందే పడిపోయే ప్రమాదం ఉంది. అసలు బ్యాటరీని ఎలా కాపాడుకోవాలి? ఎలాంటి పద్దతులు అనుసరించాలో చూద్దాం. 

Continues below advertisement

బ్యాటరీ లైఫ్ ఎలా దెబ్బతింటుంది?

మనం వాడే స్మార్ట్‌లాగానే, ఈవీ బ్యాటరీలకు కూడా నిర్దిష్టమైన ఛార్జింగ్ సైకిల్ ఉంటుంది. బ్యాటరీని పూర్తిగా జీరోకి తీసుకురావడం లేదా ప్రతిసారీ వంద శాతం ఛార్జ్ చేయడం వల్ల లోపలి సెల్స్‌ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. లిథియం-అయాన్ బ్యాటరీలకు వేడి అనేది అతి పెద్ద శత్రువు, అధిక ఉష్ణోగ్రతల వద్ద ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీ లోపలి భాగం పాడవుతుంది. 

20-80 శాతం మ్యాజిక్ ఏంటీ?

నిపుణులు, తయారీదారులు సూచించే అత్యంత ప్రభావవంతమైన సూత్రం 20-80 శాతం రూల్. మీ స్కూటర్‌ బ్యాటరీ 20 శాతం కంటే తక్కువకు పడిపోకుండా చూసుకోవాలి. లో బ్యాటరీ అలారం వచ్చిన వెంటనే ఛార్జింగ్‌ పెట్టడం ఉత్తమం. రోజువారీ అవసరాల కోసం బ్యాటరీని 80 శాతం నుంచి 85 వరకు మాత్రమే ఛార్జ్ చేయాలి. దీని వల్ల బ్యాటరీ సెల్స్‌పై ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. బ్యాటరీ సెల్స్‌ అన్నీ సమానంగా ఉండటానికి వారానికి లేదా పది రోజులకు ఒకసారి మాత్రమే వంద శాతం ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. 

Continues below advertisement

ఛార్జింగ్ చేయడానికి సరైన సమయం ఏదీ?

సమయం, వాతావరణం బ్యాటరీ పని తీరుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. సుదీర్ఘ ప్రయాణం లేదా వేగంగా డ్రైవ్ చేసిన వెంటనే బ్యాటరీ వేడిగా ఉంటుంది. ఆ స్థితిలో వెంటనే చార్జర్ పెట్టకూడదు. కనీసం ఇరవై నుంచి 30 నిమిషాలు ఆగి బ్యాటరీ చల్లబడిన తర్వాతే ఛార్జింగ్ ప్రారంభించాలి. ఛార్జింగ్ పూర్తి అయిన వెంటనే స్కూటర్ స్టార్ట్ చేయకుండా ఒక పది నిమిషాలు వేచి ఉండటం వల్ల బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. లేటెస్ట్ స్కూటర్లలో ఆటో కట్‌ ఫీచర్ ఉన్నప్పటికీ, రాత్రంతా ప్లగ్‌లోనే ఉంచడం వల్ల కాలక్రమేణా బ్యాటరీ ఉబ్బే అవకాశం ఉంది. 

సరైన ఛార్జింగ్‌ పద్ధతులు ఏంటీ?

బ్యాటరీని ఎలా ఛార్జ్‌ చేస్తున్నామనేది దాని లైఫ్‌ను నిర్ణయిస్తుంది. కంపెనీ ఇచ్చిన అఫిషియల్‌ ఛార్జర్‌ను మాత్రమే వాడాలి. థర్డ్‌ పార్టీ లేదా చౌకగా దొరికే ఛార్జర్లు వోల్టేజ్‌ హెచ్చుతగ్గుల వల్ల బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను పాడుచేస్తాయి. ఎల్లప్పుడూ చల్లని, నీడ ఉన్న, గాలి ఆడే ప్రదేశంలోనే ఛార్జ్‌ చేయాలి. గది ఉష్ణోగ్రత 20-30 డిగ్రీల సెల్సియస్‌ ఉండటం బ్యాటరీకి ఎంతో మేలు చేస్తుంది. ఒక వేళ వారం కంటే ఎక్కువ రోజులు స్కూటర్‌ వాడకపోతే, బ్యాటరీని 50 శాతం నుంచి 60 శాతం మధ్య ఉంచి పార్క్ చేయాలి. పూర్తిగా నిండుగా లేదా పూర్తిగా ఖాళీగా వదిలేయడం వల్ల బ్యాటరీ డెడ్‌ అయ్యే ప్రమాదం ఉంది. 

బ్యాటరీ లైఫ్‌ ఎంత?

సాధారణంగా నాణ్యమైన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ 3 నుంచి ఐదు సంవత్సరాలు లేదా 40 వేల నుంచి 80 వేల కిలోమీటర్ల వరకు మంచి పని తీరును కనబరుస్తుంది. పార్శియల్‌ ఛార్జింగ్‌ బ్యాటరీకి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మీరు ఏ బ్రాండ్ స్కూటర్‌ వాడుతున్నా, ఈ ప్రాథమిక సూత్రాలు అన్నీ ఒకేలా వర్తిస్తాయి. క్రమం తప్పకుండా సర్వీసింగ్‌ చేయించడం,బ్యాటరీ హెల్త్‌ను చెక్ చేయించుకోవడం ద్వారా మీ ఈవీ ప్రయాణాన్ని మరింత కాలం సురక్షితంగా కొనసాగించవచ్చు.