Power Petrol vs Normal Petrol: పెట్రోల్ బంక్‌కు వెళ్లినప్పుడు చాలా మంది డ్రైవర్లు ఒకే సందేహంలో పడుతుంటారు. నార్మల్ పెట్రోల్ పోయించాలా? లేక పవర్ పెట్రోల్ ఎంచుకోవాలా?. కొందరు పవర్ పెట్రోల్ వాడితే కారు ఎక్కువ మైలేజ్ ఇస్తుందని, ఇంజిన్ పవర్ పెరుగుతుందని భావిస్తుంటారు. కానీ వాస్తవానికి అది ప్రతి కారుకు వర్తించదు. మీ కారు ఇంజిన్ స్వభావాన్ని బట్టి సరైన ఇంధనాన్ని ఎంచుకోవడమే ఉత్తమ నిర్ణయం.

Continues below advertisement

3 రకాల పెట్రోల్‌పెట్రోల్‌ను ప్రధానంగా మూడు రకాలుగా విభజిస్తారు. నార్మల్ పెట్రోల్, ప్రీమియం లేదా పవర్ పెట్రోల్ & ఎక్స్‌ట్రా ప్రీమియం పెట్రోల్. వీటి మధ్య ప్రధాన తేడా ఆక్టేన్ రేటింగ్. ఆక్టేన్ రేటింగ్ అంటే ఇంధనం ముందుగానే దహనం కాకుండా ఎంత వరకు ఒత్తిడిని తట్టుకోగలదో సూచించే ప్రమాణం. ఆక్టేన్ విలువ ఎక్కువగా ఉంటే ఇంజిన్‌లో నాకింగ్ లేదా పింగింగ్ సమస్యలు తగ్గి, అధిక కంప్రెషన్ ఇంజిన్లు మెరుగైన పనితీరును అందిస్తాయి.

నార్మల్ పెట్రోల్ సాధారణంగా 87 ఆక్టేన్ రేటింగ్‌తో ఉంటుంది. ఇది ఎక్కువ శాతం సాధారణ కార్ల కోసం రూపొందించారు. మారుతి సుజుకి, హోండా, హ్యుందాయ్ వంటి కంపెనీలకు చెందిన అనేక సాధారణ పెట్రోల్ కార్లు నార్మల్ పెట్రోల్‌తోనే సమర్థవంతంగా పనిచేస్తాయి. టర్బో లేని సాధారణ ఇంజిన్లకు ఈ ఇంధనం సరిపోతుంది. ధర కూడా తక్కువగా ఉండటంతో రోజువారీ వినియోగానికి ఇది అత్యంత ఆర్థికమైన ఎంపికగా నిలుస్తుంది.

Continues below advertisement

పవర్ లేదా ప్రీమియం పెట్రోల్ మాత్రం 91 నుంచి 95 ఆక్టేన్ రేటింగ్ కలిగి ఉంటుంది. ఇది అధిక కంప్రెషన్ ఇంజిన్లు, టర్బోచార్జ్డ్ కార్లు, స్పోర్ట్స్ & లగ్జరీ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇందులో ఉండే ప్రత్యేక యాడిటివ్‌లు ఇంజిన్‌లో కార్బన్ పేరుకుపోవడాన్ని తగ్గిస్తాయి. దీంతో ఇంజిన్ పరిశుభ్రంగా ఉండటమే కాకుండా, దీర్ఘకాలం మెరుగైన పనితీరును అందిస్తుంది.

ఇది కూడా చదవండి: కంఫర్ట్, మంచి మైలేజ్‌తో పాటు రోడ్‌పై ప్రత్యేకంగా కనిపించాలా? సెల్టోస్ & సఫారిలో నిపుణుల ఎంపిక ఇదే

పవర్ పెట్రోల్ మరో ముఖ్యమైన ప్రయోజనం నాకింగ్‌ను తగ్గించడం. ఇంధనం ముందుగానే దహనం కావడం వల్ల ఇంజిన్ పనితీరు తగ్గుతుంది. అయితే అధిక ఆక్టేన్ రేటింగ్ కారణంగా పవర్ పెట్రోల్ ఈ సమస్యను తగ్గించి ఇంజిన్‌ను మరింత స్మూత్‌గా పనిచేసేలా చేస్తుంది. దీంతో పవర్ డెలివరీ మెరుగుపడటమే కాకుండా, కొన్ని హై పెర్ఫార్మెన్స్ కార్లలో ఇంధన సామర్థ్యం కూడా కొంత మెరుగయ్యే అవకాశం ఉంటుంది.

ఇంకా ఒక స్థాయి పైగా ఉండేది ఎక్స్‌ట్రా ప్రీమియం పెట్రోల్. దీని ఆక్టేన్ రేటింగ్ సాధారణంగా 97 నుంచి 99 వరకు ఉంటుంది. అత్యంత అధిక పనితీరు గల స్పోర్ట్స్ కార్లు, లగ్జరీ కార్ల కోసం దీనిని ఉపయోగిస్తారు. ఇందులోని అధునాతన యాడిటివ్‌లు ఇంజిన్‌ను మరింత శుభ్రంగా ఉంచి, గరిష్ట పనితీరును అందించడంలో సహాయపడతాయి. BMW, ఆడి, మెర్సిడెస్ బెంజ్ వంటి కొన్ని ప్రీమియం కార్లలో ఈ రకం ఇంధనాన్ని సిఫార్సు చేస్తారు.

గుర్తుంచుకోవాల్సిన విషయంఅయితే ఇక్కడ ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి. సాధారణ కారులో పవర్ పెట్రోల్ పోయించడం వల్ల పెద్దగా అదనపు ప్రయోజనం ఉండదు. పెట్రోల్‌ రకానికి అనుగుణంగా ఇంజిన్‌ను రూపొందించకపోతే మైలేజ్ పెరగదు, పవర్ కూడా గణనీయంగా పెరగదు. అంటే అదనంగా ఖర్చు చేసిన డబ్బుకు తగిన ప్రయోజనం లభించకపోవచ్చు. అందుకే కేవలం పవర్ పెట్రోల్ అనే పేరును చూసి ప్రతిసారి అదే ఎంచుకోవడం సరైన నిర్ణయం కాదు.

ఇది కూడా చదవండి: హోండా ఎలివేట్ vs టాటా హారియర్ vs మహీంద్రా XUV 7XO - హెవీ ట్రాఫిక్‌లోనూ చిరాకు లేకుండా తిరగడానికి ఏ SUV కొనాలి?

పవర్ పెట్రోల్ ఎప్పుడు ఉపయోగించాలి? మీ కారులో అధిక కంప్రెషన్ రేషియో ఇంజిన్ ఉంటే, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ అయితే లేదా తయారీ సంస్థ యూజర్ మాన్యువల్‌లో ప్రీమియం పెట్రోల్ వాడాలని స్పష్టంగా సూచిస్తే మాత్రమే పవర్ పెట్రోల్ ఎంచుకోవాలి. అలాగే ఇంజిన్‌లో తరచూ నాకింగ్ లేదా పింగింగ్ సమస్యలు ఎదురైతే కూడా తయారీ సంస్థ సూచనల మేరకు ప్రీమియం పెట్రోల్ ఉపయోగించవచ్చు.

పవర్ పెట్రోల్ వల్ల హై పెర్ఫార్మెన్స్ కార్లలో ఇంధన సామర్థ్యం కొంత మెరుగుపడటం, ఇంజిన్ సాఫీగా పనిచేయడం, కార్బన్ డిపాజిట్లు తగ్గడం, ఇంజిన్ జీవితకాలం పెరగడం & కాలుష్య ఉద్గారాలు తగ్గడం వంటి ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఇవన్నీ అలాంటి ఇంజిన్ల కోసం మాత్రమే. సాధారణ కార్లలో ఈ ప్రయోజనాలు కనిపించవు.

కాబట్టి మీ కారుకు ఏ పెట్రోల్ పోయించాలో నిర్ణయించే ముందు తయారీ సంస్థ ఇచ్చిన యూజర్ మాన్యువల్‌ను తప్పకుండా పరిశీలించండి. తయారీదారు సూచించిన ఇంధనాన్నే ఉపయోగించడం ద్వారా మెరుగైన పనితీరు, సరైన మైలేజ్ & ఇంజిన్‌కు దీర్ఘకాలిక రక్షణ లభిస్తుంది. అనవసరంగా అధిక ధర ఉన్న పెట్రోల్‌ను ఎంచుకోవడం కంటే, మీ వాహనానికి సరిపోయే ఇంధనాన్ని ఉపయోగించడమే తెలివైన నిర్ణయం.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.