వాహనాలు కొనే సమయంలో అధిక మైలేజీ ఇచ్చే వాటిని ఎంపిక చేసుకుంటాం. అయినప్పటికీ పెరుగుతున్న ఇతర ఇంటి ఖర్చులతో పెట్రోల్ ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. అయితే మీ వద్ద పాత వాహనం ఉండి, అది తక్కువ మైలేజ్ ఇస్తే కనుక మీ పెట్రోల్ వినియోగాన్ని తగ్గించి, మైలేజ్‌ను మెరుగుపరచడానికి కొన్ని చిట్కాలు పాటించండి. మీరు కారును సరైన రీతిలో డ్రైవింగ్ చేస్తూ, కొన్ని విషయాలను జాగ్రత్తగా గమనిస్తే, మీ వాహనం మైలేజ్ గతంలో కంటే కాస్త పెరుగుతుంది.

Continues below advertisement

సమయం చూసి ఇంధనం కొట్టించాలి

మీరు పెట్రోల్ నింపే సమయం కూడా కారు మైలేజ్‌పై ప్రభావం చూపుతుంది. ఉదయాన్నే లేదా ఆలస్యంగా రాత్రి సమయంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు పెట్రోల్ ద్రవీభవన సాంద్రత (డెన్సిటీ) ఎక్కువగా ఉంటుందని తెలిసిందే. అదే మధ్యాహ్నం వేడిలో పెట్రోల్ త్వరగా ఆవిరి అవుతుంది. దీనివల్ల మీకు కొన్ని పాయింట్ల తక్కువ ఇంధనం లభిస్తుంది. అందుకే మీరు ఉదయం లేదా రాత్రి వేళల్లోనే పెట్రోల్ కొట్టిస్తే ప్రయోజనం ఉంటుంది. 

Continues below advertisement

తరచూ బ్రేకులు వేయవద్దు

వాహనదారులు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. తరచూ సడన్ బ్రేకులు వేయడం, వేగంగా యాక్సిలరేటర్ తొక్కడం చేయకూడదు. ఇలా చేయడంతో మీ కారు లేదా బైక్ ఇంజిన్‌పై నేరుగా ఒత్తిడి పడి, పెట్రోల్ అధికంగా తీసుకుంటుంది. కనుక వాహనాన్ని వీలైతే ఒకే వేగంతో నడపాలి. ట్రాఫిక్ సిగ్నల్స్ లేదా జామ్‌లను ముందుగానే అంచనా వేసి యాక్సిలరేటర్ మీద నుంచి కాలు సమయానికి తీసేయాలి. దీనివల్ల బ్రేక్ ప్యాడ్ల లైఫ్ టైమ్ పెరగడమే కాకుండా పెట్రోల్ కూడా ఆదా అవుతుంది.

టైర్ల గాలిపై ఫోకస్ చేయాలి 

మీ వాహనం టైర్లలో గాలి ప్రెజర్ తక్కువగా ఉంటే ముందుకు వెళ్లడానికి ఇంజిన్ ఎక్కువ ఎనర్జీని ఉపయోగించాల్సి వస్తుంది. దీనివల్ల మైలేజ్ మరో 10 -15 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. కనుక వాహనం ఈజీగా వెళ్లడానికి, ఇంజిన్‌పై అధిక భారం పడకుండా ఉండటానికి  కంపెనీ సూచించిన మేర టైర్లలో గాలి లెవెల్స్ ఉండేలా చూసుకోవాలి.

వాహనంలో అనవసర బరువు ఉంచవద్దు

కారు డిక్కీలో లేదా వెనుక సీటులో అనవసరమైన లగేజీ, సామాగ్రిని ఉంచవద్దు. దీనివల్ల వాహనంపై అదనపు భారం పడి మైలేజ్ పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీంతో పాటు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద 30 సెకన్ల కంటే ఎక్కువ సమయం ఆగాల్సి వస్తే ఇంజిన్ ఆఫ్ చేయడం మంచిది. మోడ్రన్ ఇంజిన్లను మళ్లీ స్టార్ట్ చేయడానికి చాలా తక్కువ ఇంధనం ఖర్చవుతుంది. అయితే వాహనాన్ని నిలిపి ఉంచి ఇంజిన్ ఆన్‌లో ఉంచితే పెట్రోల్ ఎక్కువ ఖర్చవుతుంది.