Petrol Pump Safety Tips: కారులో పెట్రోల్‌ కొట్టించేటప్పుడు చాలా మంది డ్రైవింగ్ సీటు నుంచి కదలకుండా ఉండిపోతారు. దీన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది మోసాలకు పాల్పడుతుంటారు. కొన్నిసార్లు ఇది మీకు భారీ నష్టాన్ని కలిగించవచ్చు. అందుకే అలాంటి మోసాలు జరగకుండా ఉండేందుకు మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. పెట్రోల్ నింపేటప్పుడు మోసాలు జరగకుండా సులభంగా నివారించవచ్చు.

Continues below advertisement

మీ వాహనానికి ఫ్యూయల్‌ నింపేటప్పుడు, ముందుగా డిస్పెన్సింగ్ మెషీన్‌ను చెక్ చేయడం చాలా అవసరం. ఫ్యూయల్‌ నింపే ముందు, మీటర్ 0.00 నుంచి ప్రారంభమవుతుందో లేదో ఒక్కసారి చూసుకోండి. పెట్రోల్ పంపుల వద్ద చాలా మంది మీ దృష్టిని మరల్చి మోసం చేస్తుంటారు. అక్కడ పని చేసే సిబ్బంది ప్రశ్నలతో మభ్యపెట్టేందుకు యత్నిస్తారు. మరొకరు టైర్ లేదా విండ్‌షీల్డ్ వైపు చూపిస్తారు. ఈలోగా చేయాల్సింది చేసేస్తారు. వారితో మాట్లాడుతూనే మీటర్ రీడింగ్‌పై దృష్టిని ఉంచండి. మీరు పని పూర్తి చేసిన తర్వాత బిల్లును పొందాలని గుర్తు పెట్టుకోండి. 

పెట్రోల్‌ పోసే గన్ ఎలా యూజ్ చేస్తున్నారో గమనిస్తూ ఉండండి. కొందరు ఈ విషయంలో కూడా మోసం చేస్తుంటారు. ఫ్యూయల్‌ ఫిల్ చేసే వ్యక్తి పదే పదే ట్రిగ్గర్‌ను విడుదల చేసి నొక్కితే, గాలి పైపును నింపుతుందని అర్థం. దీని ఫలితంగా ట్యాంక్‌లోకి తక్కువ పెట్రోల్ లేదా డీజిల్ పోస్తారు. నాజిల్‌ను లాక్ చేసి ట్యాంక్‌ను ఫిల్ చేయడం మంచిది. అలా చేస్తేనే గాలికి బదులు మొత్తం ఫ్యాయల్‌ నింపినట్టు అవుతుంది. 

Continues below advertisement

కొన్నిసార్లు, సిబ్బంది ఉద్దేశపూర్వకంగా మీటర్ స్పష్టంగా కనిపించని ప్రదేశంలో నిల్చుంటారు. అప్పుడు కూడా రీడింగ్‌లో మోసాలు జరుగుతాయి. అటువంటి పరిస్థితిలో, కారు దిగి మీరే మెషిన్‌ వద్ద నిలబడాలి. అప్పుడే అక్కడ జరిగే మోసాన్ని మీరు గుర్తించగలుగుతారు. మీర చూస్తున్నట్టు అయితే సిబ్బంది మోసాలు చేయడానికి సాహసించరు.  

వెహికల్‌లో తక్కువ ఫ్యూయల్ నింపారని గ్రహిస్తే వెంటనే పరిమాణ చెక్ చేయమని డిమాండ్ చేయవచ్చు. ప్రతి పంపుకు మెజరింగ్‌ జార్స్ ఉంటాయి. ఇలాంటివి జరగకుండా ఉండేందుకు మీరు ఒకే ప్రాంతంలో పేరున్న పెట్రోల్ బంకులోనే ఫ్యూయల్ నింపడం చాలా మంచిది. మీరు వేర్వేరు బంకుల్లో ఫ్యూయల్ కొట్టించడం వల్ల కూడా మీ వాహనానికి ముప్పు పెరుగుతుంది.  

చాలా పెట్రోల్ పంపుల్లో కనురెప్ప వేసే లోపు మోసాలు జరిగిపోతాయి. అందుకే మీటర్‌ను చూడటం, ఏకగ్రతతో ఉండటం, సరిగ్గా ఫ్యాయల్ నింపడం అనేవి మూడు జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి. కొంచెం అవగాహన ప్రతిసారీ మిమ్మల్ని నష్టాల నుంచి కాపాడుతుంది.