Oben Roar EZ Sigma Price, Range And Features In Telugu: ఒబెన్ ఎలక్ట్రిక్, తన కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఒబెన్ రోర్ EZ సిగ్మాను ఆగస్టు 05, 2025న లాంచ్‌ చేసింది. ఈ బైక్ బలమైన పనితీరు, ఆధునిక ఫీచర్లు & అద్భుతమైన బ్యాటరీ రేంజ్‌ను అందిస్తోంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ మునుపటి కంటే మరింత మోడరన్‌ ఫీచర్లు & లాంగ్‌ రైడింగ్‌ రైంజ్‌తో వచ్చింది. కంపెనీ దీనిని రెండు బ్యాటరీ ఎంపికలతో ప్రవేశపెట్టింది. బండి డెలివరీలు ఆగస్టు 15, 2025 నుంచి ప్రారంభమవుతాయి.

మోడరన్‌ ఫీచర్లు ఒబెన్ రోర్ EZ సిగ్మా ఎలక్ట్రిక్‌ బైక్‌లో 5-అంగుళాల TFT స్క్రీన్‌ ఇచ్చారు, ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ అలర్ట్ & మ్యూజిక్ కంట్రోల్ వంటి స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది. కాలు కింద పెట్టకుండానే ఈ బైక్‌ను రివర్స్‌ చేయొచ్చు, రివర్స్ మోడ్ సౌకర్యం కూడా ఉంది. దొంగతనం నుంచి భద్రత కోసం యాంటీ-థెఫ్ట్ లాక్ & బ్యాటరీ స్టేటస్‌ తెలుసుకోవడానికి యూనిఫైడ్ బ్యాటరీ అలర్ట్ (UBA) కూడా ఉన్నాయి. ఉంది. రైడర్‌ భద్రతను దృష్టిలో ఉంచుకుని, డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ కూడా ఈ బైక్‌లో ఒక భాగంగా మారింది. 

బ్యాటరీ & పరిధి ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో రెండు బ్యాటరీ ఎంపికలు (Oben Roar EZ Sigma Battery options) అందుబాటులో ఉన్నాయి, మొదటిది 3.4 kWh LFP బ్యాటరీ & రెండోది 4.4 kWh ఆప్షనల్‌ బ్యాటరీ. పెద్ద బ్యాటరీ వేరియంట్‌తో, ఈ బైక్ ఒకే ఛార్జ్‌లో 175 కి.మీ. దూరాన్ని (Oben Roar EZ Sigma Range) కవర్ చేయగలదు. దీనిలో అమర్చిన మోటారు చాలా శక్తిమంతమైనది, ఇది బైక్‌ను కేవలం 3.3 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ. వేగానికి తీసుకువెళుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 95 కి.మీ. అలాగే, ఈ బైక్‌లో మూడు రైడింగ్ మోడ్స్‌ ఉన్నాయి - ఎకో, సిటీ & హవోక్. ఇవి రైడింగ్‌ను మరింత సౌకర్యవంతంగా చేయడంతో పాటు బండిని నియంత్రించగలవు.

ధర ఎంత?ఒబెన్ ఎలక్ట్రిక్ కంపెనీ, ఒబెన్ రోర్ EZ సిగ్మాను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. బేస్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర ‍‌(Oben Rorr EZ Sigma Price) రూ. 1.27 లక్షలు కాగా; టాప్ మోడల్ ధర రూ. 1.37 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇవి పరిచయ ధరలు, పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ తరువాత, ఈ వేరియంట్ల ధరలు వరుసగా రూ. 1.47 లక్షలు & రూ. 1.55 లక్షలకు (ఎక్స్-షోరూమ్) పెరుగుతాయి.

బుకింగ్ & డెలివరీ కంపెనీ, ఒబెన్ రోర్ EZ సిగ్మా కోసం బుకింగ్స్‌ కూడా స్టార్ట్ చేసింది. కస్టమర్‌, కేవలం రూ. 2999 డిపాజిట్ చేసి ఈ బైక్‌ను బుక్ చేసుకోవచ్చు. ఆగస్టు 15, 2025 నుంచి ఈ ఎలక్ట్రిక్‌ బైక్‌ డెలివరీలు ప్రారంభం అవుతాయి. 

ఒబెన్ రోర్ EZ సిగ్మా ఎలక్ట్రిక్ బైక్ విభాగంలో ఇప్పటికే ఉన్న పాపులర్‌ మోడళ్లతో నేరుగా పోటీ పడాల్సి ఉంటుంది. దీని రైవల్స్‌లో.. Revolt RV400, Ola Roadster X & Okaya Ferrato వంటి బైక్‌లు ఉన్నాయి.