Night Driving Safety Guide: పగటి పూట డ్రైవింగ్ కంటే రాత్రి వేళ ప్రయాణం ఎంతో భిన్నంగా ఉంటుంది. తక్కువ విజిబిలిటీ, పెరిగే అలసట స్థాయిలు, ఊహించని అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. ప్రకృతి సిద్ధమైన వెలుతురు లేకపోవడం వల్ల దారిలో లోతును అంచనా వేయడం కష్టమవుతుంది. ఎదురుగా వచ్చే వాహనాల లైట్ల వెలుతురు కళ్లపై పడటం వల్ల చూపు మందగిస్తుంది. మన శరీరం సహజంగా రాత్రి పూట విశ్రాంతిని కోరుకుంటుంది, కాబట్టి ఏమరుపాటుగా ఉంటే ప్రతిచర్యలు నెమ్మదించి ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది. అందుకే నైట్ డ్రైవింగ్‌లో సురక్షితంగా ఉండటానికి ఈ క్రింది అంశాలను తప్పక గుర్తుంచుకోవాలి.
విజిబిలిటీ - హెడ్‌లైట్ల నిర్వహణ..చీకటి పడ్డాక రోడ్డు గుర్తులు, మలుపులు, అడ్డంకులను గుర్తించడం కష్టమవుతుంది. ముఖ్యంగా వెలుతురు తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇది మరింత ప్రమాదకరం. మీ కారు హెడ్‌లైట్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. అవి సరిగ్గా అలైన్ అయి ఉంటేనే దారి స్పష్టంగా కనిపిస్తుంది. చీకటి రోడ్లపై హై బీమ్ వాడటం మంచిదే అయినా, ఎదురుగా ఏదైనా వాహనం వస్తున్నప్పుడు దానిని వెంటనే లో బీమ్ కు మార్చాలి. అలాగే కారు విండ్‌షీల్డ్, మిర్రర్స్ మీద దుమ్ము లేకుండా చూసుకోవడం వల్ల చూపు స్పష్టంగా ఉంటుంది.
చిన్న బ్రేక్స్ కంపల్సరీ..లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అలసట అనేది క్రమంగా పెరుగుతుంది. రోజంతా పనులు ముగించుకుని రాత్రి ప్రయాణం మొదలుపెడితే నిద్రమత్తు వచ్చే అవకాశం ఉంది. ఆవలింతలు రావడం, ఏకాగ్రత తగ్గడం వంటివి ప్రమాదానికి సంకేతాలు. ప్రతి రెండు గంటలకోసారి చిన్న బ్రేక్ తీసుకోవడం వల్ల శరీరం ఉత్తేజితం అవుతుంది. కెఫిన్ వంటి పానీయాలు తాత్కాలికంగా మేల్కొనేలా చేసినా, అవి నిద్రకు ప్రత్యామ్నాయం కావు. బాగా నిద్రపోయి ప్రయాణం మొదలుపెట్టడం అన్నిటికంటే సురక్షితం.
ఎదురుగా వచ్చే వెలుతురు నుండి రక్షణ..సింగిల్ రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనాల హై బీమ్ వెలుతురు కళ్లపై పడి కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయి. అటువంటప్పుడు నేరుగా ఆ లైట్లను చూడకుండా, మీ వైపు రోడ్డు అంచు (Lane Edge) మీద దృష్టి పెట్టాలి. లోపలి రియర్ వ్యూ మిర్రర్‌ను 'నైట్ మోడ్'లో ఉంచడం ద్వారా వెనుక వచ్చే వాహనాల వెలుతురు నుండి ఉపశమనం పొందవచ్చు.
వేగ నియంత్రణ..రాత్రి పూట పరిమిత వేగంతో ప్రయాణించడం చాలా ముఖ్యం. తక్కువ వెలుతురులో ఏదైనా అడ్డంకిని చూశాక స్పందించడానికి తక్కువ సమయం ఉంటుంది. ముందు వెళ్తున్న వాహనానికి, మీ కారుకు మధ్య దూరం ఎక్కువగా ఉండేలా చూసుకోండి. దీనివల్ల అకస్మాత్తుగా బ్రేక్ వేయాల్సి వచ్చినా మీకు తగినంత సమయం లభిస్తుంది.
ఏకాగ్రత దెబ్బతినకుండా..డ్రైవింగ్ చేసేటప్పుడు పరధ్యానంగా అస్సలు ఉండకూడదు. కారు డ్యాష్‌బోర్డ్ వెలుతురు మరీ ఎక్కువగా ఉంటే నైట్ విజన్ దెబ్బతింటుంది, కాబట్టి దానిని కళ్లకు ఇబ్బంది లేకుండా సర్దుబాటు చేయాలి. పెద్ద శబ్దంతో మ్యూజిక్ వినడం, ఫోన్ వాడటం లేదా తోటి ప్రయాణికులతో సుదీర్ఘ చర్చలు చేయడం వల్ల ఏకాగ్రత తగ్గుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వర్షం, పొగమంచు వంటి వాతావరణ పరిస్థితుల్లో డ్రైవింగ్ ఇంకా కష్టమవుతుంది. అటువంటి సమయాల్లో ఫాగ్ ల్యాంప్స్ వాడుతూ, అతి తక్కువ వేగంతో ప్రయాణించాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ నైట్ జర్నీ ఎంతో సురక్షితంగా సాగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
