NHAI Issues Public Advisory Against Fraudulent FASTag Annual Pass Websites: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తాజాగా వాహనదారులకు ఒక కీలక హెచ్చరిక జారీ చేసింది. ఫాస్టాగ్ వార్షిక పాస్ (FASTag Annual Pass) సేవల పేరుతో అమాయక వినియోగదారులను మోసం చేస్తున్న నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అధికారిక పోర్టల్స్‌ను పోలి ఉండేలా వెబ్‌సైట్లను సృష్టించి, స్కామర్లు డబ్బులు కాజేస్తున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ గుర్తించింది. ఆర్థిక నష్టాలను నివారించడానికి కేవలం ధృవీకరించబడిన మార్గాల ద్వారానే ఫాస్టాగ్ సేవలను పొందాలని అథారిటీ స్పష్టం చేసింది.

Continues below advertisement

Continues below advertisement

నకిలీ ఫాస్టాగ్ స్కామ్ ఎలా జరుగుతుంది?స్కామర్లు అసలైన ఫాస్టాగ్ పోర్టల్స్‌ను తలపించేలా నకిలీ వెబ్‌సైట్లను రూపొందిస్తున్నారు. గూగుల్ సెర్చ్ ఇంజిన్లలో పెయిడ్ అడ్వర్టైజ్‌మెంట్స్, ఎస్‌ఈఓ (SEO) టెక్నిక్స్ ఉపయోగించి ఈ ఫేక్ సైట్లు అగ్రస్థానంలో కనిపించేలా చేస్తున్నారు. వినియోగదారులు పొరపాటున ఈ వెబ్‌సైట్లను ఓపెన్ చేయగానే మొబైల్ నంబర్, వాహన రిజిస్ట్రేషన్ వివరాలు, పేమెంట్ సమాచారాన్ని నమోదు చేయాలని అడుగుతారు. ఆ ఇంటర్‌ఫేస్ చూడటానికి అచ్చం ప్రభుత్వం వెబ్‌సైట్‌లాగే ఉండటంతో చాలామంది నమ్ముతున్నారు. అక్కడ చెల్లింపు చేసిన వెంటనే ఆ డబ్బు మోసగాళ్ల ఖాతాల్లోకి వెళ్లిపోతుంది. యూజర్లకు ఎటువంటి ఫాస్టాగ్ పాస్ జారీ కాకపోగా, ఒక్కోసారి ఫేక్ రశీదులు ఇచ్చి నమ్మిస్తున్నారు.

మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ప్రభుత్వ హెచ్చరిక - సైబర్ క్రైమ్ అలర్ట్..గతంలోనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఈ మోసాలపై వాహనదారులను హెచ్చరించింది. హైవే యూజర్లను టార్గెట్ చేసేందుకు స్కామర్లు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను అడ్డం పెట్టుకుంటున్నారు. ఈ వెబ్‌సైట్లు చాలా పక్కాగా రూపొందుతుండటం వల్ల అసలైన వెబ్‌సైట్‌కు, నకిలీ దానికి మధ్య తేడాను గుర్తించడం సామాన్యులకు కష్టంగా మారుతోంది. సెర్చ్ ఇంజిన్లలో వచ్చే స్పాన్సర్డ్ లింక్స్ క్లిక్ చేయడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

సురక్షితంగా ఉండటానికి సూచనలు:

ఈ తరహా మోసాల బారిన పడకుండా ఉండేందుకు ఎన్‌హెచ్‌ఏఐ కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ఫాస్టాగ్ వార్షిక పాస్ సేవల కోసం ఎల్లప్పుడూ 'రాజ్ మార్గ్ యాత్ర' (Rajmargyatra) వంటి అధికారిక ప్రభుత్వ యాప్‌లను మాత్రమే వాడాలి. ఆన్‌లైన్ సెర్చ్ చేసేటప్పుడు అపరిచిత ప్రకటనలు లేదా స్పాన్సర్డ్ లింక్‌లను క్లిక్ చేయడం మానుకోవాలి. ఏదైనా వెబ్‌సైట్‌లో పేమెంట్ చేసే ముందు దాని యూఆర్ఎల్ (URL) స్పెల్లింగ్‌ను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. మీ ఓటీపీ (OTP), కార్డ్ వివరాలు లేదా లాగిన్ క్రెడెన్షియల్స్‌ను ఎవరితోనూ షేర్ చేయకూడదు. ఏదైనా వెబ్‌సైట్ అనుమానాస్పదంగా కనిపించినా లేదా అసాధారణ పర్మిషన్లు అడిగినా వెంటనే దాని నుండి బయటకు రావాలి. డిజిటల్ పేమెంట్ మోసాలు పెరుగుతున్న తరుణంలో, ప్రాథమిక ఆన్‌లైన్ భద్రతా నియమాలు పాటించడం వల్ల మీ కష్టార్జితాన్ని కాపాడుకోవచ్చు. హైవేలపై ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు పాటిస్తే సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండవచ్చు. 

మరిన్ని ఆసక్తికరమైన వెబ్‌స్టోరీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి