NHAI Guidelines for Mandatory FASTag Placement Rule: ఇండియాలో హైవేల మీద ప్రయాణించే వారికి ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) టెక్నాలజీతో పనిచేసే ఈ సిస్టమ్ ద్వారా టోల్ ప్లాజాల వద్ద ఆటోమేటిక్ గా పేమెంట్లు జరుగుతాయి. అయితే ఇటీవల చాలా మంది వాహనదారులు ఫాస్ట్‌ట్యాగ్ విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) గుర్తించింది. ముఖ్యంగా ట్యాగ్‌ను వాహనం అద్దానికి అతికించకుండా, టోల్ వద్దకు రాగానే చేత్తో పట్టుకుని చూపిస్తున్నారు. దీనివల్ల స్కానింగ్ సరిగ్గా అవ్వక ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్ హెచ్ ఏ ఐ తాజాగా కఠిన మార్గదర్శకాలను విడుదల చేసింది.

Continues below advertisement

స్క్రీన్ కే ఉండాలి - లేదంటే బ్లాక్‌లిస్ట్..నేషనల్ హైవే అథారిటీ నిబంధనల ప్రకారం.. ఫాస్ట్‌ట్యాగ్ అనేది వాహనం ముందు అద్దం (Windscreen) మీద నిర్దేశించిన చోట ఖచ్చితంగా అతికించి ఉండాలి. అప్పుడే ప్లాజాల వద్ద ఉండే ఆర్‌ఎఫ్ఐడీ రీడర్లు దాన్ని సులభంగా స్కాన్ చేస్తాయి. కానీ కొంతమంది యూజర్లు దీన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు. దీనిపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఎన్ హెచ్ ఏ ఐ, నిబంధనలు పాటించని వారి ఫాస్ట్‌ట్యాగ్‌లను బ్లాక్‌లిస్ట్ చేస్తామని స్పష్టం చేసింది. భవిష్యత్తులో బారియర్ లెస్ టోలింగ్ (Barrier-free tolling) సిస్టమ్స్ వస్తున్న నేపథ్యంలో ఈ రూల్స్ మరింత కఠినంగా అమలు కానున్నాయి.

అతికించడం వల్ల కలిగే లాభాలు..ఫాస్ట్‌ట్యాగ్‌ను విండ్‌స్క్రీన్ మీద ఫిక్స్ చేయడం వల్ల ప్రయాణం స్మూత్ గా సాగుతుంది. టోల్ వద్ద స్కానింగ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది అనవసరమైన ఆలస్యాన్ని తగ్గిస్తుంది. అలాగే ఒకే ట్యాగ్‌ను వేర్వేరు వాహనాల మీద వాడే మోసాలకు కూడా ఇది అడ్డుకట్ట వేస్తుంది. ఒక్కసారి ట్యాగ్‌ను అద్దానికి అతికించిన తర్వాత దాన్ని తీయడం కష్టం కాబట్టి, మోసపూరిత పనులకు ఆస్కారం ఉండదు. ట్రాఫిక్ రద్దీని తగ్గించి రోడ్డు భద్రతను మెరుగుపరచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

Continues below advertisement

ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ స్కామ్..మరోవైపు ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరలేపారు. ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్ (Annual Pass) పేరుతో నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి డబ్బులు వసూలు చేస్తున్నారు. అధికారిక వెబ్‌సైట్లను పోలి ఉండే ఈ ఫేక్ సైట్ల ద్వారా ప్రజల పర్సనల్ డేటాను, బ్యాంక్ వివరాలను దొంగిలిస్తున్నారు. దీనిపై ఎన్ హెచ్ ఏ ఐ ప్రజలను హెచ్చరించింది. ఎప్పుడూ కూడా ప్రభుత్వం గుర్తింపు పొందిన 'రాజ్ మార్గ్ యాత్ర' (Rajmargyatra) యాప్ ద్వారానే ఫాస్ట్‌ట్యాగ్ సేవలను పొందాలని సూచించింది.

సురక్షితంగా ఉండటానికి చిట్కాలు..ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసేటప్పుడు వచ్చే స్పాన్సర్డ్ లింక్స్ లేదా తెలియని లింక్స్ మీద క్లిక్ చేయవద్దు. ఏదైనా పేమెంట్ చేసే ముందు వెబ్‌సైట్ యూఆర్ఎల్ (URL) కరెక్టో కాదో చెక్ చేసుకోండి. ఓటీపీ (OTP), కార్డ్ వివరాలు, లాగిన్ పాస్‌వర్డ్స్ వంటి గోప్యమైన సమాచారాన్ని ఎవరితోనూ షేర్ చేయకూడదు. ఏదైనా వెబ్‌సైట్ అనుమానాస్పదంగా అనిపించినా లేదా అనవసరమైన పర్మిషన్లు అడిగినా వెంటనే దాన్ని క్లోజ్ చేయాలి. వాహనదారులు ఈ జాగ్రత్తలు పాటిస్తే తమ ప్రయాణం సురక్షితంగా ఉండటమే కాకుండా సైబర్ మోసాల నుండి కూడా రక్షణ పొందవచ్చు.