New Year Celebration 2026 : కొత్త సంవత్సర వేడుకల్లో తరచుగా ప్రజలు పార్టీలు చేసుకుంటారు, కానీ మీరు మద్యం సేవించి వాహనం నడిపితే అది మీకు ప్రమాదకరంగా మారడమే కాకుండా ఖరీదైనదిగా కూడా మారవచ్చు. భారతదేశంలో డ్రింక్ అండ్ డ్రైవ్ కోసం ట్రాఫిక్ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. దీని ఉద్దేశ్యం రోడ్డు ప్రమాదాలు, ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించడం.
కొత్త సంవత్సర పార్టీ వేడుకల కోసం వివిధ రాష్ట్రాల ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీలను జారీ చేశారు, ఇందులో ప్రజలకు డ్రంక్ అండ్ డ్రైవ్‌కు సంబంధించిన సూచనలు ఇచ్చారు. దీంతో పాటు మీ చలాన్ ఎంత అవుతుందో కూడా తెలిపారు.
ఇంత జరిమానా చెల్లించాల్సి ఉంటుంది
ఇటీవల భోపాల్ ట్రాఫిక్ పోలీస్ అదనపు డీసీపీ బసంత్ కౌల్ మాట్లాడుతూ, డ్రింక్ అండ్ డ్రైవ్ లో వాహనం పట్టుబడితే కనీసం 5 వేల రూపాయల నుంచి 10 వేల రూపాయల వరకు జరిమానా విధించవచ్చని తెలిపారు. ఈ జరిమానా కోర్టు ద్వారా నిర్ణయం అవుతుందని అన్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరుస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్‌లో భారీ జరిమానా
హైదరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ తాగి వాహనం నడిపి జైలుకు వెళ్తారా లేకుండా క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్తారో మీ ఇష్టమని చెప్పేశారు. తాగి వాహనం నడిపిన వారికి 10 వేల రూపాయల జరిమానాతోపాటు ఆరు నెలల జైలు శిక్ష, వాహనం స్వాధీనం, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టం చేసారు.
డ్రైవర్ కు ఈ పరీక్ష చేస్తారు
డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులో వాహన డ్రైవర్ కు బ్రెత్ ఎనలైజర్ టెస్ట్ చేస్తారు, ఇందులో వాహన డ్రైవర్ ను బ్రెత్ ఎనలైజర్ మెషిన్ లోకి ఊదమని చెబుతారు. 100ML రక్తంలో 30MG కంటే ఎక్కువ ఆల్కహాల్ పరిమాణం ఉన్నా లేదా డ్రగ్స్ ఉన్నా భారతీయ చట్టం ప్రకారం వ్యక్తిని శిక్షించవచ్చు.
ఎంత శిక్ష పడుతుంది?
భారతదేశంలో మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం మద్యం సేవించి వాహనం నడపడం చట్టవిరుద్ధం. ఇలా చేస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. మొదటిసారి పట్టుబడితే 10 వేల రూపాయల వరకు జరిమానా, 6 నెలల వరకు జైలు శిక్ష పడవచ్చు. దీంతో పాటు పోలీసులు మీ లైసెన్స్ ను సీజ్ కూడా చేయవచ్చు. మీరు మళ్ళీ మద్యం సేవించి వాహనం నడిపితే, 15 వేల రూపాయల వరకు జరిమానా, 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దీంతో పాటు లైసెన్స్ ను ఎక్కువ కాలం రద్దు చేయవచ్చు లేదా సస్పెండ్ చేయవచ్చు.