New Kia Seltos 2026 Features: మిడ్‌ సైజ్‌ SUV సెగ్మెంట్‌లో పోటీ పెరిగిన కీలక తరుణంలో, కియా, తన పాపులర్‌ SUV సెల్టోస్‌ను పూర్తిగా కొత్త జనరేషన్‌లో తీసుకొచ్చింది. సాధారణంగా ఫేస్‌లిఫ్ట్‌ లేదా చిన్న అప్‌డేట్‌లకే పరిమితమయ్యే కంపెనీలు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ కియా మాత్రం ఈసారి ఒక అడుగు ముందుకేసి, ప్లాట్‌ఫామ్‌నే మార్చేసింది. అదే కొత్త సెల్టోస్‌ను పాత మోడల్‌తో పోలిస్తే పూర్తిగా వేరే స్థాయిలో నిలబెట్టింది.

Continues below advertisement

1. సెగ్మెంట్‌లోనే అతి పొడవైన సెల్టోస్‌

కొత్త సెల్టోస్‌లో వచ్చిన అతిపెద్ద మార్పు సైజ్‌. పాత మోడల్‌తో పోలిస్తే ఇది 95 మిల్లీమీటర్లు ఎక్కువ పొడవు, 30 మిల్లీమీటర్లు ఎక్కువ వెడల్పు పొందింది. ఇందులో ముఖ్యంగా 80 మిల్లీమీటర్లు వీల్‌బేస్‌ పెరగడం వల్ల లోపల కంఫర్ట్‌ స్థాయి గణనీయంగా పెరిగింది. వెనుక సీట్లో కూర్చున్నప్పుడు లెగ్‌రూమ్‌ స్పష్టంగా మెరుగ్గా అనిపిస్తుంది. రోడ్డుపై కూడా ఈ SUV మరింత బలమైన ప్రెజెన్స్‌ చూపిస్తుంది. ప్రస్తుతం ఇది తన సెగ్మెంట్‌లోనే అతి పొడవైన SUVగా నిలిచింది. బూట్‌ స్పేస్‌ కూడా 447 లీటర్లకు పెరిగింది.

Continues below advertisement

2. మరింత పెద్ద, ఆధునిక స్క్రీన్లు

కొత్త సెల్టోస్‌లో కియా తీసుకొచ్చిన పానోరమిక్‌ ట్రినిటీ డిస్‌ప్లే ప్రధాన ఆకర్షణ. ఇందులో 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌, 12.3 అంగుళాల డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, అలాగే 5 అంగుళాల HVAC కంట్రోల్‌ స్క్రీన్‌ ఉన్నాయి. పాత మోడల్‌లో ఉన్న 10.25 అంగుళాల స్క్రీన్లతో పోలిస్తే ఇవి చాలా అడ్వాన్స్‌డ్‌. కొత్త సాఫ్ట్‌వేర్‌ ఇంటర్‌ఫేస్‌ వేగంగా స్పందిస్తుంది. ముఖ్యంగా టచ్‌ స్క్రీన్‌పై మాత్రమే ఆధారపడకుండా, అవసరమైన చోట ఫిజికల్‌ బటన్‌లు ఉంచడం డ్రైవింగ్‌ను సులభంగా చేస్తోంది.

3. డ్రైవర్‌కు మరింత లగ్జరీ అనుభవం

టాప్‌ GTX వేరియంట్‌లో 10 వే పవర్‌‌ అడ్జస్టబుల్‌ డ్రైవర్‌ సీట్‌ అందిస్తున్నారు. లంబర్‌ సపోర్ట్‌కు కూడా ఎలక్ట్రిక్‌ అడ్జస్ట్మెంట్‌ ఉంది. అంతేకాదు, మెమరీ ఫంక్షన్‌, వెల్‌కమ్‌ ఫంక్షన్‌ కూడా ఉన్నాయి. డోర్‌ తెరిచిన వెంటనే సీట్‌ వెనక్కి జరగడం వల్ల ఎంట్రీ, ఎగ్జిట్‌ సులభంగా ఉంటుంది. పార్క్‌ చేసినప్పుడు పూర్తిగా వెనక్కి వాలే రిలాక్సేషన్‌ మోడ్‌ కూడా ఇవ్వడం విశేషం. వెంటిలేటెడ్‌ సీట్‌, హాలో హెడ్‌రెస్ట్‌లు లగ్జరీ ఫీల్‌ను మరింత పెంచుతాయి.

4. ఇంకా బలమైన సేఫ్టీ ప్యాకేజ్‌

పాత సెల్టోస్‌లో ఉన్నట్లే, కొత్త మోడల్‌లో కూడా లెవల్‌ 2 ADAS ఉంది. కానీ ఈసారి సెల్టోస్‌ ఒక సాఫ్ట్‌వేర్‌ డిఫైన్డ్‌ వెహికల్‌. అంటే భవిష్యత్‌లో OTA అప్‌డేట్‌ల ద్వారా లెవల్‌ 2 ప్లస్‌ ADASకు అప్‌గ్రేడ్‌ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కూడా సేఫ్టీ అసిస్ట్‌లు మరింత విస్తృతంగా ఉన్నాయి. అదనంగా, ఇప్పుడు 10 పార్కింగ్‌ సెన్సర్లు అందిస్తున్నారు.

5. చిన్న చిన్న ప్రీమియం టచ్‌లు

ఫ్లష్‌ ఫిట్టింగ్‌ డోర్‌ హ్యాండిల్స్‌, ఆటోమేటిక్‌గా తెరుచుకునే విధానం, బానెట్‌ను పట్టే గ్యాస్‌ స్ట్రట్స్‌, యానిమేటెడ్‌ వెల్‌కమ్‌ హెడ్‌ల్యాంప్స్‌, 64 కలర్‌ అంబియంట్‌ లైటింగ్‌ వంటి చిన్న విషయాలు కూడా సెల్టోస్‌ను మరింత ప్రీమియంగా మార్చాయి.

మొత్తానికి, కొత్త కియా సెల్టోస్‌ మిడ్‌ సైజ్‌ SUV సెగ్మెంట్‌లో కొత్త బెంచ్‌మార్క్‌గా నిలవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. 2026 జనవరి 2న ధరలు ప్రకటించనున్నారు. కొత్త టాటా సియెర్రా, త్వరలో వచ్చే రెనాల్ట్‌ డస్టర్‌ మధ్య ఈ సెల్టోస్‌ పోటీ ఎలా ఉండబోతోందో చూడాలి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.