New Hyundai SUV India 2026: భారత ఆటో మార్కెట్‌లో హ్యుందాయ్ నుంచి మరో కొత్త సర్‌ప్రైజ్‌ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా, కొత్త హ్యుందాయ్ SUV ఒకటి ముంబై రోడ్లపై టెస్టింగ్‌లో తొలిసారి కనిపించింది. ఈ SUV పూర్తిగా కొత్త మోడల్‌గా భావిస్తున్నారు. ఇప్పటివరకు భారత్‌లో ఎక్కడా కనిపించని ఈ వాహనం, డిజైన్‌ పరంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

లుక్‌ & డిజైన్‌ ఇలా ఉండొచ్చు!స్పై ఫోటోల ప్రకారం, ఈ కొత్త హ్యుందాయ్ SUVకి నిటారుగా ఉండే SUV తరహా స్టాన్స్‌, బాక్సీ డిజైన్‌ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. మందపాటి MRF టైర్లు, సుమారు 16 అంగుళాల డ్యూయల్‌ టోన్‌ డైమండ్‌ కట్‌ అలాయ్ వీల్స్‌ దీనికి మస్కులర్‌ లుక్‌ను ఇస్తున్నాయి. వీల్‌ ఆర్చ్‌ల చుట్టూ ప్లాస్టిక్‌ బాడీ క్లాడింగ్‌ ఉండటం వల్ల ఇది ఆఫ్‌ రోడ్‌ స్పూర్తితో రూపొందించిన మోడల్‌గా అనిపిస్తోంది.

డిజైన్‌ వివరాల్లోకి వెళ్తే, ఫ్లష్‌ ఫిట్టింగ్‌ డోర్‌ హ్యాండిల్స్‌, మందపాటి C పిలర్‌, బ్లాక్‌ రూఫ్‌ రైల్స్‌ స్పష్టంగా కనిపిస్తున్నాయి. డాటెడ్ ప్యాటర్న్‌లో ఉన్న LED టెయిల్‌ల్యాంప్స్‌ ఈ కారు వెనుక భాగంలో ప్రత్యేకంగా కనిపించే అంశం. ఇవి హ్యుందాయ్ Ioniq 5 నుంచి ప్రేరణ పొందినట్లుగా కనిపిస్తున్నాయి. అలాగే, ఫంకీ డిజైన్‌ ఉన్న రియర్‌ స్పాయిలర్‌, అందులోనే ఇంటిగ్రేట్‌ చేసిన స్టాప్‌ ల్యాంప్‌ ఈ SUVకి మరింత ఆధునిక లుక్‌ను ఇస్తున్నాయి.

ఇంకా గమనించదగిన అంశాల్లో షార్క్‌ ఫిన్‌ యాంటెన్నా, వెనుక వైపు పైకి వంపు తిరిగిన బ్లాక్‌డ్‌ అవుట్‌ విండో లైన్‌, ఫ్లాట్‌ టెయిల్‌ గేట్‌, నంబర్‌ ప్లేట్‌ను హౌస్‌ చేసే బీఫీ రియర్‌ బంపర్‌ ఉన్నాయి. మొత్తం చూసుకుంటే, ఇది ఇప్పటివరకు హ్యుందాయ్ నుంచి వచ్చిన SUVలకంటే భిన్నమైన డిజైన్‌ లాంగ్వేజ్‌ను అనుసరించినట్లు తెలుస్తోంది.

ఇంటీరియర్‌ ఇలా ఉండొచ్చు!ఇంటీరియర్‌ విషయానికి వస్తే, స్పై షాట్స్‌లో కేబిన్‌ స్పష్టంగా కనిపించకపోయినా, కొన్ని కీలక వివరాలు బయటపడ్డాయి. ఇందులో సుమారు 10 అంగుళాల డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, పెద్ద టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ORVMలపై కనిపించిన నోడ్యూల్స్‌ ఆధారంగా, ఈ SUVలో 360 డిగ్రీ కెమెరా ఫీచర్‌ కూడా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అసలు ఈ SUV ఏ మోడల్‌ అన్నది ఇప్పటివరకు హ్యుందాయ్ స్పష్టం చేయలేదు. అయితే, గత ఏడాది అక్టోబర్‌లో హ్యుందాయ్ తన ఇన్వెస్టర్‌ ప్రెజెంటేషన్‌లో ‘మస్కులర్‌, ఆఫ్‌ రోడ్‌ సామర్థ్యం ఉన్న కొత్త SUV’ గురించి టీజ్‌ చేసింది. ఇదే ఆ మోడల్‌ కావచ్చని ఆటో వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది మోనోకాక్‌ ప్లాట్‌ఫామ్‌పై, ఆల్‌ వీల్‌ డ్రైవ్‌ సిస్టమ్‌తో రావచ్చని సమాచారం. మరోవైపు, ఇది Kia EV2కి హ్యుందాయ్ వెర్షన్‌, అంటే చిన్న ఎలక్ట్రిక్ SUV అయ్యే అవకాశం కూడా ఉందని చర్చ జరుగుతోంది.

మొత్తానికి, ఈ కొత్త హ్యుందాయ్ SUV భారత్‌లో ఎలాంటి సెగ్మెంట్‌ను టార్గెట్‌ చేస్తుందో, ఎలక్ట్రిక్‌ మోడలా లేదా ICE వెర్షనా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కానీ, ఒక విషయం మాత్రం ఖాయం - హ్యుందాయ్ నుంచి రాబోయే ఈ కొత్త SUV మార్కెట్‌లో మంచి ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.