UP Govt on Hybrid Cars: దేశంలో మొట్టమొదటిసారిగా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఆటోమొబైల్ రంగంలో తీసుకున్న నిర్ణయం ఆ నిర్దిష్టమైన శ్రేణిలో మరిన్ని వాహనాలు విడుదల అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో హైబ్రిడ్ కార్ల విషయంలో రోడ్డు పన్నును తీసేసింది. దీంతో ఆ హైబ్రిడ్ కార్ల అమ్మకాల్లో విపరీతమైన పెరుగుదల ఉండడం.. కార్ల కంపెనీలు కూడా ఆ శ్రేణి వాహనాలపై మరింత ఫోకస్ చేస్తున్నట్లుగా మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
శక్తిమంతంగా భావించే హైబ్రిడ్ కార్లు ఆటోమొబైల్ పరిశ్రమలో కాస్త ప్రత్యేకంగా నిలిచాయి. ప్రముఖ కార్ల తయారీ సంస్థలు భవిష్యత్తు మొత్తం ఈవీనే అని భావిస్తున్నప్పటికీ.. షార్ట్ టర్మ్‌లో మాత్రం హైబ్రిడ్ కార్లదే రాజ్యం అని మరో విశ్లేషణ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం హైబ్రిడ్ కార్లలో ప్రధానంగా మారుతీ సుజుకీ, టయోటా ముందంజలో ఉన్నాయి. ఆయా సంస్థలు తయారు చేస్తున్న మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, ఇన్నోవా హైక్రాస్ వంటి వాహనాలను చాలా మంది ఆదరిస్తున్నారు.
దీనికి తోడు యూపీ ప్రభుత్వం కూడా హైబ్రిడ్ మోడళ్లపై రోడ్డు పన్నును తీసేయడంతో.. ఇక హైబ్రిడ్ వాహనాల అమ్మకాలు ఎగబాకుతున్నాయని చెబుతున్నారు. గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, ఇన్నోవా హైక్రాస్ వంటి కార్లు రూ.లక్షల్లో తక్కువ ధరలకు (ఉత్తర్ ప్రదేశ్‌లో) వస్తున్నాయి. యూపీలో అయితే హైక్రాస్ వంటి కార్లు రూ.3 లక్షల దాకా ధర తగ్గుతోంది. గ్రాండ్ విటారా రూ.2 లక్షల వరకు తగ్గుతోంది. రోడ్డు ట్యాక్స్ లేకపోవడం వల్లనే వినియోగదారులకు ఇంత భారీ మొత్తం ఆదా అవుతోంది.
అసలే హైబ్రిడ్ వాహనాలకు ఉన్న ఆదరణతోపాటు ప్రభుత్వం నిర్ణయం కూడా తోడవడంతో ఆ శ్రేణి వాహనాల కొనుగోలు బాగా పెరుగుతోంది. అయితే, కార్ల తయారీ కంపెనీలకు కూడా ఈ పరిణామం.. మరిన్ని హైబ్రిడ్ కార్లు లాంచ్ చేసేందుకు సమయం కావచ్చని అంటున్నారు. దేశంలో ఈవీ విక్రయాలు తగ్గాయి. అదే సమయంలో కొంతమంది కార్‌మేకర్‌లు హైబ్రిడ్ కార్లను పెద్ద సంఖ్యలో విక్రయిస్తున్నారు. టొయోటా, మారుతి సుజుకి వంటి కార్ల తయారీదారులు మాత్రమే హైబ్రిడ్ శ్రేణిని ఉత్పత్తి చేస్తున్నాయి. ఇప్పుడు తాజా ప్రభుత్వ ఆఫర్‌తో మరిన్ని కంపెనీలు కూడా ఈ శ్రేణిపై ఫోకస్ చేస్తాయని అంటున్నారు. హ్యుందాయ్ గ్రూప్ ఇండియా కోసం మరిన్ని హైబ్రిడ్ కార్లను ప్లాన్ చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
హైబ్రిడ్ కార్లు భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ అమ్మకాలలో విజృంభిస్తున్నాయి. చాలా మంది కార్ల తయారీదారులు తమ గ్లోబల్ పోర్ట్‌ఫోలియోలో హైబ్రిడ్ టెక్నాలజీని కలిగి ఉన్నప్పటికీ, ట్యాక్స్‌ల కారణంగా ఆ కార్ల ధరలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ గ్రీన్ డ్రైవ్ చొరవను ప్రకటించడంతో, ఎక్కువ మంది కార్ల తయారీదారులు హైబ్రిడ్‌లను తీసుకురావడానికి ఉత్సాహం చూపుతున్నారు. వాస్తవానికి, హ్యుందాయ్ వంటి కార్ల తయారీదారు తమ అమ్ముడవుతున్న ఎస్‌యూవీ అయిన క్రెటా నుంచి హైబ్రిడ్ వెర్షన్‌ను తీసుకురావడానికి ప్రయత్నించే అవకాశం లేకపోలేదు. హైబ్రిడ్ కార్లకు రిజిస్ట్రేషన్ ఫీజును మాఫీ చేసిన మొదటి రాష్ట్రంగా యూపీ ఉండగా.. ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని అనుసరిస్తాయని అంటున్నారు.