Monsoon rains car accessories: వర్షాకాలంలో కారు నడపడం అంత సులభం కాదు. రహదారిపై నీరు నిలవడం, బ్రేక్‌ వేస్తే జారే రోడ్లు, విజిబిలిటీ తగ్గడం వంటివి వాహనదారులను చాలా చికాకు పెడతాయి. రాత్రివేళ ఈ సమస్య మరింత పెరుగుతుంది. విండ్‌షీల్డ్‌పై నీటి బిందువులు చేరితే ముందున్న రోడ్డు స్పష్టంగా కనిపించదు. సైడ్‌ మిర్రర్లపై నీరు చేరినా వెనుక నుంచి వచ్చే వాహనాలను గుర్తించడం కష్టమవుతుంది. ఇలాంటి సమయంలో డ్రైవింగ్‌ నైపుణ్యం ఒక్కటే సరిపోదు, కొన్ని చిన్న పరికరాలు కూడా ఎంతో ఉపయోగపడతాయి.

Continues below advertisement

ఈ వర్షాల సమయంలో, కారుకు అవసరమైన యాక్సెసరీస్‌ను సిద్ధం చేసుకోవడం మంచిది. వీటి కోసం భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. తక్కువ ధరలోనే లభించే కొన్ని పరికరాలు కారుకు, మీకు రక్షణ ఇస్తాయి. డ్రైవింగ్‌ను మరింత సురక్షితంగా మారుస్తాయి.

విండ్‌షీల్డ్‌ స్పష్టంగా కనిపించాలంటే

Continues below advertisement

వర్షం పడుతున్నప్పుడు ముందున్న రహదారి స్పష్టంగా కనిపించడం చాలా ముఖ్యం. ఇందుకోసం హైడ్రోఫోబిక్‌ విండ్‌షీల్డ్‌ స్ప్రే ఉపయోగపడుతుంది. ఇది గాజుపై నీటిని వికర్షించే పలుచని పొరను ఏర్పరుస్తుంది. దీంతో వర్షపు నీటి బిందువులు గాజుపై నిలవకుండా వెంటనే జారిపోతాయి. వైపర్‌ పనితీరుపైనా ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యంగా రాత్రివేళ డ్రైవింగ్‌లో ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

వైపర్‌ బ్లేడ్ల విషయంలోనూ జాగ్రత్త అవసరం. సిలికాన్‌ లేదా ఏరోట్విన్‌ వైపర్‌ బ్లేడ్లు, విండ్‌షీల్డ్‌పై పడిన వర్షపు నీటిని సమర్థంగా తొలగించడంలో సహాయపడతాయి. గాజుపై నీటి మరకలు, గీతలు మిగలకుండా చూస్తాయి. వైపర్‌ బ్లేడ్లను ఆరు నుంచి పన్నెండు నెలలకు ఒకసారి పరిశీలించడం మంచిది.

సైడ్‌ మిర్రర్లకు రెయిన్‌ గార్డులు అమర్చుకోవచ్చు. ఇవి అద్దాలపైకి నీరు చేరకుండా కొంతవరకు అడ్డుకుంటాయి. దీంతో, కారు వెనుక వైపు దృశ్యం మెరుగ్గా కనిపిస్తుంది. దట్టమైన వర్షం, పొగమంచు ఉన్న ప్రాంతాల్లో సరైన లైటింగ్‌ కూడా అవసరం. వాహనానికి అనుకూలమైన LED ఫాగ్‌ లైట్లు ఉపయోగపడవచ్చు.

ఇది కూడా చదవండి: తక్కువ జీతం ఉన్నవారికి బెస్ట్ కార్లు ఇవే.. వీటిపై EMI చాలా తక్కువ

కారు లోపల తేమకు చెక్‌

వర్షాకాలంలో తడి బూట్లు, బురదతో కారు లోపలి భాగం త్వరగా మురికిగా మారుతుంది. కార్పెట్‌లో నీరు చేరితే దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి 7డీ ఫ్లోర్‌ మ్యాట్లు లేదా ఆల్‌ వెదర్‌ మ్యాట్లు ఉపయోగపడతాయి. ఇవి నీరు, బురదను ఒకే చోట నిల్వ ఉంచి కార్పెట్‌ను రక్షిస్తాయి. వీటి ధర సాధారణంగా రూ.2,500 నుంచి రూ.6,000 వరకు ఉంటుంది.

కారులో తేమ ఎక్కువగా ఉంటే అద్దాలకు పొగమంచు పట్టే అవకాశం ఉంది. చిన్న డీహ్యూమిడిఫైయర్‌ తేమను తగ్గించడంలో సహాయపడుతుంది. వీటి ధర సుమారు రూ.500 నుంచి రూ.2,000 వరకు ఉంటుంది. తడి పరిస్థితుల్లో పాదాలు జారకుండా రబ్బరు పెడల్‌ కవర్లు కూడా ఉపయోగపడతాయి.

అత్యవసర సమయంలో ఇవి ఉపయోగకరం

వర్షాకాలంలో టైర్ల పరిస్థితి కీలకం. సరైన PSI లేకపోతే రహదారిపై టైర్‌ గ్రిప్‌ ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే పోర్టబుల్‌ టైర్‌ ఇన్‌ఫ్లేటర్‌ను కారులో ఉంచుకోవడం మంచిది. అవసరమైనప్పుడు టైర్‌లో గాలి నింపుకోవచ్చు. వీటి ధర సుమారు రూ.1,500 నుంచి రూ.4,500 వరకు ఉంటుంది.

వాటర్‌ప్రూఫ్‌ కార్‌ కవర్‌ మీ వాహనాన్ని తేమ నుంచి రక్షిస్తుంది. మైక్రోఫైబర్‌ క్లాత్‌ కూడా కారులో తప్పనిసరిగా ఉంచుకోవాలి. తడి గాజు, డాష్‌బోర్డ్‌ను వెంటనే శుభ్రం చేసుకోవచ్చు.

సైడ్‌ మిర్రర్‌ గార్డుల ధర రూ.200 నుంచి రూ.800 వరకు ఉంటుంది. సిలికాన్‌ వైపర్‌ బ్లేడ్ల ధర సుమారు రూ.500 నుంచి రూ.2,500 వరకు ఉంటుంది. ఖర్చు తక్కువే అయినా వర్షాకాలంలో ఇవి మంచి ఉపయోగాన్ని అందిస్తాయి.

ఇది కూడా చదవండి: భారత్‌లో అత్యంత చవకైన సెడాన్ కారు Tata Tigor తక్కువ ధరకే.. రూ.30000 డిస్కౌంట్

అయితే, యాక్సెసరీస్‌ ఉన్నాయి కదాని కారు ప్రాథమిక భద్రతను మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. బ్రేక్‌లు, హెడ్‌లైట్లు, ఇండికేటర్లు సరిగ్గా పనిచేస్తున్నాయో పరిశీలించాలి. టైర్లలో గాలి ఒత్తిడిని తరచూ చెక్‌ చేయాలి. వైపర్‌ బ్లేడ్లు గాజును సరిగ్గా శుభ్రం చేస్తున్నాయో చూసుకోవాలి. ముఖ్యంగా, హైవేలపై తరచుగా ప్రయాణించేవాళ్లు వర్షాలకు తగ్గట్లుగా ఈ ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. చిన్న ఖర్చుతో కారును అన్ని విధాలా సిద్ధం చేసుకుంటే, వర్షంలో డ్రైవింగ్‌ సమయంలో అనవసరమైన ఇబ్బందులు దరిచేరవు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.